WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'నన్ను...తప్పించండి...సార్‌...!

రాయలసీమ జిల్లాలో 'జగన్‌'కు కంచుకోటగా పేరున్న కడప జిల్లాలోని టిడిపి నాయకుల మధ్య నెలకొన్న ముఠా తాగాదాలను పరిష్కరించలేక, ఇక తన వల్ల కాదని ఆ జిల్లా ఇన్‌ఛార్జిమంత్రి పదవి నుంచి తప్పించమని మానవవనరులశాఖ మంత్రి గంటాశ్రీనివాసరావు ముఖ్యమంత్రి చంద్రబాబును స్వయంగా కలసి వాపోయారట. కడప జిల్లాలో చావుతప్పి కన్నులొట్టపోయి కేవలం ఒకే ఒక్క నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి విజయం సాధించగలిగారు. మిగతా నియోజకవర్గాలన్నింటిలోనూ 'జగన్‌' పార్టీ అభ్యర్థులే గెలుపొందారు. అయినప్పటికీ స్థానిక టిడిపి నాయకులు బుద్ది తెచ్చుకోకుండా ముఠా తగాదాల్లో మునిగితేలుతూ అంతో ఇంతో ఉన్న పార్టీ బలాన్ని రోజు రోజుకు దిగజార్చుతున్నారు. అధికారం ఉండడంతో అధికారులతో పనులు చేయించుకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్నారే తప్ప పార్టీ బలం పెంచేందుకు ఒకరు ఇద్దరు నాయకులు తప్ప, మిగతా వారందరూ స్వంత లాభం చూసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే 'జగన్‌' బలం పలుచబడుతున్న నేపథ్యంలో దానిని అనుకూలంగా మలచుకోవాల్సిన నాయకులు తమ స్వార్థం కోసం, ఆధిపత్యం కోసం పార్టీని బలహీనపరుస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్నోసార్లు నియోజకవర్గాల వారీగా నాయకులందరినీ ఒక చోట కూర్చోబెట్టి నచ్చ చెప్పినా ఆ రోజుకు ఊ..కొడుతూ..మరుసటి రోజు నుంచి షరామామూలుగానే వ్యవహరిస్తున్నారు. చెప్పీ చెప్పీ విసిగి వేశారి..ఇక నావల్ల కాదు.. అని చేతులు ఎత్తి దండం పెట్టి మీఖర్మ మీరే అనుభవించండి...అని జిల్లా ఇన్‌ఛార్జిమంత్రి 'గంటా' వాపోతున్నారు. కడప జిల్లాలో పార్టీ బలం పెంచేందుకు 'పెదబాబు'..చినబాబులు ప్రత్యేక దృష్టిసారించినప్పటికీ స్థానిక నాయకులు ఎవరూ దానిని అనుకూలంగా మలచుకోలేకపోతున్నారు. అధికారుల సహాయ సహకారాలతో కాంట్రాక్టర్లు చేజిక్కించుకుంటూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్న కొంత మంది మాత్రమే పార్టీ పట్ల విధేయతను చూపిస్తున్నారని, అటువంటి వారి పేరులతో కూడిన ఒక జాబితాను ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇన్‌ఛార్జి మంత్రి గంటా అందజేశారు. ఈ జిల్లాను ఎలా బాగుచేయాలి..? అని 'పెదబాబు, చినబాబు'లు తలలు పట్టుకుంటున్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, కోడూరు ఎమ్మెల్యే టిడిపిలో చేరినప్పటికీ ఓటర్లు మాత్రం వారి వెంట నడవడం లేదు. స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా వీరిని ఖాతరు చేయడం లేదు. దీంతో ఫిరాయింపులను ప్రోత్సహించడం కన్నా ప్రజాభిమానాన్ని ఎలా పొందాలనేదానిపై 'పెదబాబు..చినబాబు' దృష్టి పెట్టగలిగితే మరికొద్దినెలలకైనా పార్టీ బలం పెరగవచ్చు. కానీ ఈ నాయకుల మధ్య ఉన్న ఆధిపత్యపోరు...విభేదాలు..ముఠాతగాదాలను ఎవరూ మార్పించలేరనే నిర్ణయానికి ఇన్‌ఛార్జి మంత్రి గంటా వచ్చారు. దీంతో తనను కడప జిల్లా నుంచి తప్పించాలని 'చంద్రబాబు'ను పదే పదే వేడుకుంటున్నారట. అధినేత ఆయనపై కరుణించి అక్కడ నుంచి తప్పిస్తారా? లేదా వేచి చూడాల్సిందే...!

(596)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ