WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'పవన్‌'కు క్లారిటీ ఉందా...?

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేదని సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు 'పవన్‌కళ్యాణ్‌' ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు..విమర్శలు చేస్తున్నారు..ఆంధ్రాను కాంగ్రెస్‌ వెన్నుపోటు పొడిస్తే...బిజెపి కడుపులో పొడిచిందని ఆరోపిస్తున్నారు.. ఇటీవల తిరుపతి సభలో ప్రత్యేక హోదాపై 'పవన్‌' వేసిన ప్రశ్నలు ఆంధ్రా'జనాన్ని' భాగానే ఆకట్టుకున్నాయి. 'పవన్‌' చెప్పినదానిలో నిజం ఉంది కదా? అని అందరూ ప్రశ్నించారు. 'పవన్‌' వేసిన ప్రశ్నలకు అధికారపక్షం నుంచి ఎటువంటి సమాధానం లేదు. తిరుపతి సభ అనంతరం కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం తాము ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని తేల్చి చెప్పింది. హోదా స్థాయిలో ప్యాకేజీ ఇస్తామని మంత్రులు అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు తదితరులు స్పష్టత ఇచ్చారు. ఈ విషయంపై రెండు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కూడా జరుగుతోంది. హోదా లేదు...ప్యాకేజీయేనని కేంద్రం చెప్పడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రస్తుత అవసరాల దృష్ట్యా సర్దుకుని వారు ఏమి ఇస్తే అది తీసుకోవాలని భావించి ప్యాకేజీని స్వాగతించారు. అదే సమయంలో హోదా కోసం పట్టుపడతామని విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. దాంతో ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు, టిడిపి వైఖరి తేటతెల్లం అయింది. ఇక ప్రధాన ప్రతిపక్షం వైకాపా ఈ విషయంలో మొదటి నుంచి స్పష్టతతోనే ఉంది. ప్రత్యేకహోదా కావాల్సిందేనని, దాని కోసం తాము పోరాటం చేస్తామని ప్రకటించి ఆ మేరకు కార్యక్రమాలు అమలు చేస్తోంది. దానిలో భాగంగా శనివారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. అంతే కాకుండా ప్రత్యేక హోదాను తీసుకురాలేకపోయారని అసెంబ్లీలో పోరాటం చేస్తోంది. అసెంబ్లీనీ స్థంభింప చేసి సభా కార్యక్రమాలను అడ్డుకుని తమ ఉద్దేశ్యాన్ని చాటి చెప్పింది. ఇక కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు కూడా వారి శక్తి మేర నిరసన కార్యక్రమాలకు దిగుతున్నాయి. రాష్ట్రంలో వివిధ పార్టీలు తమ తమ ఉద్దేశ్యాలను స్పష్టంగా చెప్పి ముందుకు వెళుతుండగా 'జనసేన' పార్టీ మాత్రం దీనిపై ఎటువంటి కార్యాచరణ ప్రకటించలేదు. తిరుపతి సభ తరువాత కాకినాడ సభలోనైనా 'పవన్‌' క్లారిటీ ఇస్తాడని ఆ పార్టీ సానుభూతిపరులు, ఇతరులు భావించారు. కానీ 'కాకినాడ' సభలో మోడీ, వెంకయ్యపై విమర్శలు చేయడానికే 'పవన్‌' పరిమితమయ్యారు. ఆంధ్రాను బిజెపి ముంచివేసిందని, ఆ పార్టీ నాయకులు ఇతర పార్టీలను చూసుకోవాలని ఆయన ఒక ఉచిత సలహాపారేశారు. అదే సమయంలో అవంతి శ్రీనివాస్‌ను రాజీనామా చేయాలని పిలుపునిచ్చారు..ఆయన రాజీనామా చేస్తే తాను గెలిపిస్తానని హామీ ఇచ్చారు..అసలు సభ ఉద్దేశ్యం ఏమిటో...ఎందుకు సభ నిర్వహిస్తున్నారో అన్న స్పృహ లేకుండా ఒక మాటకు ఒక మాటకు పొంతన లేకుండా ప్రసంగించారు తాను సామాన్య కుటుంబం నుంచి వచ్చానని, ఇతరుల వలే తాతల సంగతి చెప్పడం లేదని కాసేపు, తెలంగాణ గురించి కాసేపు, టిజి వెంకటేష్‌ గురించి కాసేపు ఉద్వేగంగా, ఆవేశంగా ప్రసంగించడం తప్ప తానేం చేస్తానన్న సంగతిని 'పవన్‌' చెప్పలేదు. ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్ష చేస్తారని వచ్చిన వార్తలను ప్రస్తావిస్తూ తాను రాజకీయం చేయడం లేదని, మీరు రాజకీయం కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు. అదే సమయంలో రేపు వైకాపా చేస్తోన్న 'బంద్‌'కు మద్దతు ఇస్తారా అంటే...బంద్‌లు చేయాల్సింది పదవుల్లో ఉన్నవారే చేయాలని...మిగిలిన వారు ఎవరి పని వారు చేసుకోవాలని ముక్తాయిస్తూ పరోక్షంగా బంద్‌కు తన మద్దతు లేదని చెప్పేశారు. మరి ఏ విధంగా 'పవన్‌' ప్రత్యేక హోదా సాధించాలనుకుంటున్నారో ఆయన స్పష్టం చేయలేదు. ఇక ప్రత్యేక హోదా విషయంలో ప్రధానమైన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిని 'పవన్‌' పల్లెత్తిమాట అనలేదు. టిడిపి బాగానే చేస్తుందని ప్రశంసలు కురింపిచారు. 'పవన్‌' తమను విమర్శించకపోవడంతో 'చంద్రబాబు' ఆనందంతో 'పవన్‌' చెప్పిన దాంట్లో వాస్తవం ఉందని ప్రకటించారు. మరి వాస్తవం ఉంటే వారేం చేస్తారో చెప్పి ఉండాల్సింది. రాజకీయవేత్త అయిన 'బాబు' 'పవన్‌' భుజాలపై గన్‌పెట్టి బిజెపిని కాల్చాలనుకుంటున్నారేమో...! మొత్తం మీద 'కాకినాడ'లో 'పవన్‌' ఎందుకు సభ పెట్టారో...ఎందుకు ముగించారో ఎవరికీ అర్థం కాలేదు.
కొసమెరుపు: ఏ దేశమేగినా...ఎందు కాలిడినా...పొగడరా నీ తల్లి భూమి భారతినీ...రాసింది మహాకవి గురజాడ అప్పారావు అని 'పవన్‌' ఆవేశంతో ఊగిపోతూ చెప్పారు..కానీ వాస్తవానికి ఆ గేయాన్ని రాసింది 'రాయప్రోలు సుబ్బారావు'.. గురజాడ రాసింది...'దేశమంటే మట్టికాదో...దేశమంటే మనుషులోయ్‌...'. ఆవేశంతో ఊగిపోతూ...పాటలు పాడుతూ...రంకెలు వేస్తే లక్ష్యాన్ని సాధిస్తామా...?

(1087)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ