WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

వారికంటే సమర్థులు లేరా...'బాబూ...!?

స్థానిక సంస్థల ద్వారా ఎమ్మెల్సీలకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు చిత్ర,విచిత్రంగా, ఆవేశ, ఆగ్రహంతో కూడిన వ్యాఖ్యలను బ్యాలెట్‌ పేపర్‌పై రాశారట. ముఖ్యంగా నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి వాకాటి నారాయణరెడ్డి, పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి 'పట్టాభిరామిరెడ్డి'లపై కొందరు ఓటర్లు లిఖితపూర్వకంగా ఘాటైన పదజాలంతో వ్యాఖ్యలు చేయడం బయటకు పొక్కింది. 'చంద్రబాబు' నువ్వు మారవా...? అభ్యర్థుల ఎంపికను గుడ్డిగా ప్రకటిస్తారా...? ఏ అర్హతతో ఆ ఇద్దరు అభ్యర్థులను మీరు ఎంపిక చేశారు...? ఇటువంటి అభ్యర్థుల కన్నా..గట్టివారు మీ పార్టీలో లేరా...? 'లోకేష్‌గారూ...! మీరు నవతరం రాజకీయనాయకుడిగా చెప్పుకుంటున్నారు...? యువ రాజకీయం ఇదేనా...? మీ తండ్రిగారు తప్పు చేస్తుంటే అడ్డుపడే ధైర్యం మీకు లేదా...? మంత్రి నారాయణా...! రాజకీయాలను విద్యావ్యాపారం చేసినట్లే చేస్తావా...? నీ కళాశాలల్లో పనిచేస్తేనే పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తారా...? ఏం కష్టపడ్డావని...నీకు మంత్రి పదవి వచ్చింది...! అని పలువురు ఓటర్లు వ్యాఖ్యలు చేసినట్లు బయటపడింది. ఈ వ్యాఖ్యలపై టిడిపి నాయకులు చర్చించుకుంటున్నారు. 14500పైగా ఓట్లు 'నోటా'కు పోలైయ్యాయంటే టిడిపి అభ్యర్థిపై ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టమైంది. అదే విధంగా సుమారు 10వేల ఓట్లకు పైగా ఇంట్‌ మార్క్‌ పెట్టారు ఓటర్లు. అభ్యర్థులు నచ్చకపోవడంతోనే టిడిపి ఓడిపోయిందని ఇప్పుడు టిడిపి నాయకులు చెప్పుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్లును కొన్నట్లే...గ్రాడ్యుయేట్‌ ఓటర్లును కొనుగోలు చేసినట్లయితే తమ అభ్యర్థి గెలిచేవారని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారట. అధికారం...ఉంది...ఓటర్లలో అభిమానం ఉంది...ఓట్లు వేయించుకోవడంలో అధికారపార్టీ నాయకులు ఘోరంగా విఫలమయ్యారు. 

   సరైన అభ్యర్థిని ఎంపిక చేసినట్లయితే అఖండ మెజార్టీతో పట్టభధ్రుల టిడిపి అభ్యర్థిని గెలిపించేవారు. అదే విధంగా 'వాకాటి నారాయణరెడ్డి' కాకుండా మరో గట్టి అభ్యర్థిని ఎంపిక చేస్తే ప్రస్తుత మెజార్టీ కన్నా ఐదురెట్లు పైగా మెజార్టీ వచ్చేదని వారు అంటున్నారు. ఇది ఓటర్ల అభిప్రాయమే కాదు..పార్టీ కార్యకర్తల అభిప్రాయం కూడా. నెల్లూరులో పార్టీ బలం పెరిగిందని...స్థానిక సంస్థల అభ్యర్థి 200పైగా ఓట్ల మెజార్టీతో అవలీలగా విజయం సాధిస్తారని గొప్పలు చెప్పుకున్న మంత్రి నారాయణ, ఎమ్మెల్సీ బీద రవిచంద్రయాదవ్‌ ఇతర నాయకులకు ఓటర్లు గుణపాఠం చెప్పారు. మా ఓట్లు మీరు కొంటుంటే...మీ ఓట్లు మేముకొనలేమా...? అన్న చందంగా వైకాపా నాయకులు పకడ్బందీగా ఓట్లు కొనుగోలు చేసి టిడిపి నాయకులకు షాక్‌ ఇచ్చారు. ఇద్దరు అభ్యర్థుల ఎంపిక తప్పిదమేనని 'చంద్రబాబు, చినబాబు'లు పరోక్షంగా అంగీకరించినప్పటికీ వారిద్దరి ప్రతిష్ట కొంత వరకు మంటగలిసిందని మాజీ మంత్రి ఒకరు 'జనం ప్రత్యేక ప్రతినిధి'కి తెలిపారు. ఇప్పటికైనా 'చంద్రబాబు' కళ్లు తెరిచి నెల్లూరు జిల్లాలో 'నారాయణ, రవిచంద్రయాదవ్‌'ల పెత్తనం తగ్గించి, ప్రజాభిమానంతోపాటు, అన్ని వర్గాల్లో పేరు ప్రతిష్టలు ఉన్న 'రెడ్డి' సామాజికవర్గానికి చెందిన వారికి మంత్రి పదవి ఇస్తే పార్టీ మరింత బలోపేతం కావడం ఖాయమని నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు రాష్ట్రపార్టీ కార్యాలయనాయకులకు చెప్పినట్లు తెలిసింది.


(296)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ