WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'బాబు'లో వై.ఎస్‌ ఆత్మ ప్రవేశించిందా..?

2004 మే నెలలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దివంగత వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి అవినీతికి ద్వారాలు పూర్తిగా తెరిచారు. ఆయన అవినీతి ఐదేళ్లపాటు నిరాటంకంగా, ఎదురులేకుండా కొనసాగింది. అవినీతిపై పలు పత్రికలు ఆధారాలతో కథనాలు ప్రచురిస్తే, వాటిపై విచారణకు ఆదేశించకుండా, స్పందించకుండా ఎదురుదాడి చేశారు వై.ఎస్‌. ఆయన మంత్రులు కూడా ఆయన దారిలోనే ఎదురుదాడి చేశారు. గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఐదేళ్లపాటు జరిగిన అవినీతి అంతకు ముందు ఏ ప్రభుత్వంలో కూడా జరగలేదన్నది యధార్థం. అది అప్పటి పరిస్థితి. తాజాగా 2014 జూన్‌లో సిఎంగా ప్రమాణస్వీకారం చేసిన 'చంద్రబాబు' దివంగత వై.ఎస్‌ బాటలోనే నడుస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అవినీతిపై పత్రికలు కథనాలు ప్రచురించినా, ఆధారాలతో ఫిర్యాదు చేసినా 'చంద్రబాబు' స్పందించడం లేదు. 'జగన్‌' పత్రిక 'సాక్షి'లో ఆధారాలు లేకుండా అవినీతి కథనాలు రావడం, అదీ రోజూ ప్రచురిస్తుండడంతో ఆ పత్రిక రాసే వార్తలను విశ్వసనీయత లేకుండా పోయాయి. ఇవన్నీ అవాస్తవాలని 'చంద్రబాబు' ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. గతంలో దివంగత వై.ఎస్‌ 'ఈనాడు, ఆంధ్రజ్యోతి' పత్రికలను టార్గెట్‌ చేయగా, ఇప్పుడు 'బాబు' వంతు వచ్చింది. అప్పుడు వై.ఎస్‌ అవినీతికి లైసెన్స్‌ ఇవ్వగా అదే విధంగా 'చంద్రబాబు' ఇప్పుడు ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు స్వంత పార్టీ నుంచే వ్యక్తం అవుతుంది. 'ఈనాడు,ఆంధ్రజ్యోతి, ఇతర ఆంగ్లపత్రికల్లో వచ్చిన కథనాలపై 'చంద్రబాబు' స్పందించడం లేదు. 

    గతంలో అవినీతి, అవకతవకలపై వార్తలు ఏ పత్రికలో వచ్చినా వెంటనే ఆయన స్పందించి విచారణకు ఆదేశించేవారు. ప్రస్తుతం ఆయన ఆ వైఖరికి భిన్నంగా వెళుతున్నారు. ఆయన ఏ ఒక్క పత్రికా కథనంపై విచారణకు ఆదేశించలేదు. దీంతో టిడిపిలోని నిజాయితీపరులైన నాయకులు ఆఫ్‌ ది రికార్డుగా పలువురు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ 'చంద్రబాబు'లోకి వై.ఎస్‌ ఆత్మప్రవేశించిందా..? అన్న అనుమానం వ్యక్తం అవుతుందని ఆవేదనతో చెబుతున్నారు. ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో కానీ, అప్పటి చంద్రబాబుకు, ప్రస్తుత 'చంద్రబాబు'కు పోలికే లేదు. మంత్రులు తమ సత్తాను నిరూపించుకునేందుకు రెండేళ్లు సమయం ఇస్తానని అప్పట్లో 'చంద్రబాబు' చెప్పారు. అయితే రెండేళ్ల వరకు తమ పదవులకు ఢోకా లేదని భావించి విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారనే విమర్శలు కొనితెచ్చుకున్నారు. ఈ ఆరోపణలు స్వంత పార్టీ నుంచే రావడం విశేషం. ఒకప్పుడు పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు 'చంద్రబాబు'ను ఆదర్శంగా తీసుకుంటున్నామని ఘనంగా చెప్పుకునేవారు. ప్రస్తుతం 'చంద్రబాబు' పేరు చెప్పే ముఖ్యమంత్రి ఎవరూ కనిపించడం లేదు. దీంతో ఆయన పరిస్థితి ఎంత దారుణంగా ఉందో స్పష్టం అవుతుంది. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న అనుభవం, పదేళ్లు అధికారంలో ఉన్న అనుభవం ఆయనకు ఉన్నా...ఆయన ఇప్పుడు పాలనపై పట్టుకోసం కిందా మీదా పడుతున్నారు. అవినీతికి వై.ఎస్‌.ద్వారాలు తెరవగా...చంద్రబాబు ద్వారాలతో సహా గోడలను కూడా బద్ధలు కొడుతున్నారని విమర్శలు తెచ్చుకుంటున్నారు. మంత్రుల కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు అందినంత వరకు దోచుకునే కార్యక్రమంలో మునిగిపోయారు. కొంతమంది మంత్రుల దగ్గర పనికావాలంటే వారి కుమారులనో, ఇతర బంధువులనో ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఒకరిద్దురు మంత్రుల భార్యలు కూడా తెరపైకి వచ్చి అధికారులను శాసిస్తూ, ఖరీదైన కానుకలను తీసుకుంటున్నారని బయటకు పొక్కింది. 

    చంద్రబాబు గత పరిపాలన చూశాను..ప్రస్తుత రెండేళ్లపరిపాలన కూడా చూస్తున్నాను..సిఎం చంద్రబాబుకు ఇంత బలహీనతలు ఎందుకు వచ్చాయో అర్థం కావడం లేదని, భారతదేశంలో ఒకప్పుడు 'చంద్రబాబు' అంటే ఆయా రాష్ట్రాల ప్రజలు గౌరవించేవారు...అభిమానించేవారు.. ప్రస్తుత పరిస్థితి అందుకు విరుద్దంగా కనిపిస్తోందని గతంలో 'బాబు' వద్ద పనిచేసిన అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ అధికార వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్‌ 'అవినీతి ప్రదేశ్‌'గా మారిందని కొందరు 'బాబు'ను అభిమానించే ఐఎఎస్‌ అధికారులు వాపోతున్నారు. అధికార యంత్రాంగంపై పట్టుతప్పింది..మంత్రులు, శాఖాధిపతులు, ఇతర అధికారులు ఎప్పుడు తమ కార్యాలయాలకు వస్తారో..ఎప్పుడు వెళతారో ఏ ఒక్కరికి సమాచారం ఉండడం లేదు. మంత్రుల కార్యాలయాలల్లో పనిచేస్తున్న అంతరంగికులపై నిఘా వర్గాలు వారి అవినీతి గురించి సమాచారం ఇచ్చినప్పటికీ ఇంత వరకు ఏ ఒక్కరిపై చర్య తీసుకోలేదు. పదేళ్ల కాంగ్రెస్‌ హయాంలో మంత్రుల వద్ద అంతరంగికులుగా పనిచేసిన వారిని తిరిగి తీసుకోవద్దని 'చంద్రబాబు' ఆదేశించినా ఏ ఒక్క మంత్రి ఆయన ఆదేశాలను పాటించలేదు. అప్పట్లో మంత్రుల పేరుతో లక్షలు, కోట్లు వసూలు చేసిన వారు మళ్లీ కొందరు మంత్రుల కార్యాలయాల్లో కనిపిస్తున్నారు. దళారులు, మధ్యవర్తులు, రాజకీయ బ్రోకర్లు, తార్పుడుగాళ్లు, ఇతర బ్రోకర్ల హవా ఇప్పుడు నడుస్తోంది. తన కార్యాలయంలో సమర్థులు, నిజాయితీపరులను నియమించుకోవడంలో 'చంద్రబాబు' విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. పైన చెప్పిన విమర్శలన్నీ అధికారపార్టీ నాయకుల నుంచే రావడం విశేషం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకంలో గందరగోళం, అనారోగ్యంతో బాధపడుతున్న అధికారికి సర్వీసు పొడిగించి అప్రదిష్ట మూటగట్టుకున్నారు. ఏ శాఖకు ఏ అధికారిని నియమించాలో గతంలో చర్చించి నిర్ణయం తీసుకునే 'బాబు' ఇప్పుడు ఆ విధానానికి తిలోదకాలు ఇచ్చారు. ప్రస్తుతం శాఖాధిపతులను నియమించే ముందు ఎవరితోనూ చర్చించడం లేదు. పలు జిల్లాల్లో మంత్రులకు, ఎమ్మెల్యేలను కలెక్టర్లు ఖాతరు చేయడం లేదని బాహాటంగా విమర్శలు వస్తున్నాయి.వారి మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించడం లేదు. వై.ఎస్‌ హయాంలో ఏమేమి జరిగిందో అప్పుడు ఏ రకంగా వ్యవహరించారో ఆయన బాటలోనే 'చంద్రబాబు' నడుస్తున్నారని ఆయన 'ఆత్మ' ఈయనలోకి ప్రవేశించిందనే విమర్శలు వస్తున్నాయి. మరి 'బాబు' ఈ విమర్శలపై స్పందిస్తారో...లేదో వేచి చూడాల్సి ఉంది.

(1145)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ