WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

అప్పుడు...డిజిపి...ఇప్పుడు...సిఎం...!

డిఎస్పీ బదిలీలు,పోస్టింగ్‌లు ముఖ్యమంత్రి పర్యవేక్షణలో జరగబోతున్నాయి. మంత్రివర్గ సమావేశంలో దీనిపై సిఎం చంద్రబాబు తన వైఖరిని తెలిపారు. రాజకీయ,అధికార పైరవీలకు తెరదించేందుకే సిఎం ఆ నిర్ణయం తీసుకున్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. దీనిపై కొందరు అధికారులు హోంమంత్రి చినరాజప్పకు తెలియజేయగా...ఆయన స్పందిస్తూ 'చాలా మంచి పరిణామమని...దీన్ని ఆహ్వానిస్తున్నానని' చెప్పారు. డిఎస్పీ బదిలీలను డిజిపి ఛైర్మన్‌గా ఉన్న కమిటీ నిర్ణయించాలని 'సుప్రీంకోర్టు' ఉత్తర్వులు ఉన్నాయి. దీనిని ఎలా ఉల్లంఘిస్తారు..సిఎం ఎలా కలగచేసుకుంటారు? అని ఒక పోలీసు ఉన్నతాధికారిని 'జనం ప్రత్యేక ప్రతినిధి' స్వయంగా కలసి ప్రశ్నించగా ఆయన స్పందిస్తూ...ఇంత వరకు ఇలాంటి పద్దతి లేదు..మంత్రివర్గ సమావేశంలో సిఎం ఏం చెప్పారో నాకు తెలియదన్నారు. అసలు విషయం ఏమిటంటే డిఎస్పీ పోస్టింగ్‌,బదిలీలు చేసే ముందు సంబంధిత అధికారుల చరిత్రను పూర్తిగా విచారణ జరిపి దానిపై ఒక నిర్ణయం తీసుకుని ఒక పేపర్‌పై అనధికారికంగా ఆయా పేర్లను డిజిపికి పంపడం జరుగుతుందని, దానిని బోర్డులో చర్చించి అమలు చేసే అవకాశాలు ఉన్నాయని కొందరు అధికారులు చెబుతున్నారు.ఏ ప్రాతిపదికన బదిలీలు, పోస్టింగ్‌లను సిఎం నిర్ణయిస్తారని ప్రశ్నించగా అది 'మీరు నన్ను అడగాల్సిన ప్రశ్న కాదని' తెలివిగా తప్పుకున్నారు. ఇంటిలిజెన్స్‌ వర్గాల ద్వారా అధికారుల పనితీరును తెలుసుకుని వారిలో సమర్థులు, నిజాయితీపరులైన అధికారులను వడపోసి వారిని శాంతిభద్రతలను పర్యవేక్షించే అధికారులుగా నియమించాలనేది 'బాబు' ఆలోచన. ఈ ఆలోచన మంచిదైనప్పటికీ ఎవరైనా 'సుప్రీంకోర్టు'కు వెళ్లి ఈ బదిలీలు,పోస్టింగ్‌లపై కేసు వేస్తే పరిస్థితి ఏమిటి? ఆయా బదిలీలు,పోస్టింగ్‌లకు సంబంధించిన పోలీసుల అధికార్ల పేర్లను సిఎం అధికారపూర్వకంగా సిఫార్సు చేసినట్లుగా ఉండదని అటువంటప్పుడు ఎవరు ఏ కేసు వేసినా ప్రభుత్వానికి ఏమీ నష్టం ఉండదని అన్నారు. చివరకు ఈ బదిలీలు ఎలా జరగబోతున్నాయంటే ఇంటిలిజెన్స్‌ వర్గాలతో పాటు ఇతర వర్గాల ద్వారా డిఎస్పీల పనితీరును రహస్యంగా విచారణ జరిపించి వారిలో కొందరిని గుర్తించి ఆయా పేర్లను అనధికారికంగా డిజిపికి పంపుతారు. ఆ జాబితాను అనధికారికంగా బోర్డులో పెట్టి యధావిధంగా డిజిపి ఆమోదించేటట్లు చేస్తారని అధికారులు చెబుతున్నారు. ఈ బోర్డులో డిజిపితో పాటు లా అండ్‌ ఆర్డర్‌ డిజిపి సంబందించిన జోన్‌లు ఐజిలు సభ్యులుగా ఉంటారు. అందరూ ఒకే జాతి వారు కావడంతో ఎలాంటి ఇబ్బందులు ఉండవని సిఎం పంపిన జాబితాను యధావిధంగా ఆమోదించి ఆదేశాలు జారీ చేస్తారు. ఈ ఆదేశాలు జారీ చేసే ముందు తయారు చేసిన జాబితాను హోంమంత్రికి తప్పనిసరిగా చూపించాల్సిందిగా సిఎం ఆదేశించారు.

(153)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ