WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

రూ.20కోట్లు పంచిన 'పశ్చిమ' ఎమ్మెల్యే....!

ఆయన పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే. గత ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రావడంతో ఇక ఆయనకు అడ్డే లేకుండా పోయింది. అప్పటి నుంచి ప్రారంభమైన ఆయన అక్రమ సంపాదన ప్రత్యర్థులు ఊహించని స్థాయికి చేరిపోయింది.కానీ ఆయనలో ఒక విశేషం ఉంది. సంపాదించిన సొమ్ములో 25శాతం ఉదారంగా ఖర్చు చేస్తారు...నిత్యం చుట్టూ ఉండే మందిమాగాధులను అన్ని విధాలుగా ఆదుకుంటారనే పేరు ఉంది. ఆర్థికపరంగా కూడా కొంత మంది అనుచరులు ఆయన ద్వారా బాగానే ఎదిగారు. అనేక విమర్శలు వచ్చినప్పటికీ ఎవరినీ ఖాతరు చేయలేదు. తాజాగా పెద్దనోట్లను రద్దు చేసిన నేపథ్యంలో సుమారు రూ.20కోట్ల రూపాయలను తన నియోజకవర్గంలో అనేక మందికి వడ్డీలేని రుణంగా ఇచ్చారు. సంవత్సరం తరువాత మళ్లీ తన సొమ్ము ఇచ్చే విధంగా ప్రామిసరీ నోట్లు రాయించుకున్నారట. ఈ విషయం జిల్లాలో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. విషయం బయటకు పొక్కడంతో...దానిని ప్రస్తావిస్తూ తన పేరు ఎక్కడా బయటకు రావద్దని...ఎవరి ద్వారా సొమ్ములు పంచారో వారిని ఆదేశించారు. దీంతో సొమ్ము ఎమ్మెల్యేదైనప్పటికీ ఇచ్చింది మరొకరు అవడంతో...ఆ ఎమ్మెల్యే పేరు బయటకు రావడం లేదు. కానీ...ఆయన రాజకీయ ప్రత్యర్థులైన కొంత మంది నాయకులు...ఏయే గ్రామంలో...ఎవరెవరికి...ఎవరెవరి ద్వారా ఎంత ఇచ్చి ప్రామిసరీనోట్లు రాయించుకున్నారో ఆరా తీస్తున్నారు. ఇప్పటికీ రూ.20కోట్లు పంచారని మరొక ముప్పయి కోట్లు పంచేందుకు రంగం సిద్ధమైందని ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆఖరి నిమిషంలో ఆ ఎమ్మెల్యే ఆనిర్ణయాన్ని నిలిపివేశారు. ఇప్పటికే జిల్లాలో ఎమ్మెల్యే సొమ్ము పంపకంపై రకరకాల కథనాలు ప్రచారం అవుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఆ ఎమ్మెల్యేపై ఇప్పటికే అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. కానీ ఆయన ఎవరికీ ఏ ఆధారాలు దొరకకుండా ముందునుండీ జాగ్రత్తలు తీసుకున్నారు. మీరు ఇచ్చిన సొమ్ము తిరిగి రాకుంటే పరిస్థితి ఏమిటని కొందరు సన్నిహితులు ఆయనను ప్రశ్నించగా...నా నియోజకవర్గంలో అంత దమ్మున్న మొగాళ్లు ఉన్నారా...? నేను వడ్డీ తీసుకోవడం లేదు...సంవత్సరం తరువాత అసలు ఇమ్మంటున్నాను...ఇంత కన్నా ఎవరు ఉదారంగా ఉంటారు...? సంవత్సరం తరువాత నా ఇరవై కోట్లు యధాతథంగా నాకు చేరతాయి...ఆ నమ్మకం నాకు ఉంది...ఆ విధంగానే నేను సొమ్ములు ఇచ్చాను..ఇందులో కొంత మంది సకాలంలో ఇవ్వకపోయినా...కొంత గడువు తీసుకోని అయినా అసలు సొమ్ము ఇవ్వడం ఖాయం..దీనిపై ఎటువంటి అనుమానాలు పెట్టుకోనవసరం లేదు. దీన్ని ఇంతటితో వదిలేయండి...సంవత్సరం తరువాత దీని గురించి మాట్లాడదామని సన్నిహితులకు చెప్పారట.

(3714)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ