WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'డిఎల్‌'ను 'యనమల' అడ్డుకుంటున్నారా...?

ప్రస్తుతం ఏ పార్టీలో లేని మాజీ కాంగ్రెస్‌ నాయకుడు 'డి.ఎల్‌.రవీంద్రారెడ్డి' రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకుంటారన్న అంశంపై పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్నటి దాకా ఆయన టిడిపిలో చేరడమే తరువాయి అన్నట్లు జరిగిన ప్రచారంతో ఆయన టిడిపిలో చేరతారనే అందరూ అనుకున్నారు. అయితే ఆయన అనూహ్యంగా వైకాపాలో చేరతారని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు వరకు ఆయన వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఆయన తనయుడు వై.ఎస్‌.జగన్‌ను తీవ్రంగా విమర్శించేవారు. రాజశేఖర్‌రెడ్డి జీవించి ఉన్న సమయంలోనూ డి.ఎల్‌. ఆయనకు వ్యతిరేకంగా వ్యవహరించేవారు. నిత్య అసమ్మతి వాదిగా ఆయనకు పేరుండేది. 1989,1994, 2004,2009 ఎన్నికల్లో ఆయన 'మైదుకూరు' నియోజకవర్గం నుంచి గెలిచి సంచలనం సృష్టించారు. 1994 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోరంగా ఓడిపోయినా ఆ ఎన్నికల్లో డి.ఎల్‌ గెలిచి సంచలనం సృష్టించారు. కడప జిల్లా రాజకీయాల్లో వై.ఎస్‌ను ఎదిరించిన నేతల్లో ఒకరిగా 'డి.ఎల్‌'కు పేరు ఉంది. ఆ అక్కసును దృష్టిలో పెట్టుకునే 2004 ఎన్నికల్లో డి.ఎల్‌.విజయం సాధించినా ఆయనకు వై.ఎస్‌. 'మంత్రి' పదవి ఇవ్వలేదు. అప్పట్లో డి.ఎల్‌., శంకర్‌రావులు కలసి వై.ఎస్‌.పై నిత్యం బాణాలు ఎక్కుపెట్టేవారు. అయినా అప్పట్లో వై.ఎస్‌.కు అధిష్టానం అండదండలు గట్టిగా ఉండడంతో వీరు ఎంత అసమ్మతి కార్యకలాపాలు నడిపినా అవి పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. అయితే 2009 ఎన్నికల్లో డి.ఎల్‌.మళ్లీ గెలిచినా వై.ఎస్‌ ఆయనను మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకోలేదు. అయితే వై.ఎస్‌. మరణం తరువాత డి.ఎల్‌ వెలులోకి వచ్చారు. కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో ఆయన మంత్రిగా పనిచేశారు. అయితే 'కిరణ్‌'తోనూ 'డి.ఎల్‌'కు సరిపడలేదు. 

  దీంతో 'డి.ఎల్‌'ను అవమానకరంగా మంత్రిపదవి నుంచి సాగనంపారు 'కిరణ్‌'. ఇది అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే మంత్రిగా 'డి.ఎల్‌' వై.ఎస్‌.జగన్‌పైనా...ఆయన మానసపుత్రిక 'సాక్షి' పత్రికపైనా విరుచుకుపడేవారు. 'సాక్షి' పత్రిక గురించి మాట్లాడుతూ 'అది మరుగుదొడ్లలో తుడుచుకోవడానికి కూడా పనికిరాదని..వ్యాఖ్యానించారు'... అప్పట్లో ఈ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఇదంతా గతం కాగా...ఇప్పుడు అదే 'డి.ఎల్‌' 'జగన్‌' పార్టీలో చేరబోతున్నారని ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా డి.ఎల్‌. నియోజకవర్గంలో వై.ఎస్‌.జగన్‌...డి.ఎల్‌తో కలసి ఉన్న కటౌట్లు నియోజకవర్గంలో దర్శనం ఇస్తున్నాయి. వీటిని 'డి.ఎల్‌' అభిమానులు పెట్టారని తెలుస్తోంది. అంటే...'డి.ఎల్‌' వైకాపాలో చేరడానికి లాంఛనాలు అన్నీ కుదిరినట్లేనని జిల్లా రాజకీయవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇప్పుడు జిల్లా టిడిపిని తొలిచివేస్తున్న ప్రశ్న ఏమిటంటే...అసలు ఎందుకు 'డి.ఎల్‌' వైకాపాలో చేరడానికి ప్రయత్నిస్తున్నారేదే...? నిన్న మొన్నటి దాకా 'డి.ఎల్‌' ఎప్పుడంటే అప్పుడు టిడిపిలో చేరతారని ప్రచారం జరగడం, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి 'లోకేష్‌' కూడా డి.ఎల్‌తో సంప్రదింపులు జరిపి పార్టీలోకి ఆహ్వానించడం జరిగిపోయాయి. ఇక రేపో..మాపో అన్న చేరిక వాయిదా పడడం..ఇప్పుడు 'డి.ఎల్‌' వైకాపాలో చేరడానికి ప్రయత్నిస్తుండడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలా జరగడం వెనుక ఆర్థిక మంత్రి 'యనమల' హస్తం ఉందని వారు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం 'మైదుకూరు' నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జిగా ఉన్న 'పుట్లాసుధాకర్‌ యాదవ్‌' ఉన్నారు. ఆయనకు 'డి.ఎల్‌'కు పొసగడం లేదని...'డి.ఎల్‌' పార్టీలోకి వస్తే తనకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ దక్కదని 'సుధాకర్‌' భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో 'డి.ఎల్‌'ను పార్టీలోకి తీసుకోవద్దని ఆయన కోరడం..దానికి ఆర్థిక మంత్రి యనమల మద్దతు ఇవ్వడం జరిగిపోయాయట. 'సుధాకర్‌'కు 'యనమల'కు బంధుత్వం ఉంది. దీని వల్లే 'యనమల' ఈ విషయంలో జోక్యం చేసుకున్నారని జిల్లా నాయకులు అంటున్నారు. 'యనమల' ఒత్తిడి చేయడంతోనే 'డి.ఎల్‌'ను 'చంద్రబాబు' పక్కన పెట్టారని స్థానిక టిడిపి నేతలు అంటున్నారు. దీంతో 'డి.ఎల్‌' తన దోవ తాను చూసుకుంటున్నారనేది ఆయా వర్గాల కథనం. మొత్తం మీద ఒక బలమైన నాయకుడిని టిడిపి వదిలేసిందని జిల్లా టిడిపి వర్గాల అభిప్రాయం. మరి పార్టీ పెద్దలు రాబోయే కాలంలో ఏమి చేస్తారన్నది వేచి చూడాల్సి ఉంది.


(1305)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ