WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'నన్ను బదిలీ చేయండి...:కలెక్టర్‌'

ఆయన నిజాయితీపరుడైన ఐఎఎస్‌ అధికారి.ఇన్నేళ్ల సర్వీసులో అవినీతి మచ్చ అంటని అధికారి. నిర్మోహమాటంగా మాట్లాడతారు. అవినీతి పరులను దరిచేరనివ్వరు. గతంలో పనిచేసిన శాఖల్లో నిజాయితీగా వ్యవహరించి పేరు,ప్రతిష్టలను పొందారు. అదృష్టం కలిసి వచ్చి కన్‌ఫర్‌డ్‌ ఐఎఎస్‌గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కొన్ని జిల్లాల్లో జాయింట్‌ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయనను శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా నియమించడం జరిగింది. ప్రభుత్వ సంక్షేమపథకాలను కట్టుదిట్టంగా అమలు చేస్తారని పేరు ఉంది. కొంచెం ఆవేశపరుడే కానీ..అపకారి కాదని ఉద్యోగులు చెబుతారు. ఆయన ఎవరో కాదు...ఆయన పేరు లక్ష్మీనర్సింహ్మం. గతంలో ఆయన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావుకు అంతరంగిక అధికారిగా పనిచేశారు. టిడిపి నాయకులందరూ ఆయనకు సుపరిచితులే. అటువంటి అధికారిని కార్మికశాఖ మంత్రి అచ్చెంనాయుడు ఇబ్బందులు పెడుతున్నారని బయటకు పొక్కింది. ఇందులో నిజం ఉందో లేదో కానీ...రాజకీయ అధికారవర్గాలు కూడా దీనిపై వ్యాఖ్యానించడానికి నిరాకరిస్తున్నాయి. 'జిల్లాలో పనిచేయలేను...నన్ను బదిలీ చేయండి...! అని ఆయన సిఎంఒ అధికారులకు మొరపెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆవేశపరుడైన మంత్రి అచ్చెంనాయుడుకు నిజాయితీపరుడైన అధికారుల సేవలను వినియోగించుకోవడంలో లౌక్యం ప్రదర్శించకుండా అనవసర ఆగ్రాహావేశాలు ప్రదర్శిస్తున్నారట. కలెక్టర్‌ లక్ష్మీనర్సింహ్మం నిజాయితీపరుడైన అధికారిగా అధికారపార్టీ నాయకుల ప్రశంసలు పొందుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆయనంటే అభిమానమే. కొన్ని పథకాలను అమలు చేయని ఇంజనీర్లను మందలించి వారితో పనిచేయించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ ఆయన అలా
వ్యవహరించకుండా అనేక మంది ఇంజనీర్ల జీతాలను లక్ష్మీనర్సింహ్మం నిలిపివేయించారట. శ్రీకాకుళం జిల్లాలో తాను చెప్పిందే వేదంగా అమలు కావాలని, మంత్రి అచ్చెంనాయుడు భావిస్తుంటారు. కానీ ఆయన సోదరుడు దివంగత ఎర్రంనాయుడుకు సమకాలీనుడైన గౌతుశ్యామ్‌సుందర్‌ శివాజీతో 'అచ్చెం' విభేదాలు కొనితెచ్చుకున్నారు. ఆముదాలవలస ఎమ్మెల్యే, అసెంబ్లీ విప్‌ అయిన 'కోన రవికుమార్‌'తో మంత్రి అచ్చెంకు విభేదాలు ఉన్నాయి. కరవమంటే కప్పకు కోపం...విడవమంటే పాముకు కోపం...అన్నట్లు కలెక్టర్‌ పరిస్థితి ఉంది. ఈ తలనొప్పులను భరించేకన్నా బదిలీ చేయించుకోవడమే మంచిదని భావిస్తున్నారు 'లక్ష్మీనర్సింహ్మ'. ఆవేశపరుడైన మంత్రి అచ్చెంనాయుడిని తట్టుకోవాలంటే...సమర్థులు, నిజాయితీపరులు, లౌక్యం తెలియని వారు ఇక్కడ పనిచేయడం కష్టం. ఇటీవలే ఒక సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి కలెక్టర్‌ లక్ష్మీనర్సింహ్మం పనితీరుపై మాట్లాడుతూ 'ఆయన నిజాయితీపరుడే...సమర్థుడే...కానీ...లౌక్యం తెలియదు..ఈ వ్యవస్థలో అందర్నీ కళ్లభయంతోనే పనులు చేయించుకోవాల్సిన ఆయన ఆవేశంతో తలనొప్పులు తెచ్చుకుంటున్నారట. దీంతో బదిలీ చేయించుకొని వెళ్లిపోవాలని ఆయన నిర్ణయించుకున్నారట.

(352)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ