లేటెస్ట్

'బిజినెస్‌రూల్స్‌'పై మంత్రివర్గంలో చర్చిస్తారా...!?

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాను అనుకున్నది సాధించారు...! ఎన్నికల కోడ్‌ సమయంలో మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడం కష్టమని, మంత్రివర్గ సమావేశం జరగదని భావిస్తున్నవారి అంచనాలను తలకిందులు చేస్తూ...రేపు మంత్రి వర్గ సమావేశం జరగబోతోంది. మంగళవారం మధ్యాహ్నం 3.00 గంటలకు సచివాలయంలోని హాల్‌లో మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌.వి. సుబ్రహ్మణ్యం కూడా హాజరవుతున్నారని సమాచారం. రాష్ట్రంలోని కరువు పరిస్థితులు, మంచినీటి ఎద్దడి, ఫోనీ తుఫాన్‌ తదితర అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అందుబాటులో ఉండే మంత్రులందరూ రేపు మంత్రివర్గ సమావేశానికి హాజరు కాబోతున్నారు. కాగా మంత్రివర్గ సమావేశంలో ఏజెండాకే పరిమితం అవుతారా..? లేక ఇతర అంశాలను కూడా చర్చిస్తారా..? అనే దానిపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

వాస్తవానికి మంత్రివర్గ సమావేశంలో 'బిజినెస్‌రూల్స్‌'పై చర్చించి 'బిజినెస్‌ రూల్స్‌'ను పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని ముందుగా ముఖ్యమంత్రి భావించారు. తొలుత ఆయన అందుకే మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ..ఎన్నికల కోడ్‌తో మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయలేకపోయారు. తాజాగా మంత్రివర్గ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో..ఇప్పుడు మరోసారి 'బిజినెస్‌రూల్స్‌'పై చర్చ జరుగుతోంది. మంత్రివర్గ సమావేశంలో అదుపు తప్పిన అధికారులపై చర్యలు తీసుకోవాలని చర్చ జరుగుతుందా..? లేదా..? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 'బిజినెస్‌రూల్స్‌' పాటించడం లేదని ఆయనపై చర్యలు తీసుకోవాలని టిడిపి వర్గాలు ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెస్తున్నాయి. 

తాజాగా జరిగే మంత్రివర్గంలో దీనిపై చర్చిస్తే...ముందుగా..'ఎల్‌.వి'పైనే చర్చ జరగాల్సి ఉంటుంది. కాగా...సోమవారం ఉదయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలసి దాదాపు గంటసేపు వివిధ అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారాలు లేని సిఎం అని 'ఎల్‌వి' వ్యాఖ్యానించారని ప్రచారం జరిగింది. ముఖ్యమంత్రిని కలవాల్సిన అవసరం లేదని, తనను వివిధ సమీక్షలకు పిలవలేదని ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన సమయంలో చెప్పారు. తాజాగా..ఆయన సిఎం అందరికీ బాస్‌ అని...ఆయన తండ్రిలాంటి వారని మీడియాతో వ్యాఖ్యానించారు. అంతే కాకుండా తాను ముఖ్యమంత్రిని గౌరవిస్తున్నానని, ఆయనతో విభేదాలు లేవని చెప్పారు. ఈ పరిస్థితుల్లో బిజినెస్‌రూల్స్‌ పాటించలేదని 'ఎల్‌వి'పై చర్యలు తీసుకోవాలని మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారా..? ఇప్పుడా అవసరం ఉందా..? అనేదానిపై స్పష్టత రావడం లేదు. మంత్రివర్గ సమావేశంలో ఏజెండా కాకుండా టేబుల్‌ అంశంగా 'బిజినెస్‌రూల్స్‌'పై చర్చిస్తారా..? ఇప్పుడా అవసరం ఉందా..? ముఖ్యమంత్రి మనస్సులో ఏముందో ఎవరికీ అర్థం కావడం లేదు. బిజినెస్‌రూల్స్‌ విషయంలో అనవసరంగా రభస చేసుకోవడం ఎందుకని, జరిగిందేదో..జరిగిపోయింది..రేపు ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత..తలెగరేసిన వారి గురించి ఆలోచించవచ్చన్న భావం ముఖ్యమంత్రిలో ఉందని టిడిపికి చెందిన సీనియర్‌ నాయకుడు ఒకరు 'జనమ్‌ఆన్‌లైన్‌. కామ్‌'తో వ్యాఖ్యానించారు. మొత్తం మీద చూసుకుంటే...మంత్రి వర్గ సమావేశంలో ఎజెండాకే ప్రాధాన్యత ఇస్తారని, 'బిజినెస్‌రూల్స్‌'పై చర్చ జరగదని చెబుతున్నారు. చూద్దాం..ఏమి జరుగుతుందో..!?

(172)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ