WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

జాడ తెలిసిన ఇస్రో తొలి లూనార్ మిష‌న్ చంద్ర‌యాన్‌-1

హూస్ట‌న్‌ మార్చ్ 10:: ఇస్రో తొలి లూనార్ మిష‌న్ చంద్ర‌యాన్‌-1 జాడ తెలిసింది. అది ఇప్ప‌టికీ చంద్రుని చుట్టూ తిరుగుతున్న‌ద‌ని నాసా ఇంట‌ర్‌ప్లానెట‌రీ రాడార్ గుర్తించింది. 2008, అక్టోబ‌ర్ 22న లాంచ్ చేసిన త‌ర్వాత ఏడాది కూడా కాకుండానే.. 2009, ఆగ‌స్ట్ 29న చంద్ర‌యాన్‌-1తో ఇస్రోకు క‌మ్యూనికేష‌న్ తెగిపోయింది. అయితే అది ఎక్క‌డికీ పోలేద‌ని, చంద్రుని ఉప‌రిత‌లానికి 200 కిలోమీట‌ర్ల ఎత్తులో తిరుగుతున్న‌ద‌ని తాజాగా నాసా శాస్త్ర‌వేత్త‌లు వెల్ల‌డించారు. చంద్ర‌యాన్‌-1తోపాటు నాసాకు చెందిన లూనార్ రీక‌నాయిసెన్స్ ఆర్బిట‌ర్‌ను కూడా ఈ రాడార్ గుర్తించిన‌ట్లు నాసాలోని జెట్ ప్ర‌ప‌ల్ష‌న్ లేబొరేట‌రీ రాడార్ సైంటిస్ట్ మ‌రీనా బ్రోజోవిక్ వెల్ల‌డించారు. ఎల్ఆర్‌వోను ఈజీగానే గుర్తించ‌గ‌లిగినా.. ఎప్పుడో ఏడేళ్ల కింద‌ట క‌మ్యూనికేష‌న్ తెగిపోయిన చంద్ర‌యాన్‌-1ను గుర్తించ‌డానికి కాస్త శ్ర‌మించాల్సి వ‌చ్చింద‌ని ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.
సాధార‌ణంగా భూమి క‌క్ష్యలో స‌మాచార వ్య‌వ‌స్థ తెగిపోయి తిరుగుతున్న స్పేస్‌క్రాఫ్ట్‌, ఇత‌ర శిథిలాల‌ను గుర్తించ‌డ‌మే క‌ష్టం. అలాంటిది చంద్రుని క‌క్ష్య‌లో ఉన్న‌వాటిని గుర్తించ‌డం ఇంకా క‌ష్టం. చంద్రుని వెలుతురులో చిన్న‌చిన్న వ‌స్తువుల‌ను ఆప్టిక‌ల్ టెలిస్కోపులు గుర్తించ‌లేవు. అయితే కొత్త‌గా వ‌చ్చిన ఇంట‌ర్‌ప్లానెట‌రీ రాడార్ అనే అప్లికేష‌న్ ద్వారా ఈ స్పేస్‌క్రాఫ్ట్స్‌ను గుర్తించడం సాధ్య‌మైంది. భ‌విష్య‌త్తులో చంద్రునిపైకి స్పేస్‌క్రాఫ్ట్‌ల‌ను పంపేవారికి ఈ కొత్త టెక్నాల‌జీ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని సైంటిస్టులు భావిస్తున్నారు. ఒక‌ర‌కంగా చంద్ర‌యాన్-1 ఈ టెక్నాల‌జీని విజ‌యవంతంగా ప‌రీక్షించ‌డానికి కూడా ఉప‌యోగ‌ప‌డింది.

(343)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ