WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

భయపెట్టలేకపోయిన 'చిన్నారి'

ప్రస్తుతం టాలీవుడ్‌లో హర్రర్‌ చిత్రాల హవా నడుస్తుంది. హర్రర్‌ చిత్రాల్లో సీరియస్‌గా భయపెట్టే చిత్రాలతో పాటు కామెడి హర్రర్‌ చిత్రాలు కూడా తమదైన విజయాలను టాలీవుడ్‌లో సొంతం చేసుకున్నాయి. ఈ ట్రెండ్‌ను ఇక్కడి నిర్మాతలు క్యాష్‌ చేసుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అందుకే ఇతర భాషల్లో విడుదలై మంచి విజయాలు సాధించిన హర్రర్‌ చిత్రాలను తెలుగులోకి అనువాదం చేసి విడుదల చేస్తున్నారు. అలా రీసెంట్‌గా కన్నడలో విడులైన మమ్మీ చిత్రాన్ని తెలుగులో చిన్నారి అనే పేరుతో విడుదల చేశారు. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన కన్నడస్టార్‌ ఉపేంద్ర సతీమణి ప్రియాంక ఈ సినిమాలో కీలకపాత్రలో నటించింది. మరి ఈ చిన్నారి ప్రేక్షకులను ఏ మేర భయపెట్టిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళదాం...

కథః

ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రియ(ప్రియాంక ఉపేంద్ర), ఓ యాక్సిడెంట్‌లో తన భర్తను కోల్పోతుంది. ప్రియ భర్తకు గోవాలో ఓ విల్లా ఉంటుంది. ప్రియ భర్త చనిపోక ముందు ప్రియతో కలిసి ఆ భవంతిలో నివసించాలనుకుంటాడు. అయితే ప్రమాదవశాతు భర్త చనిపోయిన తర్వాత తన భర్తకు ఇష్టమైన ఓ భవంతిలో ఉండటానికి తన కూతురు క్రియ(యువిన పార్థవి)తో కలిసి భవంతిలోకి వెళుతుంది. క్రియకు బొమ్మలంటే పిచ్చి. విల్లాలోని స్టోర్‌ రూంలో ఓ బొమ్మను క్రియ ఇష్టపడుతుంది. బొమ్మ ఇంట్లోకి రావడంతో పాప ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఎవరితోనో మాట్లాడుతుంటుంది. కూతురు ప్రవర్తనకు భయపడ్డ ప్రియ సైక్రియాటిస్ట్‌ జేమ్స్‌(శ్రీధర్‌)ను ఇంటికి పిలిపిస్తుంది. విల్లాకు వచ్చిన జేమ్స్‌ను ఎవరో చంపేస్తారు. దాంతో ప్రియ భయం ఎక్కువవుతుంది. ప్రియకు సహాయం చేయడానికి చర్చి ఫాదర్‌ మోజిస్‌(మధుసూదన్‌) విల్లాకు వస్తాడు. మోజిస్‌కు విల్లా గురించి ఎలాంటి నిజాలు తెలుస్తాయి. అసలు ప్రియ భయానికి కారణం ఎవరు? కియ ఎవరితో మాట్లాడుతుంటుంది? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే....

తల్లి, కూతురు మధ్య జరిగే కథను చాలా ఆసక్తికరంగా తెరకెక్కించడంలో దర్శకుడు లోహిత్‌ మంచి విజయాన్నే సాధించాడు. హర్రర్‌ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే కావాల్సిన ముఖ్య అంశాల్లో చాయాగ్రహణం, సంగీతం ప్రధానమైనవి. వీటిని లోహిత్‌ ఎఫెక్టివ్‌గా వాడుకున్నాడు. సినిమాలో దెయ్యాన్ని ఇప్పుడు టాలీవుడ్‌లో నడుస్తున్న కామెడి హర్రర్‌ చిత్రాల స్టైల్‌లో కాకుండా సీరియస్‌ హర్రర్‌తో తెరకెక్కించడం విశేషం. సినిమాలో ప్లాట్‌ మిస్‌ కాలేదు. ఇంటర్వెల్‌ సీన్‌ చాలా బావుంది. దీనికి తోడు అజనీష్‌ లోక్‌నాథ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, హెచ్‌.సి.వేణు సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్‌ అయ్యాయి. ప్రియాంన, యువిన పార్థవి, శ్రీధర్‌, మధుసూదన్‌ తదితరులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. సినిమా ప్రధానంగా నాలుగు క్యారెక్టర్స్‌ మధ్య సాగడంతో ప్రేక్షకుడికి సినిమా సాగదీస్తున్న భావన కలుగుతుంది. హర్రర్‌ చిత్రాలంటే చిన్న పిల్లలను దెయ్యాలుగా చేసి భయపెట్టడం కామన్‌ అయిపోయింది. ఇదెంత వరకు కరెక్టో దర్శకుడికే తెలియాలి. ఇక హర్రర్‌ సినిమాలో ఆడియెన్‌ను కట్టిపడేయాలంటే సౌండ్‌ కీలకమే కానీ, చిన్నారి చిత్రంలో సౌండ్‌ ఎఫెక్ట్‌ మరి ఓవర్‌ అయినట్లు అనిపిస్తుంది. సినిమా స్టార్ట్‌ అయిన కొద్దిసేపటికి సినిమా గురించి ప్రేక్షకుడికి ఓ అవగాహన వచ్చేస్తుంది. రొటీన్‌ కథతో సీన్స్‌ను ప్రేక్షకులను మేం భయపెడతామంతే అనే స్టయిల్లో తీసినట్టు ఉన్నాయి. సినిమా క్లైమాక్స్‌ చాలా వీక్‌గా ఉంది. మెయిన్‌ కథాంశం అంటే చెప్పడానికేమీ లేదు.

(256)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ