WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'సోమిరెడ్డి'పై ఆరోపణల వెనుక...నారాయణ,రవిచంద్రలు...!

నెల్లూరు జిల్లా అధికారపార్టీ రాజకీయాలు రసకందాయంగా మారాయి. తెరవెనుక ఉండి మాజీ మంత్రి సోమిరెడ్డిపై పలువురు ప్రముఖులు ఆయన ప్రత్యర్థుల ద్వారా అవాస్తవ విమర్శలు చేయిస్తున్నారని దీనిపై పూర్తి విచారణ జరిపితే అసలు దోషులు ఎవరో బయటకు వస్తారని టిడిపి నాయకులు చెబుతున్నారు. పలువురు నాయకులను 'జనం ప్రత్యేక ప్రతినిధి' వివిధ మార్గాల ద్వారా సంప్రదించగా 'సర్వేపల్లి' ఎమ్మెల్యే 'కాకాని గోవర్థన్‌రెడ్డి', మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై చేసిన ఆరోపణలు, విమర్శలలో కేవలం పదిశాతం మాత్రమే వాస్తవం ఉంటుందని, మిగతా తొంభైశాతం అవాస్తవమని వారు చెబుతున్నారు. 'గోవర్థన్‌రెడ్డి' చేసిన విమర్శలు వెనుక 'మున్సిపల్‌ మంత్రి 'నారాయణ', జిల్లా టిడిపి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్రయాదవ్‌'ల హస్తం ఉందని అధికారపార్టీలోని మెజార్టీ నాయకులు ఆఫ్‌ ది రికార్డుగా చెబుతున్నారు. 'సోమిరెడ్డి'కి మంత్రి పదవి ఇస్తే తనను ఎవరూ పట్టించుకోరని మంత్రి నారాయణ భావిస్తుండగా...ఇప్పటి వరకు అధికారం చెలాయించిన ఎమ్మెల్సీ 'రవిచంద్రయాదవ్‌' పూర్తిగా కనుమరుగు కాక తప్పదని వారు అంటున్నారు. 

    దీనిపై 'సోమిరెడ్డి'ని పలువురు మీడియా ప్రతినిధులు కలసి వివరణ కోరగా ఆయన స్పందించలేదు. కానీ...ఆఫ్‌ ది రికార్డుగా పలువురితో మాట్లాడుతూ 'నారాయణ, రవిచంద్రల హస్తం ఉందని నాకు కూడా తెలుసు...పార్టీ నాయకులకు తెలుసు...కానీ..ఇప్పుడు వారిద్దరిని 'బాస్‌' గుడ్డిగా నమ్ముతున్నారు...ఈ నేపథ్యంలో...తానేం చెప్పినా...వివాదాస్పదం అవుతుందనే ఉద్దేశ్యంతో మౌనంగా ఉంటున్నాని ఆయన అంటున్నారు.తనకు అందిన కాగితాలు బోగస్‌వి అనే విషయం ఇప్పుడిప్పుడే 'కాకాని'కి కూడా తెలిసివచ్చింది. చేసిన విమర్శలు, ఆరోపణలను స్థానిక ప్రజలు, రాజకీయ నాయకులు కూడా నమ్మడం లేదని 'కాకాని' వాపోతున్నారట. వంద కోట్లు ఆస్తులు ఉన్నాయంటే...నమ్మవచ్చు...'సోమిరెడ్డి'కి వెయ్యికోట్లు ఆస్తులు ఉన్నాయంటే ఎవరు నమ్ముతారు..? ఈ విషయంపై మాజీ మంత్రి ఒకరిని 'జనం ప్రత్యేక ప్రతినిధి' స్వయంగా కలసి ప్రశ్నించగా 'కాకాని' తప్పుడు ఆరోపణలు చేశారు...వెయ్యికోట్లు ఆస్తులు...సోమిరెడ్డికి ఉన్నాయంటే తాను కూడా నమ్మనని, ఈ విషయంలో మంత్రి నారాయణ, ఎమ్మెల్సీ రవిచంద్రయాదవ్‌లు అందజేసిన సమాచారాన్ని గుడ్డిగా నమ్మి 'గోవర్థన్‌రెడ్డి' సరిదిద్దుకోలేని తప్పు చేశారని, ఒకరిపై ఆరోపణలు చేసేటప్పుడు సరైన ఆధారాలు ఉండాలని, వారిద్దరు ఇచ్చిన సమాచారం నిజమేనని భ్రమించి...'కాకాని' రాజకీయంగా దెబ్బతిన్నారని ఆయన వ్యాఖ్యానించారు. 

    దీనిపై మరింత లోతుకు వెళ్లగా వ్యాపారాలు, ఇతర ఆస్తులు...విలువ వంద కోట్ల లోపు ఉండవచ్చు...కానీ 'వెయ్యి' కోట్లు అనేది శుద్ధ అబద్దమని, 'సోమిరెడ్డి'కి అంత బరితెగించి సంపాదించే అవకాశాలు లేవు..పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నారు..దివంగత వై.ఎస్‌ను, 'జగన్‌'ను, సోనియా,రాహుల్‌ను ఆయన పదే పదే ఘాటైన పదజాలంతో విమర్శలు చేసిన 'సోమిరెడ్డి'కి సంపాదించుకునే అవకాశాన్ని వారు ఎలా ఇస్తారని పార్టీలోని సీనియర్‌ నాయకులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ 'సర్వేపల్లి' ఎమ్మెల్యే 'కాకాని గోవర్థన్‌రెడ్డి' చేసిన ఆరోపణలు పసలేనివని తేలిపోయింది. నిన్నటి వరకు వెనుక ఉండి మద్దతు ఇచ్చిన మంత్రి నారాయణ, ఎమ్మెల్సీ రవిచంద్రయాదవ్‌ ఆస్తులపై పలువురు ఆరా తీస్తున్నారు. దీని వెనుక 'సోమిరెడ్డి' హస్తం ఉందని ఆ ఇద్దరు చెబుతుండగా...ఎవరెవరికి ఎన్నికోట్లు ఆస్తులు ఉన్నాయో...తనకెందుకు...అని 'సోమిరెడ్డి' చెబుతున్నారు. ఏది ఏమైనా నెల్లూరు టిడిపి రాజకీయాలు చలికాలంలో వేడిని పుట్టించాయి. రాజకీయపరిశీలకులు కూడా ఈ ఇద్దరి వ్యవహారంలో బాహాటంగా బయట పడకపోయినప్పటికీ 'సోమిరెడ్డి'పై అవినీతి రాయిని విసిరారు..అది బంతిరూపంలో తిరిగి వచ్చి వారికే తగలనుందని చెబుతున్నారు..

(290)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ