WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'జగన్‌' వీరాభిమానికి మళ్లీ పోస్టింగ్‌ ఇచ్చిన 'చంద్రబాబు'...!

2014 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ముందు సచివాలయంలో 'చంద్రబాబు'కు వ్యతిరేకంగా ప్రచారం చేసిన కింది స్థాయి అధికారులకు, ఉద్యోగులకు సిఎంఒ అధికారుల ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని, వారి సిఫార్సులతో ప్రాధాన్యత శాఖలకు బదిలీ చేయించుకుంటున్నారని, అప్పట్లో 'బాబు'కు అనుకూలంగా ప్రచారం చేసిన బిసి సామాజికవర్గానికి చెందిన అధికారులు, ఉద్యోగులు సిఎం 'చంద్రబాబు'కు ఫిర్యాదు చేశారు. 'చంద్రబాబు' ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఒక క్రింది స్థాయి అధికారి తన సీటు వెనుక 'జగన్‌' ఫొటోను పెట్టుకుని పనిచేస్తుండడంపై ఆగ్రహం చెందిన ఆ అధికారిని ఆగమేఘాలపై బదిలీ చేశారు. అప్పట్లో 'చంద్రబాబు'ను రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా అనేక విధంగా దూషించిన ఈ ప్రబుద్దుడు మళ్లీ తెరపైకి వచ్చేందుకు ఆధారం దొరికింది. 'జగన్‌' పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే టిడిపిలో చేరడంతో ఆయన ఈ అధికారిని భుజానవేసుకుని ప్రాధాన్యతశాఖకు బదిలీ చేయాలని సిఎంఒ అధికారి ద్వారా సిఫార్సు చేయించారు. తాము సిఎం చెబితేనే ఆ అధికారిని బదిలీ చేయించామని సదరు అధికారి చెప్పడంతో కొందరు అధికారులు ఆశ్చర్యపోయారు. 

    'జగన్‌'కు అత్యంత అభిమాని అయన ఆ అధికారి పదమూడు సంవత్సరాలు వివిధ హోదాల్లో పనిచేసి కోట్లు గడించారని, మళ్లీ ఆ అధికారిని అదేశాఖకు బదిలీ చేయడం ఏమిటి...? ఇదంతా మాకు బాధగా ఉందని కొందరు అధికారులు సిఎంను స్వయంగా కలిసి పరిస్థితిని వివరించారు. రెండుసార్లు ఆ అధికారిని వెనక్కు పంపించిన ఆశాఖాధిపతి మూడోసారి కూడా ఆయనను చేర్చుకునేందుకు నిరాకరించగా సిఎంఒ కార్యాలయ అధికారి నుండి ఫోన్‌ రావడంతో మౌనం వహించారు. ఈ విషయంపై సిఎంఒ అధికారిని కొంతమంది అధికారులు, ఉద్యోగులు కలసి ప్రశ్నించగా 'నాదేమీ లేదు...పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే సిఎంపై ఒత్తిడి తెస్తున్నారు...ఆయన నాపై ఒత్తిడి తెస్తున్నారు..ఏం చేయాలో మీరే చెప్పండన్నారు..' ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొవాలో అర్థం కాక సిఎంను అభిమానించే అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 

  ఒకేశాఖలో ఆరు సంవత్సరాలకు మించి పనిచేయకూడదని నిబంధనలు ఉన్నాయి. ఆ అధికారి అనేక హోదాల్లో పన్నేండేళ్లు పనిచేశారు. నిబంధనలకు విరుద్ధంగా మళ్లీ అదేశాఖలో ఆ అధికారిని నియమించారు. ఆ శాఖ అంటే ఆ అధికారికి ఎందుకు అంత పట్టుదల అని ఆరా తీయగా ఈశాఖలోనే ఆయన కింది స్థాయి అధికారిగా కోట్లు గడించారని, ప్రస్తుతం అధికారిగా ఎంతో సంపాదించవచ్చు...ఆ శాఖపై పట్టుసాధించాలని తపన పడుతున్నారట. ఈయనగారి వ్యవహారాన్ని ఎన్నిసార్లు సిఎంఒ దృష్టికి తీసుకెళ్లినా...? పాడిందే పాటరా..పాసిపళ్లదాసుడా...అన్న చందంగా ఇటీవలే మళ్లీ ఆ అధికారిని పాతశాఖలోనే నియమించారు. ఈ అధికారికి ఏ బాధ్యతలు ఇవ్వాలో తెలియక ఆ శాఖాధిపతి తప్పుకుపోతున్నారు. మరి కొద్ది రోజుల్లో అసలు విషయం బయటపడనుంది. తిరిగి ఆ అధికారిని పంపిస్తారా...? లేక ముఖ్యబాధ్యతలను అప్పచెప్పి ఆయనతో పనిచేయించుకుంటారా...? వేచి చూడాల్సిందే...!


(1187)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ