WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

అసెంబ్లీ నుంచి బీజేపీ సభ్యుల సస్పెన్షన్!

తెలంగాణ అసెంబ్లీ 11వ రోజు సమావేశాలు ఈ రోజు వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. మతపరమైన రిజర్వేషన్ల అంశం ఈనాటి సభను కుదిపేసింది. తెలంగాణ అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలను రెండు రోజుల పాటు సస్పెండ్ చేశారు. మైనార్టీ, గిరిజన, సాంఘిక సంక్షేమశాఖ, గృహ నిర్మాణం, స్త్రీ శిశు సంక్షేమశాఖ పద్దులపై చర్చ జరగుతుండగా సభలో బీజేపీ సభ్యులు మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ఈ రోజు బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో సభా కార్యక్రమాలకు అడ్డు తగులుతున్న బీజేపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలంటూ మంత్రి హరీష్ రావు తీర్మానాన్ని ప్రవేశపెట్టగా... స్పీకర్ ఆమోదించారు. దీంతో, బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. 

  సస్పెండ్ అయిన వారిలో కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, రాజా సింగ్, చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ లు ఉన్నారు. బీజేపీ సభ్యులను సస్పెండ్ చేయడంపై కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ, సభ నుంచి వాకౌట్ చేశారు.ఈ సందర్భంగా, ప్రతిపక్ష నేత జానారెడ్డి మాట్లాడుతూ, సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సస్పెండ్ చేస్తున్నారని మండిపడ్డారు. నిరంకుశ ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ ధోరణి మంచిది కాదని అన్నారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలే కాని, సస్పెండ్ చేయకూడదని చెప్పారు. ధర్నా చౌక్ ఉంటే బీజేపీ ఎమ్మెల్యేలు అక్కడే నిరసన కార్యక్రమం చేపట్టే వారని... ధర్నా చౌక్ లేకపోవడంతోనే వారు అసెంబ్లీలో ఆందోళన చేశారని అన్నారు. ప్రభుత్వ తీరును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందని... తామంతా సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని తెలిపారు. వెంటనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.

(226)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ