WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఛైర్మన్‌ కార్యాలయమే అవినీతికి చిరునామా...!

హిందువులందరూ పవిత్ర పుణ్యక్షేత్రంగా భావిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అక్రమాలపై 'జనం ప్రత్యేక ప్రతినిధి' పలువురు ఉద్యోగులను స్వయంగా కలసి వివరాలు సేకరించారు. ఆ వివరాలను తెలుసుకుంటే భక్తులు ఖంగుతింటారు. పవిత్రంగా, నిజాయితీగా ఉండాల్సిన అధికారులు, ఉద్యోగుల్లో కొందరు సేవా టిక్కెట్లును దొడ్డిదారిన అమ్ముకుంటూ లక్షలు గడిస్తున్నారని తేలింది. ముఖ్యంగా టిటిడి ఛైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి కార్యాలయంలో పనిచేస్తున్న ఒకరిద్దరు ఈ వ్యవహారంలో కీలకపాత్ర నిర్వహిస్తున్నారు. ఛైర్మన్‌ పేరుతో, ఆయన కుటుంబ సభ్యుల పేరుతో పలు సేవా దర్శనాల టిక్కెట్లకు సిఫార్సులు చేస్తూ అందినంత వరకు దండుకుంటున్నారు. ప్రస్తుతం ఛైర్మన్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ఒకరు బెంగుళూరులోని తన సన్నిహితవర్గాల ద్వారా ఈ లావాదేవీలను నిర్వహిస్తున్నారని తెలిసింది. ఇప్పటికే ఆయనపై సిఎం కార్యాలయానికి ఆధారాలతో ఫిర్యాదులు అందాయి. ఇఒ సాంబశివరావు ఈ వ్యవహారంలో ఎందుకో తలదూర్చడం లేదు. జెఇఒ శ్రీనివాసరాజు సేవా టిక్కెట్లను కేటాయిస్తున్నారు. ఏ విధంగా వారికి అడిగిన సేవా టిక్కెట్లను కేటాయిస్తున్నారని శ్రీనివాసరాజును ప్రశ్నిస్తే...'చైర్మన్‌ కార్యాలయ అధికారుల సిఫార్సులకు తప్పనిసరిగా విలువ ఇవ్వాలని..

ఈ విషయాన్ని ఛైర్మన్‌ తనకు స్వయంగా చెప్పారని అంటున్నారు'. ఛైర్మన్‌ కుటుంబసభ్యులు కూడా కొన్ని సేవా టిక్కెట్లకు సిఫార్సు చేస్తుండగా...వాటికి అదనంగా స్వామి కార్యంతోపాటు స్వకార్యాన్ని నెరవేర్చుకుంటున్నారు ఆ అధికారి. ఈ సంవత్సరన్నర కాలంలో ఛైర్మన్‌ కార్యాలయం నుండి ఏయే సేవా దర్శనాలకు ఎన్ని టిక్కెట్లు ఇచ్చారనే వివరాలు బయటకు వస్తే...ఛైర్మన్‌ కార్యాలయ అధికారుల బాగోతం బయటపడుతుంది. ఛైర్మన్‌కు అత్యంత సన్నిహితంగా ఉంటే ఒక వ్యక్తి...ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. అదే కార్యాలయంలో ఒకరిద్దరు నిజాయితీపరులు వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కానీ..ఈ అధికారి తన తెలివితేటలతో మధ్యవర్తుల సహాయసహకారాలతో లావాదేవీలు నిర్వహిస్తూ లక్షలు వెనకేసుకుంటున్నారు. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ...ఎవరికి వారు తమకేమీ తెలియనట్లు మౌనం వహిస్తున్నారు. జెఎఇఒ శ్రీనివాసరాజు దృష్టికి కూడా ఈ అధికారి తీరుపై ఫిర్యాదులు వచ్చాయి. ఆయన ఛైర్మన్‌తో ఇంత వరకు ఈ విషయంపై మాట్లాడారో లేదో తెలియదు కానీ..! టిక్కెట్ల కేటాయింపు విషయంలో ఎటువంటి మార్పులు...చేర్పులు జరగలేదు. పాతపద్దతే యధావిధంగా జరుగుతుంది.

వేల రూపాయలు చేతికి ఇస్తే ఏ దర్శనానికైనా టిక్కెట్‌ ఇప్పించే సత్తా ఈ చైర్మన్‌కు ఉందని టిటిడి ఉద్యోగులందరూ చెబుతున్నారు. ఇఒ సాంబశివరావును ఈ విషయంపై పలువురు మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ...ఈ దర్శనాలు జెఇఒ చూసుకుంటారు...ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటానని తెలిపారు. కానీ....ఫిర్యాదు చేసేవారెవరు..? ఇఒ, జెఇఒలిద్దరూ ఏమీ తెలియనట్లు, మనకెందుకులే...ఈ విషయంలో చేయి పెట్టడం...అని ఛైర్మన్‌ కార్యాలయ సిఫార్సులకు తలొగ్గి సేవా టిక్కెట్లను కేటాయిస్తున్నారు.

(609)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ