WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'వినుకొండ'ను పట్టించుకోని 'జగన్‌'...!

వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా క్లీన్‌స్వీప్‌ చేసి అధికారాన్ని దక్కించుకుంటామని పదే పదే చెబుతున్న ప్రతిపక్షనాయకుడు అందుకు తగ్గ కసరత్తు చేస్తున్నారా? అంటే లేదనే సమాధానం వస్తోంది. ప్రస్తుతానికి ఉన్న 175 అసెంబ్లీ సీట్లలో కనీసం 70సీట్లలో పార్టీకి సరైన నాయకత్వమే లేదు. గత ఎన్నికల్లో పార్టీ తరుపున అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయిన వారు అప్పటి నుంచి క్రియాశీలకంగా లేరు. గత ఎన్నికల్లో భారీ ఎత్తున నిధులు ఖర్చు పెట్టుకుని ఓడిపోయిన వీరు రాబోయే ఎన్నికల గురించి సీరియస్‌గా ఆలోచించడం లేదు. రాజకీయ చైతన్యం కలిగిన గుంటూరు జిల్లాలో వైకాపాకు కనీసం అరడజను స్థానాల్లో నాయకత్వలేమి కనిపిస్తోంది. ముఖ్యంగా అధికార టిడిపి బలంగా ఉన్న ఈ నియోజకవర్గాల్లో వైకాపాకు నాయకత్వం లేదు. ముందుగా జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన 'వినుకొండ'లో పార్టీ రోజు రోజుకు క్షీణిస్తోంది. ఈ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడానికి అగ్రనాయకత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలు పదే పదే పర్యటించిన వై.ఎస్‌.జగన్‌ ఇటు వైపు తొంగి కూడా చూడడంలేదు. గత నెలలో గుంటూరులో నిర్వహించిన 'యువజన సదస్సు' సందర్భంగా కానీ...అంతకు ముందు మాచర్ల,రాజధాని ప్రాంతాల్లో పర్యటించిన సందర్భాల్లో కానీ ఆయన ఈ ప్రాంతం వైపు రాలేదు.

   గత ఎన్నికల్లో పార్టీ శ్రేణులు అంతా వద్దన్నా తాను నిర్ణయించిన అభ్యర్థినే వారిపై బలంగా రుద్దిన 'జగన్‌' తరువాత అయినా తన తీరు మార్చుకున్న పాపాన పోలేదు. తన స్నేహితుని భార్య అయిన 'నన్నపునేని సుధ'ను పార్టీ అభ్యర్థిగా నాడు రంగంలోకి దింపి చేయికాల్చుకున్నారు. నాటి ఎన్నికల్లో ఆమెపై టిడిపి అభ్యర్థి ఘన విజయం సాధించారు. స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు ఆమెను వద్దన్నా బలవంతంగా ఆమెను ఇక్కడి నుంచి పోటీ చేయించారు. స్థానికుడైన 'బొల్లా బ్రహ్మనాయుడు'ను ఇక్కడ నుంచి 'పెదకూరపాడు' పంపించి ఆయనను అక్కడ ఓడించారు. స్థానికేతరులను రెండు నియోజకవర్గాల్లో బరిలో ఉంచడంతో రెండింటికి చెడ్డ రేవడి అయిపోయింది పార్టీ పరిస్థితి. ఎన్నికల ఫలితాల తరువాత మళ్లీ 'బ్రహ్మనాయుడు'ను వినుకొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమించారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన ఇంకా ఆ బాధ నుంచి తేరుకోలేదు. దీంతో ఇక్కడ ఆయన అన్కమనస్కంగా పనిచేస్తున్నారు. పేరుకు ఇన్‌ఛార్జి అయినా అనుకున్న రీతిలో పార్టీని నడపలేకపోతున్నారు. ఏదో నామ్‌కేవాస్తీ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇంతకు ముందున్నంత క్రియాశీలకంగా ఆయన వ్యవహరించడం లేదు. అసలు ఎన్నికల నాటికి మళ్లీ తనకు 'జగన్‌' టిక్కెట్‌ ఇస్తారా...? లేక మరో అభ్యర్థిని తెచ్చి ఇక్కడ పెడతారేమోనన్న భయాలు ఆయనకు ఉన్నాయి. దీంతో ఎందుకొచ్చిన గొడవలే అన్నట్లు ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదు. గత ఎన్నికల్లో కోట్లు గుమ్మరించి ఆయన పోరాడారు. అయితే ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత పార్టీ నిర్వహించిన సమీక్షల్లో పార్టీ పుంజుకుంటుందని, దానికి తాను కృషి చేస్తానని చెప్పిన 'జగన్‌' ఇంత వరకు 'వినుకొండ'లో పర్యటించలేదు. దీంతో 'జగన్‌' ఆలోచనలేమిటో తెలియక పార్టీ స్థానిక నాయకత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. దీంతో ఇక్కడ అధికార టిడిపి అభ్యర్థి మరోసారి తన విజయానికి ఢోకా లేదనే ధీమాతో ఉన్నారు. ఇటీవల వైకాపా చేయించిన సర్వేలో కూడా ఇదే విషయం తేలిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లాలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఇక్కడ గెలిచేది టిడిపినేని పలు సర్వేలు పేర్కొంటున్నాయి. మరి ఇప్పటికైనా 'జగన్‌' ఈ నియోజకవర్గంపై దృష్టి పెట్టి పార్టీని గెలిపించడానికి ప్రయత్నాలు చేస్తారా...? లేక గతంలో వలే ఆఖరు నిమిషంలో ఎవరినో ఒకరిని ఇక్కడకు తెచ్చి రుద్దుతారా...? వేచి చూడాల్సిందే...!


(4088)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ