WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'సుమంత్‌' ఖాతాలో మరో పరాజయం...!

అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోల్లో సుమంత్‌ గ్రాఫ్‌ను పరిశీలిస్తే పదిహేడేళ్ల కెరీర్‌..పాతిక సినిమాలు. సత్యం, గౌరి, గోదావరి, గోల్కొండ హైస్కూల్‌ వంటి విజయాలు మాత్రమే తన ఖాతాలో ఉన్నాయి. ఏమో గుర్రం ఎగరావచ్చు సినిమా తర్వాత సుమంత్‌ దాదాపు మూడేళ్లు గ్యాప్‌ తీసుకుని చేసిన సినిమా నరుడా డోనరుడా. వీర్యదానం అనే కాన్సెప్ట్‌పై హిందీలో రూపొంది మంచి విజయం సాధించిన విక్కీడోనర్‌ వంటి బోల్డ్‌ కాన్సెప్ట్‌ ఉన్న చిత్రాన్ని తెలుగులో నరుడా డోనరుడా అనే పేరుతో రీమేక్‌ చేయాలనుకోవడం ఓ రకంగా పెద్ద సాహసమే అనుకోవాలి. సుమంత్‌ చాలా గ్యాప్‌ తర్వాత వస్తున్నాడు కదా..ఇలాంటి సబ్జెక్ట్‌తో వస్తున్నాడేంటి అనుకున్నవారు కూడా ఉన్నారు..ఇలాంటి సబ్జెక్ట్‌ను తెలుగులో ఎలా తీస్తారో..అనే క్యూరియాసిటీ కూడా పెరిగింది.
కథ:
విక్రమ్‌(సుమంత్‌) అలియాస్‌ విక్కి చదువు పూర్తయినా ఏమీ చేయకుండా ఫ్రెండ్స్‌తో జాలీగా తిరుగుతుంటాడు. విక్కీ చిన్నప్పుడే అతని తండ్రి కార్గిల్‌ యుద్ధంలో చనిపోవడంతో తల్లి బేబి(శ్రీలక్ష్మి)కి ఓ బ్యూటీ పార్లర్‌ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంది. సంతాన సాఫల్య కేంద్రంను నడిపే డాక్టర్‌ ఆంజనేయులు(తనికెళ్లభరణి) ఓ మంచి వీర్యదాత కోసం వెయిట్‌ చేస్తుంటాడు. ఓ సందర్భంలో విక్కీని చూసి అతని వివరాలను సేకరిస్తాడు. విక్కీని వీర్యదానం చేయాల్సిందిగా కోరుతాడు. వీర్యదానానికి విక్కీ ముందు ఒప్పుకోకపోయినా, డబ్బుకోసం ఒప్పుకుంటాడు.కథ ఇలా సాగుతుండగా ప్రైవేట్‌ బ్యాంకులో అసిస్టెంట్‌ మేనేజర్‌గా వర్క్‌ చేసే ఆషిమా రాయ్‌(పల్లవి సుబాష్‌)ను చూసి ప్రేమలో పడ్డ విక్కీ ఆమెను కూడా తన ప్రేమలో పడేలా చేసుకుంటాడు. తనకు ముందుగానే పెళ్లైందని, భర్త నుండి విడిపోయానని ఆషిమా తన గతాన్ని విక్కీకి చెబుతుంది. కానీ విక్కీ తన గురించిన విషయాలను ఆషిమాకు చెప్పకుండా ఆమెను పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి తర్వాత ఆషిమాకు పిల్లలు పుట్టే అవకాశం లేదనే నిజం తెలుస్తుంది. అప్పుడు ఆషిమా ఎలా రియాక్ట్‌ అవుతుంది? విక్కీ ఏం చేస్తాడు? విక్కీ గురించిన నిజం ఆషిమాకు తెలుస్తుందా? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే....విక్కీ పాత్రలో సుమంత్‌ నటన ఆకట్టుకుంటుంది. ఎమోషనల్‌ సీన్స్‌లో తన నటన బాగానే ఉంది. ఇక పల్లవి సుభాష్‌ లుక్స్‌పరంగా పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక నటన విషయానికి వస్తే పాత్రపరంగా న్యాయం చేసింది. డాక్టర్‌ ఆంజనేయులు పాత్రలో తనికెళ్ళభరణి నటన చూస్తే చేయాల్సిన దాని కంటే కాస్తా ఎక్కువ చేశాడా అనిపించింది. శ్రీలక్ష్మి, శేషు సహా మిగిలిన పాత్రధారులందరూ వారి వారి పాత్రల్లో నటించారు. దర్శకుడు మల్లిక్‌రామ్‌ సబ్జెక్ట్‌ను డీల్‌ చేయడంలో ఫెయిలయ్యాడు. బోల్డ్‌ కాన్సెప్ట్‌ సినిమాలను తీయాలనుకోవడం చాలా రిస్క్‌తో కూడుకుంది. ముఖ్యంగా వీర్యదానం అనే కాన్సెప్ట్‌ను తెలుగు ఆడియెన్స్‌కు నచ్చేలా చూపించలేకపోయాడు. కొన్ని సీన్స్‌ తెరపై చూసేటప్పుడు ఎబ్బెట్టుగా ఉంటాయి. హిందీలో అనుకపూర్‌ చేసిన డాక్టరు పాత్రను జాతీయ అవార్డు వచ్చింది. అలాంటి పాత్రలో నటించిన తనికెళ్ల భరణి వంటి సీనియర్‌ నటుడి రోల్‌ను సరిగా డిజైన్‌ చేయలేకపోయాడు డైరెక్టర్‌ మల్లిక్‌.హీరో, హీరోయిన్స్‌ మధ్య వచ్చే సన్నివేశాలు, పిల్లలు లేకుండా తల్లిదండ్రులు పడే ఎమోషనల్‌ ఫీలింగ్స్‌ను తెరపై హృదయానికి హత్తుకునేలా చూపెట్టలేకపోయారు. శ్రీచరణ్‌ పాకాల సంగీతంలో వచ్చే పాటలు సందర్భానుసారం లేవు. నేపథ్య సంగీతం ఆకట్టుకోలేదు. సంభాషణలు బలంగా లేవు. షానియల్‌ డియో సినిమాటోగ్రఫీ బావుంది. రీమేక్‌ సినిమాలు చేయాలనుకోవడం మంచిదే..అయితే హిట్‌ సినిమాలను రీమేక్‌ చేసేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం.. ఇక్కడి ప్రేక్షకులకు మెయిన్‌ పాయింట్‌ ఆమోదయోగ్యమా, ఒకవేళ ఆమోదయోగ్యం కానీ విషయాలను చెప్పాలనుకున్నప్పుడు ఎలా చెప్పాలనే దానిపై చాలా ఆలోచించాల్సి ఉంటుంది.

(190)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ