WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఎవరీ 'సింఘాల్‌'...?

టీటీడీ ఇఒ సాంబశివరావును బదిలీ చేసి, ఆయన స్థానంలో 'అశోక్‌కుమార్‌ సింఘాల్‌'ను నియమించబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తెలుగు ఐఎఎస్‌ అధికారులు, అధికారపార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆశ్చర్యపోతున్నారు. ఎవరీ సింఘాల్‌...? ఎవరు ఆయనను ఈ పోస్టుకు సిఫార్సు చేశారు...? గతంలో ఆయన రాష్ట్రానికి చేసిన సేవ ఏమిటి? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. 'సింఘాల్‌'ను సిఫార్సు చేసింది కేంద్ర మంత్రి 'సుజనాచౌదరే'నని 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' ఇంతకు ముందు వార్తను ప్రచురించింది. టీటీడి చరిత్రలో ఇంతకు ముందెన్నడూ తెలుగేతర ఐఎఎస్‌ అధికారిని టీటీడీ ఇఒగా నియమించలేదు. హిందూమతంపై నమ్మకం, సాంప్రదాయాలపై అవగాహన, పరిపాలనా అనుభవం వంటి విషయాలను పరిగణలోకి తీసుకున్నాకే అత్యంత ప్రతిష్టాత్మకైమైన టీటీడీ ఇఒగా పలువురు అధికారులను అప్పటి పాలకులు నియమించేవారు. 'సింఘాల్‌'ను టీటీడీ ఇఒగా నియమించాలనే ఆలోచన 'చంద్రబాబు'కు ఇంతకు ముందు లేదు. ఎందుకు 'సుజనాచౌదరి' సిఫార్సులను 'చంద్రబాబు' అంగీకరిస్తున్నారో అటు సిఎంఓ అధికారులకు, ఇటు మంత్రులకు అధికారపార్టీ ప్రజాప్రతినిధులకు అర్థం కావడం లేదు. 'సింఘాల్‌'ను ఏ అర్హతతో నియమించబోతున్నారనే ప్రశ్నకు పాలకుల వద్ద సమాధానం లేదు. 

  'సుజనాచౌదరి' వ్యాపారలావాదేవీలకు 'సింఘాల్‌' ఏ విధంగానైనా సహకరించారా అనే దానిపై పలువురు ఆరా తీస్తున్నారు. టీటీడీ ఇఒగా బాధ్యతలు నిర్వహించాలంటే అక్కడ నిర్వహించే వ్యవహారాలపై పూర్తిగా అవగాహన ఉండాలి. సంప్రదాయాలు తెలిసి ఉండాలి...అదే విధంగా స్థానిక పరిస్థితులపై , ఆగమ శాస్త్రంపై కొంత అవగాహన ఉండాలి. నిజాయితీతోపాటు, సమర్థత, రాజకీయ సిఫార్సులకు తలొగ్గకుండా ఉంటే ధైర్యం, స్వతాగా నిర్ణయాలు తీసుకునే శక్తియుక్తులు కలిగి ఉండాలి. అంతే కానీ..గతంలో మొక్కుబడిగా టీటీడీ ఇఒలుగా నిర్వహించిన కొందరు అధికారుల వలే వ్యవహరించకూడదు. కులాలకు అతీతంగా వ్యవహరించాలి...ఇక్కడ కుల సంఘాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 

  ముఖ్యంగా బ్రాహ్మణులు, యాదవలు, రెడ్డి వర్గాలదే ఆధిపత్యం కొనసాగింది. గర్భగుడిలో పనిచేసే అర్చకస్వాములు, ప్రధాన అర్చకుల రాజకీయాలను సమర్థవంతగా ఎదుర్కోవాలి. అటువంటి ధైర్యసాహసాలు, లౌక్యం, నేర్పరితనం 'సింఘాలకు ఉన్నాయా? ఆయన ప్రస్తుత ఇఒ 'సాంబు'వలే గట్టిగా నిర్ణయాలు తీసుకోగలుగుతారా...?  ఇటువంటి అర్హతలు 'సింఘాల్‌'కు ఉన్నాయా...? ముఖ్యంగా తెలుగుభాషను ఆయన అనర్ఘళంగా మాట్లాడగలరా...? టిటిడీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో తొంభైశాతంపైగా తెలుగువారే ఉన్నారు...'సింఘాల్‌'ను నియమించబోతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు దీనిపై ఆరా తీసి ఆ అధికారిని ఎలా నియమిస్తారు...? తాము సిఎంను స్వయంగా కలసి దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తామని చెబుతున్నారు. కేంద్రమంత్రి 'వెంకయ్యనాయుడు' ద్వారా కూడా 'సుజనాచౌదరి' 'చంద్రబాబు'పై ఒత్తిడి తెస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇంత వరకు దీనిపై 'వెంకయ్య' నోరు మెదపలేదు.ఏది ఏమైనా తన వ్యాపార లావాదేవీలకు సహకరించే ఐఎఎస్‌ అధికారులందరికీ కీలక ప్రాధాన్యత పోస్టులు ఇప్పించుకునేందుకు 'సుజనా' తాజాగా తనకు ఆప్తుడైన 'సింఘాల్‌'ను టీటీడీలో నియమించేందుకు శరవేగంగా పావులు కదిపారు..చాలా మటుకు అందులో సక్సెస్‌అయినట్లే కనిపిస్తోంది.

(445)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ