WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

చార్జీల‌ బాదుడులో త‌గ్గేది లేదంటున్న బ్యాంకులు

కనీస నగదు నిల్వలు లేని ఖాతాలపై జరిమానాలు విధించి బ్యాంక్ ఖాతాదారులకు దిమ్మతిరిగేలా షాక్ ఇచ్చిన ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఈ చార్జీలు సబబేనని స్పష్టంచేసింది. జన్‌ధన్ ఖాతాల నిర్వహణ వల్ల పడుతున్న ఆర్థిక భారాన్ని పూడ్చుకోవడానికి చార్జీలు విధించాల్సి వచ్చిందని ఎస్‌బీఐ చైర్మన్ అరుంధతీ భట్టాచార్య తెలిపారు.  దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  కనీస నగదు నిల్వలు లేని ఖాతాలపై జరిమానా విధించడాన్ని సమర్థించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జన్‌ధన్ ఖాతాలు భారీ స్థాయిలో ఉండటంతో వీటివల్ల పడుతున్న భారాన్ని పూడ్చుకోవాలంటే ఇలా చార్జీలు విధించకతప్పదని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి. పొదుపు ఖాతాల్లో కనీస నగదు నిల్వలు లేకపోతే జరిమానా చార్జీలు తప్పవని ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య స్పష్టంచేశారు. నగదు నిల్వ అవసరం లేని జన్‌ధన్ ఖాతాల నిర్వహణ భారం తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆమె వెల్లడించారు. ఇటువంటి ఖాతాలు ఎస్‌బీఐలో 11 కోట్లు ఉన్నాయని ఆమె విలేకరులతో చెప్పారు. నగదు నిల్వ తగినంత లేనప్పటికీ జన్‌ధన్ ఖాతాలకు మాత్రం జరిమానా వర్తించదని స్పష్టంచేశారు. బ్యాంక్ ఖాతాల్లో నెలవారీ సగటు నిల్వ (ఎంఏబీ) విఫలమైతే పన్నులతో కలుపుకొని రూ.100 వరకు జరిమానా విధించనున్నట్లు గతవారం ప్రకటించిన విషయం తెలిసిందే. జరిమానా విధించే పాత పద్దతిని మళ్లీ ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తామని ఇటీవల బ్యాంక్ ప్రకటించే ముందుకు అన్ని వర్గాల నుంచి సమాచారం సేకరించామ‌ని, ఆ తర్వాతనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని మహిళా వ్యాపారవేత్తల వార్షిక సమావేశం అనంతరం అరుంద‌తి భ‌ట్టాచార్య విలేకరులకు వివ‌రించారు. నగదు దాచిపెట్టడం, సరఫరా చేయడానికి, ఏటీఎంల నిర్వహణ కోసం అధికంగా నిధులు వెచ్చించాల్సి వస్తున్నదని, దీంతో బ్యాంక్‌పై అదనపు భారం పడుతున్నదని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా చార్జీలు విధించాలని నిర్ణయించినట్లు ఆమె చెప్పారు. మిగతా బ్యాంకులు కూడా ఖాతాల్లో కనీస నగదు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. 

   గతంలో అన్ని బ్యాంకులు చార్జీలు విధించాయని, 2012లో ఎస్‌బీఐ వీటిని ఎత్తివేసిన విషయాన్ని భట్టాచార్య ఈ సందర్భంగా గుర్తుచేశారు. బ్యాంక్ సర్వే ప్రకారం రూ.5 వేల కంటే అధికంగా కనీస నిల్వలు కలిగినవారు అత్యధిక మంది ఉన్నారని, వీరు జరిమానాకు భయపడాల్సిన పనిలేదని ఆమె పేర్కొన్నారు. అయితే నగదు నిల్వ తగినంత లేని ఖాతాలపై జరిమానా విధించాలన్న నిర్ణయంపై మరోసారి ఆలోచించాలని ప్రభుత్వ సూచన చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటి వరకు తమకు ఎలాంటి సమాచారం లేదని  పేర్కొన్నారు. ఒకవేళ ప్రభుత్వం కోరితే దీనిపై ఆలోచిస్తామని తెలిపారు. ప్రత్యామ్నాయదారుల్లో భాగంగా ఖాతాదారులు మొబైల్, ఇంటర్నెట్ ద్వారా లావాదేవీలు జరుపుకోవాలని ఆమె సూచించారు. నెలకు నాలుగు సార్ల కంటే అధికంగా ఏటీఎం లావాదేవీలు జరుపాల్సిన అవసరం మహిళలకు ఉండదనుకుంటానని భట్టాచార్య అభిప్రాయపడ్డారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రూ.1.60 లక్షల కోట్ల స్థాయిలో రుణాలు ఇచ్చినట్లు, ఈ ఏడాది మరో రూ.10 వేల కోట్లు ఇవ్వాలని బోర్డు నిర్ణయం తీసుకుందన్నారు. ఎస్‌ఎంఈలకోసం బ్యాంక్ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసిందని చెప్పారు

(209)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ