లేటెస్ట్

మంత్రుల పేషీల్లోకి....పాతవారిని తీసుకోవద్దు...!

నూతన మంత్రుల పేషీలోకి గత ప్రభుత్వంలో పనిచేసిన ఓఎస్డీ,పిఎస్‌,అడిషినల్‌ పిఎస్‌,పిఎలను తీసుకోవద్దని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి సలహాదారు అజయ్‌కల్లం స్పష్టం చేశారు. దీనిపై ఆయన పేరుతో ఒక లేఖ విడుదలైంది. గత ప్రభుత్వంలో మంత్రుల పేషీలో పనిచేసిన ఏ ఒక్కరినీ మళ్లీ నూతన మంత్రుల వద్ద తీసుకోవాల్సిన అవసరం లేదని, వారందరినీ తప్పించాలని ఆ లేఖలో సూచించారు. అదే సమయంలో నూతన మంత్రుల పేషీల్లోకి తీసుకునే వారి గురించి ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డికి తెలియపరచాలని, ఆయన అంగీకరించిన తరువాత నూతన సిబ్బందిని మంత్రులు పేషీల్లోకి తీసుకోవాలని ఆయన సూచించారు. 

కాగా నిన్న మొన్నటి దాకా...తాము మళ్లీ నూతన మంత్రుల పేషీలో పనిచేస్తామని చెప్పుకున్న వారు..'జగన్‌' నిర్ణయంతో అవాక్కు అవుతున్నారు. గత ప్రభుత్వంలో ఎప్పుడూ జరగనంత అవినీతి జరిగిందని, దానిలో వీరు కూడా భాగస్వాములనే కారణంతో వీరిందరిని ముఖ్యమంత్రి 'జగన్‌' పక్కన పెడుతున్నారని వైకాపా వర్గాలు అంటున్నాయి. కాగా..ఈ నిర్ణయం అమలు చేయడం అంత ఆషామాషీ కాదని, ముందు ఇలానే చెబుతారని, తరువాత..వారే పిలిచి పెట్టుకుంటారని మరి కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో కూడా ఇదే రీతిన చెప్పారని, కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో పనిచేసిన ఎవరినీ మంత్రుల పేషీల్లోకి తీసుకోవద్దని అప్పట్లో 'చంద్రబాబు' ఆదేశించారు. అయితే ఆయన ఆదేశాలను పక్కన పెట్టి... మంత్రులు కాంగ్రెస్‌ హయాంలో పనిచేసిన వారికే పెద్దపీట వేశారు. రిటైర్‌ అయి దాదాపు 20 సంవత్సరాలు అయినా...సచివాలయాన్ని పట్టుకుని వేలాడుతున్న వారికే మళ్లీ మంత్రుల పేషీల్లోకి తీసుకున్నారు. కాంగ్రెస్‌ హయాంలో...మంత్రులకు ఏ విధంగా పనులు చేసుకోవచ్చో చెప్పిన..పేషీ సిబ్బంది..టిడిపి మంత్రులకు కూడా...పనులు ఏ విధంగా చేసుకుని సొమ్ములు దోచుకోవచ్చో..నేర్పించారు. గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన మంత్రుల పేషీ సిబ్బందిపై దారుణమైన అవినీతి ఆరోపణలు వచ్చినా..అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వారిని ఏమీ చేయలేకపోయారు. దీంతో..వారు ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు. ఒక వైపు మంత్రులు, మరో వైపు మంత్రుల పేషీ సిబ్బంది...అవినీతితో 'చంద్రబాబు' ప్రభుత్వం భ్రష్టుపట్టిపోయింది.

'జగన్‌' ఆదేశాలను మంత్రులు పాటిస్తారా...?

అవినీతికి దూరంగా ఉండాలన్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆకాంక్షలకు తగ్గట్టు మంత్రులు వ్యవహరిస్తారా..? ఆయన చేసిన సూచనలను వీరు పాటిస్తారా..? అనేదానిపై చర్చ సాగుతోంది. మిగతా సంగతి ఎలా ఉన్నా..ప్రస్తుతం నూతన పేషీల్లోకి తీసుకునే వారి విషయంలో 'జగన్‌' ఆదేశాలను తూ.చా తప్పకుండా పాటిస్తారా..? అనుభవాన్ని సాకుగా తీసుకుని...ఆ సూచనలు పాటించకుండా పాతవారినే కొనసాగిస్తారా..? అనే దానిపై చర్చ జరుగుతోంది. అయితే ముఖ్యమంత్రి 'జగన్‌' ఆదేశాలను..వీరు ధిక్కరించే అవకాశం లేదని, ఆయన చెప్పినట్లే..అందరూ నడుచుకుంటారని వైకాపా సీనియర్‌ నాయకుడు ఒకరు పేర్కొన్నారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలను..అప్పటి మంత్రులు పాటించలేదు కదా..? అన్న ప్రశ్నకు బదులిస్తూ...ఆయన వేరు..మా ముఖ్యమంత్రి వేరు..? మంత్రులపై 'జగన్‌'కు మంచి పట్టు ఉంది..ఆయన స్ఫూర్తిని వీరు కొనసాగిస్తారని చెప్పారు...మరి చూద్దాం..ఏమి జరుగుతుందో..!?

(736)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ