WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'పుల్లారావు'కు 'చినబాబు' అండ...!

మంత్రి పుల్లారావు కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు 'చినబాబు' ద్వారా 'చంద్రబాబు'పై ఒత్తిడి తెచ్చి ఆయనను పదవీగండం నుంచి కాపాడినట్లు అధికారపార్టీలో చర్చ జరుగుతోంది. ఏ విషయాలు పనిచేసేయో కానీ..ఆఖరు నిమిషంలో మెత్తబడిన 'చంద్రబాబు' 'పుల్లారావు'ను మరికొంత కాలం మంత్రి పదవిలో కొనసాగించేందుకు అంగీకరించారట. తెలంగాణ రాష్ట్రానికి చెందిన గరికపాటి మోహన్‌రావు మంత్రి పుల్లారావుకు మధ్య వ్యాపార లావాదేవీలు ఉన్నాయని, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోతున్న నేపథ్యంలో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో సెటిల్‌ అయ్యేందుకు 'గరికపాటి' ఆలోచిస్తున్నారట. 'చంద్రబాబు' తన సామాజికవర్గానికి చెందిన 'పుల్లారావు'పై వేటు వేయకుండా పార్టీకి ఎప్పటి నుండో వీరవిధేయులైన 'బొజ్జల గోపాలకృష్ణారెడ్డి', పల్లె రఘునాథ్‌రెడ్డిలను తప్పించడం ఆ సామాజికవర్గంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. మంత్రి పుల్లారావు పదవిలో కొనసాగించడంపై గుంటూరు జిల్లా పార్టీ సీనియర్‌ నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఎప్పటి నుంచో 'పుల్లన్న'ను మంత్రివర్గం నుంచి తొలగిస్తారని భావించిన వీరికి ప్రస్తుత పరిణామాలు మింగుడుపడడం లేదు. 

   'చినబాబు' ద్వారా చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి 'పుల్లన్న' మంత్రి పదవి నిలుపుకున్నారు...ఈ విషయం ముందుగా తెలుసుకుంటే తాను కూడా ఆయన బాటలో నడిచేవాడినని 'పల్లె' వాపోతున్నారట. ఏది ఏమైనప్పటికీ గుంటూరు జిల్లాలో 'ఇద్దరు మంత్రుల'ను తొలగిస్తారని ప్రచారం జరిగినా, ఆఖరు నిమిషంలో 'రావెల'ను మాత్రమే తొలగించడం చిత్రవిచిత్రమైన పరిణామమని చెబుతున్నారు. దళిత వర్గానికి చెందిన 'రావెల'ను తొలగించి, 'కమ్మ' సామాజికవర్గానికి చెందిన 'పుల్లారావు'ను తొలగించకపోవడంపై దళితవర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గుంటూరు జిల్లా రాజకీయాల్లో 'గరికపాటి' జోక్యం ఉండవద్దని పలువురు సీనియర్‌ నాయకులు 'చంద్రబాబు'పై ఒత్తిడి తేవాలని నిర్ణయించుకున్నారు. రాజకీయ అనుభవం లేని 'చినబాబు' మంత్రి 'పుల్లారావు'కు మద్దతు ఇచ్చి తీవ్ర వ్యతిరేకత కొనితెచ్చుకున్నారు. ఈ విషయంలో 'చంద్రబాబు' కూడా ఘోరమైన తప్పిదం చేశారని పార్టీ సీనియర్లు చెబుతున్నారు.

(797)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ