WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'సుజాత' అవుట్‌...! 'జ్యోతుల' డౌట్‌...శివరామరాజు ఇన్‌...!

ఉభయగోదావరి జిల్లాల్లో నలుగురు మంత్రులు ఉండగా అందులో ఒకరు బిజెపికి చెందిన వారు. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పల్లో యనమల పనితీరుపైనే విమర్శలు వస్తున్నాయి. ఆయన అదనంగా నిర్వహిస్తున్న కమర్షియల్‌ ట్యాక్స్‌ను ఆయనను నుండి తప్పించవచ్చు. హోంమంత్రి చినరాజప్పను హోంశాఖ నుంచి తప్పించడం ఖాయం. 'జగన్‌' పార్టీ నుంచి టిడిపిలో చేరిన 'జ్యోతుల నెహ్రూ' మంత్రి పదవిపై ఆశపడుతున్నప్పటికీ...ఆయన ఆశ నిరాశగానే మిగిలే అవకాశం ఉంది. 2009 ఎన్నికలకు ముందు 'రాజప్ప' సామాజికవర్గానికి చెందిన నాయకుల్లో ఎక్కువమంది 'చిరంజీవి' పార్టీలో చేరారు. కానీ 'రాజప్ప' మాత్రమే టిడిపిలోనే కొనసాగి తన విధేయతను నిరూపించుకున్నారు.అటువంటి వీరవిధేయుడైన 'రాజప్ప'ను తొలగించి 'జ్యోతుల'కు మంత్రి పదవి ఎలా కట్టబెడతారని? టిడిపి సీనియర్‌ నాయకులు ప్రశ్నిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 'పీతల సుజాత'ను మంత్రి పదవి నుండి తొలగించడం ఖాయమని, ఆమె వచ్చిన అవినీతి ఆరోపణలే దీనికి కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆమెపై వచ్చినన్ని ఆరోపణలు ఇంకెవరిపై రాలేదని ఆయా వర్గాలు అంటున్నాయి. తనను మంత్రి పదవి నుంచి తొలగించరని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ లోలోన ఆమె దిగాలు చెందుతున్నారు. ఈ రెండు సంవత్సరాల్లో ఆమె పనితీరుపై రహస్యంగా విచారణ జరిపించిన 'చంద్రబాబు' పలుసార్లు ఆమెను హెచ్చరించినా ఆమె తన వైఖరిని మార్చుకోలేదు. మిత్రపక్షమైన బిజెపికి చెందిన మంత్రి మాణిక్యాలరావును మంత్రి పదవి నుండి తొలగించకపోయినా...ఆయన నిర్వహిస్తున్న దేవాదాయశాఖను మార్చే అవకాశం ఉంది. సీనియర్‌ ఎమ్మెల్యే శివరామరాజుకు మంత్రి పదవి ఇవ్వాలని 'బాబు' నిర్ణయించుకున్నారట. ఆయన సామాజికవర్గానికి చెందిన వారెవరూ మంత్రివర్గంలో లేకపోవడం ఆయనకు కలసివస్తుందని చెబుతున్నారు. వరుసగా రెండుసార్లు ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన నిజాయితీపరుడిగా పేరు తెచ్చుకున్నారు. ఈ రెండు జిల్లాల్లో ప్రస్తుతం పదవిలో ఉన్న ఒకరిని తొలగించి మరో ఎమ్మెల్యేకు ఛాన్స్‌ వచ్చే అవకాశం ఉంది.

(1081)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ