WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

బడ్జెట్‌ అదుర్స్‌...!

బుధవారం నాడు రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అన్ని వర్గాల శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా, సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశారని దీనిని అమరావతి బడ్జెట్‌గా పేర్కొనవచ్చునని ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ ప్రభాకర్‌ 'జనం ప్రతినిధి'తో చెప్పారు. బడ్జెట్‌ దేశంలో కెల్లా అత్యంత ప్రజాధరణ పొందిన బడ్జెట్‌గా ఖ్యాతిని సొంతం చేసుకోవడం ఖాయమని ఆయన అన్నారు. అన్ని వర్గాల ప్రయోజనాలను కాపాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అత్యంత సమతూకంగా నిధులు కేటాయించిందని , ప్రజాబడ్జెట్‌గా తీర్చిదిద్దిన ఆర్థిక మంత్రి యనమలను ప్రశంసిస్తున్నామని 'సతీష్‌' తెలిపారు. ముఖ్యమంత్రి సలహాలు, సూచనలతో ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ నవ్యాంధ్రప్రదేశ్‌ను నిర్మాణాత్మకంగా అభివృద్ధి చేసే విధంగా కనిపిస్తుందని 'అన్నం' కొనియాడారు. కాపు కార్పొరేషన్‌కు వెయ్యికోట్లు కేటాయించడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. బడుగు,బలహీనవర్గాలకు సుమారు పాతికవేల కోట్ల రూపాయలను బడ్జెట్‌లో కేటాయించడం తమ ప్రభుత్వానికే దక్కిందని, చంద్రబాబు ఆ వర్గాల పట్ల చూపుతున్న శ్రద్దకు నిదర్శనమని 'సతీష్‌' ఆనందం వ్యక్తం చేశారు. 

  నీటిపారుదల, వ్యవసాయరంగాలకు సుమారు 20వేల కోట్లకు పైగా కేటాయించడం ఇంతకు ముందు ఏ రాష్ట్రంలోనూ జరగలేదని, పేద రంగానికి చేదోడువాదోడుగా వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు నిధులు కేటాయించారని 'సతీష్‌' సంతృప్తి వ్యక్తం చేశారు. టిడిపి ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై 'జగన్‌' వ్యాఖ్యలను ఆయన ఖండిస్తూ అది అంకెల గారడీ బడ్జెట్‌ కాదని, ఆయా వర్గాలకు పూర్తిగా నిధులు ఖర్చు చేసే బడ్జెట్‌గా 'సతీష్‌' వర్ణించారు. విద్యారంగానికి 20వేల కోట్లకు పైగా ఖర్చుపెట్టబోతున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని ఈర్ష్యా, అసూయలతో విమర్శలు చేస్తున్న 'జగన్‌' తీరును ఆయన తప్పుపట్టారు. పొరుగు రాష్ట్రాలు కూడా మన రాష్ట్ర బడ్జెట్‌ను ఆదర్శంగా తీసుకునే అవకాశాలు లేకపోలేదని ఇప్పటికే ఆయా రాష్ట్రాల ముఖ్యులు ఆర్థిక మంత్రి అభినందనలు తెలిపారని 'అన్నం' చెప్పారు.


(451)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ