WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'సుప్రీం' ఆదేశించినా...భేఖాతరు...!

  • కోడిపందాల నిర్వహణకు సర్వం సిద్ధం...!

  • చేతులు మారనున్న సొమ్ము...రూ.500కోట్లు

సాక్షాత్తూ 'సుప్రీంకోర్టు' ఆదేశించినా, స్థానిక కోర్టులు స్టేలు విధించినా 'పశ్చిమగోదావరి' జిల్లాలో కోడిపందాలను నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకుంటూనే ఉన్నారు. సుమారు ఐదు కోట్లు రూపాయలు చేతులు మారే అవకాశాలు ఉన్నాయి. కోర్టు ఆదేశాలను తప్పకుండా పాటిస్తాం...కోడి పందాలను జరగకుండా బందోబస్తు నిర్వహిస్తాం...కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా ఎస్పీ పదే పదే చెబుతూనే ఉన్నారు. గత రెండేళ్లల్లో ఎవరూ ఏమీ చేయలేకపోయారు. ఎప్పటి నుంచో సాంప్రదాయమని కోడి పందాల నిర్వహకులు చెబుతున్నా...అనేక సాంప్రదాయాలను కట్టుబాట్లను మార్చుకుంటూనే ఉన్నారు....ఈ విషయంలో ఎందుకు మార్చుకోవడం లేదని నిర్వాహకులను ప్రశ్నిస్తే...ఇది మా వ్యాపారమని అంగీకరిస్తున్నారు. నిర్వాహకులలో ఎక్కువ మంది రాజకీయపార్టీల ఆశీస్సులు ఉన్నాయి.

   కోడి పందాలను నిర్వహించవద్దని హైకోర్టు స్టే విధించడంతో పలువురు 'సుప్రీంకోర్టు'కు వెళ్లారు. హైకోర్టు స్టేని ఎత్తివేసేందుకు 'సుప్రీంకోర్టు' నిరాకరించడమే కాకుండా...కోడిపందాలను స్వాధీనం చేసుకోకుండా...పందాలకు వాడే కత్తులను స్వాధీనం చేసుకోమని ఆదేశించింది. ఏ కోర్టు తీర్పు ఉన్నా...ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా...కోడి పందాల నిర్వహణకు ఎటువంటి అడ్డంకులు లేవని యధావిధిగా పందాలను నిర్వహిస్తామని నిర్వాహకులు తేల్చి చెబుతున్నారు. పలువురు ప్రముఖులు ఈ పందాలకు వస్తున్నారని వీరు భారీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. 'సుప్రీంకోర్టు' తీర్పు తమకు అనుకూలంగా ఉందని కోడి పందాల నిర్వాహకులు ప్రచారం చేసుకోవడంపై పోలీసు వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే నిర్వాహకులు పొరుగు జిల్లాల వారికి ఎక్కడ పందాలు జరుగుతాయో సమాచారం ఇచ్చారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు,స్థానిక సంస్థల ప్రతినిధుల్లో కొందరు కోడి పందాల నిర్వాహకులకు అభయం ఇస్తూ తమ వాటాలను ముందుగానే అందుకున్నారు. పోలీసులు దాడులు చేయకుండా మేము చూసుకుంటాం...మా వాటాను మాకు ఇవ్వాలని ఎమ్మెల్యేలు నిర్వాహకులను పిలిపించుకుని చెబుతున్నారట. దీనిపై నిర్వాహకులు కూడా స్థానిక పోలీసు అధికారులకు ముందుగానే అడ్వాన్స్‌లు చెల్లించారట. కఠినంగా వ్యవహరించాలని పాలకుల నుంచి ఇంత వరకు ఉత్తర్వులు రాలేదని, తాము ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా...స్థానికులు సహకరించడం లేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. 

   ఇదంతా అబూతకల్పన కోడి పందాల నిర్వహకులు,స్థానిక పోలీసు అధికారులు ఇప్పటికే ఒప్పందానికి వచ్చారు..ఉత్తిత్తి ప్రకటనలు చేస్తున్నారని...ప్రజలు భావిస్తున్నారు. దీనిపై జిల్లా పోలీసు ఉన్నతాధికారిని పలువురు కలసి ప్రశ్నించగా కోర్టుతీర్పును అమలు చేస్తాం..నిర్వాహకుల ఆట కట్టించేందుకు యంత్రాంగాన్ని సిద్ధం చేశాం..కానీ స్థానిక ప్రజలు సహకరించకపోతే తాము మాత్రం చేసేదేముందని వారు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ సుమారు రూ.500కోట్లు కోడిపందాలపై చేతులు మారబోతున్నాయి. 13,14,15 తేదీల్లో కోడి పందాలు జరగడం ఖాయం.దీనిని కొంత మంది అధికారులు, పోలీసుల్లో కొంత మంది వ్యతిరేకిస్తున్నప్పటికీ, అధికారపార్టీ ప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, క్రింది స్థాయి అధికారులు కోడి పందాల నిర్వహణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

(442)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ