లేటెస్ట్

డిప్యూటీ సిఎంలు వర్సెస్‌ సీనియర్‌ మంత్రులు...!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి తన మంత్రివర్గంలో ఐదుగురు మంత్రులను డిప్యూటీ సిఎంలుగా నియమించుకోవడం సంచలనం సృష్టిస్తోంది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇద్దరు డిప్యూటీ సిఎంలు ఉంటేనే...ఎందుకు ఆరవ వేలు అన్నట్లుగా పెదవి విరిచారు. అయితే ఇప్పుడు ఏకంగా ఐదుగురిని డిప్యూటీ సిఎంలుగా ఎంపిక చేయడంపై రాజకీయ పరిశీలకులు పలురకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ,బిసీ,కాపు కులాలకు చెందిన వారిని ఉపముఖ్యమంత్రిగా నియమిస్తానని 'జగన్‌' ఈరోజు పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో తేల్చి చెప్పారు. దీంతో ఆయా సామాజికవర్గాలకు చెందిన వారు ఉప ముఖ్యమంత్రులు కాబోతున్నారు. అయితే ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ వర్గాల్లో సీనియర్‌ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్క లేదు. 

ఈ వర్గాల్లో పదవులు దక్కిన వారంతా జూనియర్సే. వీరే ఉపముఖ్యమంత్రులు కాబోతున్నారు. బీసీ,కాపు వర్గాల్లో సీనియర్లకు మంత్రి పదవులు దక్కడంతో ఆ వర్గాలతో ఇబ్బంది లేదు. పైన పేర్కొన్న వర్గాలకు చెందిన వారు..హోదా పరంగా సీనియర్‌ మంత్రుల కంటే అధికులు. ఉదాహరణకు చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రస్తుతం ప్రకటించిన మంత్రుల్లో అందరి కన్నా సీనియర్‌. ఈయనకు మంత్రి పదవి దక్కినా..ఉప ముఖ్యమంత్రి మాత్రం దక్కదు. దీంతో మొదటిసారి గెలిచి ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కించుకున్న వారి కన్నా..ఆయన హోదా పరంగా జూనియరే. అదే విధంగా మరి కొందరు మంత్రులు...రాజకీయంగా ఎంత సీనియర్లు అయినా...మంత్రివర్గంలో మాత్రం జూనియర్లే. రాబోయే రోజుల్లో..డిప్యూటీ సిఎంలు...సీనియర్‌ మంత్రుల మధ్య ఇది పెద్ద రచ్చకు కారణం అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కాగా...'బత్స' వంటి సీనియర్‌ మంత్రి 'బీసీ' కోటాలో ఉప ముఖ్యమంత్రి కావచ్చు. అదే విధంగా 'పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణ' వంటి వారిలో ఎవరికి బీసీ కోటాలో ఉప ముఖ్యమంత్రి పదవి దక్కుతుందో...? బీసీ కోటాలో సీనియర్‌ అయిన 'బత్స' కాకుండా..మిగతా వారికి ఎవరికి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కినా..'బత్స'కు అవమానమే. అదే విధంగా 'కాపు'ల్లో కూడా...ఇదే రకమైన పరిస్థితి ఉంది. ఇక ఎస్సీ, ఎస్టీ,మైనార్టీల్లో అటువంటి పరిస్థితి పెద్దగా లేదు. ఏది ఏమైనా ఐదుగురు డిప్యూటీ సిఎంలు...సీనియర్‌ మంత్రుల మధ్య రానున్న రోజుల్లో రసవత్తరమైన రాజకీయం నడుస్తుందని రాజకీయపరిశీలకులు పేర్కొంటున్నారు. మరి 'జగన్‌' వీరిని ఎలా సమన్వయం చేసుకుంటారో..చూడాల్సి ఉంది.

(618)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ