WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'కాపు'ల పయనమెటు...?

2014 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి రావడానికి, వై.ఎస్‌.జగన్‌ ప్రతిపక్షహోదాకు పరిమితం కావడానికి పరోక్షంగా కొంత మేర కారకులైన 'కాపు'లు తాజాగా మారిన పరిస్థితులతో ఎటు పయనిస్తారో అన్న అంశం ఆసక్తిరేకెత్తిస్తోంది. కాపుల్లో చీలిక ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. మొదటి నుంచి 'చంద్రబాబు'ను వ్యతిరేకించే 'కాపు'లు కొందరు అదే విధంగా వ్యవహరిస్తున్నారు. అటువంటి వారే 'ముద్రగడ'ను గుడ్డిగా సమర్థిస్తున్నారు. దీంతో అక్కడక్కడ తెలుగుదేశం నాయకులను 'కాపు'లు నిలదీస్తున్నారు. వీరందరూ ఒక పథకం ప్రకారం ఈ పనులు చేస్తున్నారని, 'టిడిపి' నాయకులు ఆరోపిస్తున్నారు. మరో వర్గం 'జగన్‌'ను మొదటి నుంచి మద్దతు ఇస్తున్నావారే. వీరు వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డికి అత్యంత ఆప్తులు. మరొక వర్గం సినీ హీరో 'పవన్‌కళ్యాణ్‌' వెంట నడుస్తున్నారు. ఇప్పటికీ ఈ వర్గ కాపులు ఆయన సోదరుడు 'చిరంజీవి' కన్నా 'పవన్‌'పైనే ఎక్కువ అభిమానం చూపిస్తున్నారు. మరొక వర్గం 'టిడిపి కాపులు' ఈ వర్గం వారు ఆది నుండి కాంగ్రెస్‌ వ్యతిరేక ఓటర్లే. వీరిలో ఎక్కువ మంది ఉన్నత విద్యాభ్యాసం చేసినవారే ఎక్కువగా ఉన్నారు. గత ఎన్నికల్లో 'ముద్రగడ'ను ఓడించిన కాపులే ఇప్పుడు ఆయనకు బాసటగా నిలుస్తున్నారు. ఒక టివీ ఛానెల్‌ అధిపతి కాపుల్లో పట్టుకోసం ప్రయత్నించి విఫలమయ్యారు. టీవీ ఛానెల్‌ ద్వారా అగ్రనాయకుడిగా ఎదగాలన్న ఆయన కోరికను 'ముద్రగడ' ఆదిలోనే తుంచివేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెబుతున్నారు. కాపు ఓటర్లలో ఈ పరిస్థితి గందరగోళం సృష్టిస్తోంది. తమ కులస్తులు నాలుగు వర్గాలు మారి ఒకరిపై ఒకరు ఆదిపత్యం కోసం ప్రయత్నిస్తుండడంతో సగటు కాపులు ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలియక గందరగోళానికి గురవుతున్నారు. మరో 'కాపు' వర్గానికి 'కాంగ్రెస్‌' వర్గంగా గుర్తింపు ఉంది. కానీ అందులో నాయకులే తప్ప ఓటర్లు లేరు. వీరు కూడా చంద్రబాబును వ్యతిరేకించేవారే. వీరిని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రిజర్వేషన్‌ ముసుగులో రెచ్చగొడుతున్నారు. అయినా ఓటర్లు ఎవరూ ఆపార్టీ ధర్నాలకు హాజరు కావడం లేదు. కాపు సామాజికవర్గంలో నిన్నటి వరకూ పూర్తిగా పట్టున్న ఏకైక నాయకుడు మాజీ కేంద్రమంత్రి చిరంజీవి అన్నది వాస్తవం. కానీ ఆయన చేసిన పొరపాట్లు ఆయన కొంపముంచాయి. రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పుడే 'చిరంజీవి' తన మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వస్తే ఆయనకు ప్రజానీకం బ్రహ్మరథం పట్టేది. అందులో ముఖ్యంగా 'కాపు' వర్గం ఆయన వెంటే నడిచేది. కానీ మంత్రి పదవి కోసం ఆయన తన అభిమానులను చేజేతులారా దూరం చేసుకుని ఏకాకిగా మిగిలారు. దీనిని సమయానికి అనుకూలంగా మలచుకోవడం ఆయన సోదరుడు పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ సఫలమయ్యారు. కాపుల్లో ముద్రగడకు ఆది నుంచి కొంత పట్టు ఉంది. అది ఎన్నికల సమయానికి అనుకూలించడం లేదు. దీంతో కాపులందరూ తన వెంట నడవాలంటే రిజర్వేషన్లు అంశాన్ని ఆయన తెరపైకి తెచ్చి సఫలం అయ్యారు. కానీ అక్కడ జరిగిన సంఘటన వల్ల రైతాంగ కాపుల్లో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యతిరేకతను శాశ్వితంగా ఉంటుందా? అనేది వేచి చూడాల్సిందే. తమ ఓట్లతోనే ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తుందని ధీమాతో వ్యక్తం చేసే కాపు నాయకులకు తమ సామాజికవర్గ ఓటర్లుల్లో వస్తోన్న చీలికలు కలవరపరుస్తున్నాయి. మొత్తానికి రాబోయే ఎన్నికల నాటికి 'కాపులు' ఎవరిని బలపరుస్తారో వేచి చూడాల్సిందే.

(562)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ