WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'నక్కా'కు మంత్రి పదవి వెనుక 'ఆలపాటి,అన్నం'లు..!

గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం నుంచి 2014లో విజయం సాధించిన 'నక్కా ఆనందబాబు'కు మంత్రి పదవి దక్కడం వెనుక సీనియర్‌ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ ప్రభాకర్‌ కృషి ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు. 'వేమూరు' నియోజకవర్గంలో 1994,99లో ఆలపాటి విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో 'ఆలపాటి' ఓటమి పొందారు. 2009 ఎన్నికల్లో వేమూరు నియోజకవర్గం రిజర్వ్‌ర్డ్‌ కావడంతో తనకు అత్యంత సన్నిహితుడైన 'నక్కా'కు 'ఆలపాటి' టిక్కెట్‌ ఇప్పించారు. అనేక మంది ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ 'నక్కా'పై పెద్దగా ఆరోపణలు రాలేదు. అంతే కాకుండా తనను రెండుసార్లు గెలిపించిన కొన్ని సామాజికవర్గ ఓటర్లను ఆయన ఏనాడూ నిర్లక్ష్యం చేయలేదు. ఇప్పటికీ వారికి అందుబాటులో ఉండడం ఆయనకు కలసి వచ్చింది. తనకు మంత్రి పదవి దక్కదని తెలుసుకున్న 'ఆలపాటి' తన సన్నిహితుడైన 'నక్కా'కు మంత్రి పదవి ఇప్పించడంలో తెరవెనుక ఉండి కృషి చేశారు. అనేక సందర్భాల్లో సిఎం చంద్రబాబు,చినబాబులను కలసిన ఎమ్మెల్సీ 'అన్నం సతీష్‌ ప్రభాకర్‌' తనకు మంత్రి పదవి వద్దని ఎమ్మెల్సీగా తాను కొనసాగి మళ్లీ ఎమ్మెల్యేగాపోటీ చేస్తానని చెప్పారు. మంత్రి పదవి 'నక్కా ఆనందబాబు'కు ఇవ్వాలని ఆయన తండ్రీకొడుకులిద్దరికీ చెప్పారు. 

  ఇదే విషయంపై ఆయన బాహాటంగా స్పందిస్తూ తాను సామాన్య కార్యకర్తగా రాజకీయాల్లోకి ప్రవేశించానని, తాను ఎమ్మెల్సీ స్థాయికి ఎదగడం వెనుక 'చంద్రబాబు,చినబాబుల ఆశీస్సులు ఉన్నాయని, ఈ జన్మకు ఇది చాలని అంటున్నారు. పార్టీ సమీక్షా సమావేశాల్లోకానీ, అంతరంగికంగా మాట్లాడినప్పుడు కానీ 'నక్కా'కు మంత్రి పదవి ఇవ్వాలని పదే పదే కోరుకునేవారు. మీడియా వర్గాలతో అనేక సందర్బాల్లో ఆఫ్‌ ది రికార్డుగా మాట్లాడుతూ 'నక్కా'కు మంత్రి పదవి ఇవ్వాలని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో 'తెనాలి' ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ ప్రభాకర్‌ కృషి వల్లే 'నక్కా'కు మంత్రి పదవి దక్కిందని చెప్పవచ్చు. అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌రావు కూడా 'నక్కా'కు మంత్రి పదవి ఇవ్వాలని సిఎంకు చెప్పారని తెలుస్తోంది. దళిత వర్గానికి చెందిన 'నక్కా' వివాదరహితుడిగా, నిజాయితీపరుడిగా పేరుపొందారు. వేమూరు నియోజకవర్గంలో ఇతర సామాజికవర్గాలకు చెందిన వారిపట్ల వ్యతిరేకత కొని తెచ్చుకోకుండా ఆయన సఖ్యతతో వ్యవహరిస్తున్నారు. అందుకేనేమో ఆయనకు పిలిచి మరీ మంత్రి పదవి ఇచ్చారేమో...!

(643)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ