WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'క్యాస్ట్రో'పై 638 సార్లు హత్యాయత్నాలు...!

        క్యూబా మాజీ అధ్యక్షుడు, విప్లవ యోధుడు ఫిడెల్‌ క్యాస్ట్రోను చంపడానికి దాదాపు 638సార్లు హత్యాయత్నాలు చేసింది అమెరికా ప్రభుత్వం. అయినా అన్నిసార్లు తప్పించుకున్న ఆయన చివరకు ఈ రోజు కాలధర్మం చేశారు. తనకు ఆగర్భ శత్రువైన 'క్యాస్ట్రో'ను చంపడానికి అమెరికా రకరకాలు ప్రయత్నాలు చేసింది. సిగార్లలో విషం నింపడంద్వారా, పెన్ను సిరాలోకి విషం ఎక్కించడంద్వారా, అందమైన అమ్మాయిలతో, మాజీ భార్యతోని విషపు గుళికలను తినిపించడం ద్వారా, సముద్ర నత్త గుళ్లల్లో శక్తివంతమైన చిన్న బాంబులను అమర్చడంద్వారా, ప్రత్యేకమైన మాఫియా పద్దతుల్లో 'క్యాస్ట్రో'ను చంపడానికి అమెరికా సీఐఏ ప్రయత్నించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు జేఎఫ్‌ కెన్నడీ అయితే క్యాస్ట్రోను హతమార్చేందుకు ప్రత్యేక ఆపరేషన్‌ కూడా రచించారు. అయినా ఇన్ని హత్యాప్రయత్నాలను క్యాస్ట్రో తప్పించుకోవడం విశేషం. 

          తనపై జరిగిన హత్యాయత్నప్రయత్నాలపై 'క్యాస్ట్రో' స్పందిస్తూ ఇటువంటి హత్యాయత్నపోటీలు ఒలంపిక్స్‌లో ఉంటే తనకు ఖచ్చితంగా స్వర్ణం వచ్చేదని వ్యాఖ్యానించారు.  క్యాస్ట్రో మాజీ భార్య మారిటా లారెంజ్‌ ద్వారా విషపు గుళికలు ఇచ్చి చంపేందుకు సీఐఏ ప్రయత్నించడం అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపింది. తాను గర్భవతి అయ్యేవరకు క్యాస్ట్రోతో కలసివున్న లారెంజ్‌ ఓ రోజు హఠాత్తుగా జబ్బున పడ్డారు. వైద్యం కోసం అమెరికా వెళ్లారు. అక్కడ ఆమెను కలసుకున్న సీఐఏ అధికారులు, లారెంజ్‌కు ఆలస్యంగా ఆబార్షన్‌ చేయించి ప్రాణం మీదకు తీసుకురావాలని క్యాస్ట్రో కుట్రపన్నినట్లు ఆమెను నమ్మించారు. ప్రతిగా అమెరికా ప్రజల కోసం క్యాస్ట్రోను భోజనంలో విషపు మాత్రలు కలిపి చంపేయాలని సూచించారు. ప్రమాదకరమైన విషపు గుళికను కూడా ఇచ్చి పంపారు. కస్టమ్స్‌ అధికారుల కళ్లుకప్పి కూడా ఆమెను క్యూబాకు పంపించారు.అమెరికాలలో లారెంజ్‌ను సీఐఏ అధికారులు కలుసుకున్న విషయాన్ని తన వేగుల ద్వారా తెలసుకున్న క్యాస్ట్రో అతి జాగ్రత్తగా లారెంజ్‌ ప్రవర్తనను గమనిస్తూ వచ్చారు.

      అమె తన కోల్డ్‌ క్రీమ డబ్బాలో దాచిన విషపు మాత్రను క్యాస్ట్రో ఓ రోజు కనుక్కున్నారు. అప్పుడు ఆమె దగ్గరకు వెళ్లి తన పిస్టల్‌ తీసి అమెకిచ్చి తనను చంపాలనుకుంటే నేరుగానే చంపాలని ఆమెకిచ్చారట. కళ్లు మూసుకొని సిగరెట్‌ పొగ వదులుతూ నుదిటిపై గురిచూసి కాల్చమని చెప్పారట. దానికి లారెంజ్‌ వనికిపోతూ పిస్టల్‌ నుంచి తుపాకీ గుళ్లను తీసేసి, పొరపాటుపడ్డాను, క్షమించడంటూ క్యాస్ట్రో కౌగిట్లో వాలిపోయారట. ఆ తర్వాత ఆమె ఈ విషయాన్ని ప్రజల ముందు బహిర్గతం చేసింది. కారు యాక్సిడెంట్ల ద్వారా, క్యాస్ట్రో తరచుగా వెళ్లే బేస్‌బాల్‌ స్టేడియంలలో గ్రెనేడ్ల ద్వారా చంపేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించారని ఎస్కలాంటే మీడియాకు అనేక సందర్భాల్లో వెల్లడించారు. 1990లో ఐక్యరాజ్యసమితి సమావేశంలో క్యాస్ట్రో మాట్లాడేందుకు వచ్చినప్పుడు ఆయన బూట్లపై రసాయనిక పౌడర్‌ సిఐఏ చల్లిందట. బూట్లు ఇప్పుకోవడం, కట్టుకోవడం వల్ల ఆ పౌడర్‌ రియాక్షన్‌ ద్వారా ఆయన గడ్డం ఊడిపోవాలన్నది కుట్రట. ఎల్‌ఎస్‌డీ నింపిన సిగరెట్లు అందించడం ద్వారా కూడా చంపాలనుకున్నట్లు 'ఏ 638 ప్లాట్స్‌ అగెనెస్ట్‌ క్యాస్ట్రో' అనే పుస్తకంలో ఎస్కలాంటే వివరించారు.  


(501)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ