WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

చక్రం తిప్పిన 'అన్నం'...!

బాపట్ల పురపాలకసంఘ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నిక చేయించడంలో ఆ నియోజకవర్గ ఇన్‌ఛార్జి, ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ ప్రభాకర్‌ చక్రం తిప్పారు. 'జగన్‌' పార్టీ అభ్యర్థిగా, డమ్మీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసినప్పటికీ స్క్రూటినీలో వారి నామినేషన్‌ను తిరస్కరించడం జరిగింది. అంతకు ముందు ఇంటిపెండెంట్‌గా కొందరు పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకోగా వారిని పిలిపించి నచ్చ చెప్పి నామినేషన్‌ వేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు 'ప్రభాకర్‌'. దీంతో టిడిపి అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికవడంతో 'జగన్‌' పార్టీ నాయకులు ఖంగుతిన్నారు. బాపట్ల నియోజకవర్గంలో 'జగన్‌' పార్టీ నాయకులకు కొరుకుడు పడని 'అన్నం' తన పార్టీ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నిక చేయించడంతో ఆయన మరింత బలపడ్డారని టిడిపి నాయకులు చెబుతున్నారు. చంద్రబాబు, చినబాబులపై 'జగన్‌'పార్టీ నాయకులు విమర్శలు, ఆరోపణలు చేసినప్పుడు అందరికంటే ముందే స్పందించి ధీటైన సమాధానం చెప్పిన 'అన్నం'ను ఏదో విధంగా దెబ్బకొట్టాలని ఆపార్టీ నాయకులు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. 

   తమకు ఓటర్లు ఉన్నప్పటికీ అభ్యర్థులను నిలపడంలో విఫలమయ్యామని ఆ పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన 'అన్నం' ఆ తరువాత ఎమ్మెల్సీగా ఎన్నికై సామాన్య ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ దూసుకుపోతున్నారని టిడిపి నేతలు చెబుతున్నారు. బాపట్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోనరఘుపతి టిడిపిలో చేరాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ నియోజకవర్గ స్థానికసంస్థల ప్రతినిధులు, నాయకులు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. తమ నాయకుడైన 'అన్నం'ను ఏదోవిధంగా ఇబ్బందులు పెట్టాలని ఎప్పటికప్పుడు కుయుక్తులు పన్నుతున్నా అవి ఫలించడం లేదని కార్యకర్తలు చెబుతున్నారు. బాపట్ల మున్సిపాల్టీలోని వార్డు ఎన్నికలో టిడిపి అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో తమ పార్టీ నాయకులు కూడా 'అన్నం'కు పరోక్షంగా మద్దతు పలికారని 'జగన్‌' పార్టీ నాయకులు చెబుతున్నా...ఆ వార్డుకు చెందిన ఓటర్లలో మెజార్టీ ఓటర్లు టిడిపికి అనుకూలంగా ఉన్నారని తెలుసుకున్న 'జగన్‌' పార్టీ నాయకులు పోటీ చేసేందుకు ముందుకు రాలేకపోయారు. దీనిని అనుకూలంగా మలచుకుని చక్రం తిప్పి తమ పార్టీ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నిక చేయించి 'జగన్‌' పార్టీ నాయకులకు సవాల్‌ విసిరారు 'అన్నం'.


(425)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ