కాలమిస్టు చంద్రబాబునాయుడు...!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కొత్త అవతారం ఎత్తారు. ఇన్నాళ్లూ ఆయన మనకు రాజకీయనాయకుడిగానే కనిపించేవారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్షనేతగా ఆయనను చాలా సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. అయితే..ఆయన ఇప్పుడు సరికొత్తగా కాలమిస్టు అవాతరం ఎత్తారు. ఆయన రాజకీయచరిత్రలో తొలిసారి ఓ పత్రికకు ఓ వ్యాసాన్ని రాశారు. అదీ ఓ ఆంగ్ల పత్రికకు ఆయన వ్యాసం రాశారు. సాధారణంగా రాజకీయనాయకులు పత్రికలకు వ్యాసాలు రాయడం సర్వసాధారణమే. అయితే..అవన్నీ రాజకీయాలకు సంబంధించినవి మాత్రమే అయి ఉంటాయి. అయితే చంద్రబాబునాయుడు నేడు రాసిన వ్యాసం ఆర్థిక సంబంధమైనది. రెవిన్యుబుల్ ఎనర్జీ గురించి ఆయన తన వ్యాసంలో రాశారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆయన రాసిన వ్యాసం ఎడిటోరియల్ పేజీలో ప్రచురించారు. ఈ వ్యాసంలో రెవిన్యుబుల్ ఎనర్జీలో ఆంధ్రాకు ఉన్న అవకాశాల గురించి, ప్రస్తుత ప్రభుత్వం దీనిపై పెట్టుబడుల కోసం ఎటువంటి అవకాశాలు కల్పిస్తోందన్నదానిపై ఆయన సవివరంగా తన ఆలోచనలను పంచుకున్నారు. ఈ రోజు గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో జరుగుతున్న Re-Invest Renewable Energy Investors Meet & Expoలో ఆయన పాల్గొననున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన రాష్ట్రంలో పెట్టుబడిదారులకు ఉన్న అవకాశాలను ఆయన ఈ సందర్భంగా వివరించనున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ప్రపంచవ్యాప్త పెట్టుబడుదారులతో తన ఆలోచనలను పంచుకుని ఉమ్మడి రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించడంలో కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో ఆయనను ఆంధ్రప్రదేశ్ సీఇఓగా పెట్టుబడుదారులు అభివర్ణించేవారు. ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల గురించి ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.