WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఎమ్మెల్సీ కోసం వైకాపాలో హోరాహోరి...!

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి అప్పుడే మొదలైంది. మార్చి లేదా ఏప్రిల్‌లో ఖాళీ అవుతున్న 22 ఎమ్మెల్సీ స్థానాల కోసం ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఏడు స్థానాలకు ఎమ్మెల్యేల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. వీటిలో అధికార తెలుగుదేశం పార్టీకి ఐదు స్థానాలు, ప్రతిపక్ష వైకాపాకు ఒక స్థానం లభించనుంది. అయితే మరో స్థానానికి వైకాపా అభ్యర్థిని నిలుపుతుందా...? లేక వచ్చిన స్థానంతో సరిపెట్టుకుంటుందో మాత్రం తెలియదు. టిడిపిలో ఇప్పటికే పలువురు తమకు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఇవ్వాలని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నారు. స్వయంగా పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తనయుడు 'లోకేష్‌' కూడా ఎమ్మెల్సీ కోసం పట్టుబడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీన్ని ఆయన ఖండిస్తున్నారు. మరో వైపు 'బాబు'పై స్వంత కుటుంబం నుంచి తీవ్ర వత్తిడి వస్తోందట. ఆయనను ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నారట. ఇక ఆయన కాకుండా 'క్షత్రియ' వర్గానికి చెందిన 'రుద్రరాజు పద్మరాజు' కూడా ఎమ్మెల్సీ ఆశిస్తున్నారు.ఆయనతో పాటు 'కరణంబలరాం' జూపూటి ప్రభాకర్‌, ప్రతిభాభారతి, పుష్పరాజ్‌, వర్ల రామయ్య వంటి వారు తమ ప్రయత్నాలను తాము చేసుకుంటున్నారు. అధికార పార్టీలో ఇలా ఉండగా ప్రతిపక్ష వైకాపాలో కూడా పలువురు అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్నారు.

   పార్టీ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌ తన మనసులో ఏముందో చెప్పకపోయినా..పలువురు తమకు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఇవ్వాలని కోరుతున్నారట. తాము పార్టీకి చేసిన సేవలను గుర్తులో పెట్టుకుని తమకు అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారట. పార్టీకి దక్కే ఒక స్థానంపై 'జగన్‌' బంధువు 'బాలినేని శ్రీనివాసరెడ్డి' గట్టిగా పట్టుబడుతున్నారట. తాను 'జగన్‌' కోసం త్యాగాలు చేశానని...అయినా తనను 'జగన్‌' పట్టించుకోవడంలేదని ఆయన భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో తనను ఎమ్మెల్సీ చేయాలని ఆయన కోరుతున్నారట. ఆయనతో పాటు 'జగన్‌'కు సన్నిహితుడైన తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి కూడా ఎమ్మెల్సీ ఆశిస్తున్నారట. ఇక కాపు వర్గానికి చెందిన పలువురు ఎమ్మెల్సీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. రాష్ట్ర రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ స్థానాన్ని తమకు కేటాయిస్తే తమ వర్గాన్ని సంతృప్తి పరిచినట్లు అవుతుందని అంటున్నారట. వీరిలో విజయనగరం జిల్లాకు చెందిన మాజీ మంత్రి 'బొత్స సత్యనారాయణ' కూడా ఉన్నారని తెలుస్తోంది.ఆయన తనకు అవకాశం ఇస్తే ఎమ్మెల్సీగా వెళ్లేందుకు సిద్ధమంటున్నారట. ఆయనతో పాటు 'ఆళ్లనాని' వంటి వారు కూడా అభ్యర్థిత్వం కోరుతున్నారు. ఇక ఇటీవలే పార్టీలో చేరిన వెల్లంపల్లి శ్రీనివాస్‌ కూడా తనకు ఎమ్మెల్సీ ఇవ్వాలని పార్టీ పెద్దలతో చెబుతున్నారట. ఏది ఏమైనా దక్కేది ఒక స్థానమైతే ఇంత మంది హోరాహోరిగా పోటీపడుతున్నారని చివరకు పార్టీ అధ్యక్షుడు ఎవరిని ఎంపిక చేస్తారో చూద్దామని పార్టీ నాయకులు చెబుతున్నారు.


(338)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ