WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'కాగిత'కు షాక్‌ ఇచ్చిన 'చంద్రబాబు'...!

ముప్పయేళ్ల నుండి టిడిపిలో కొనసాగుతూ నాలుగుసార్లు ఆ పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించి, రెండు సార్లు ఓడిపోయిన బిసి వర్గానికి చెందిన 'కాగిత వెంకటరావు'కు మంత్రి పదవి ఇస్తానని స్వయంగా చంద్రబాబు హామీ ఇచ్చి ఆఖరు నిమిషంలో ప్లేట్‌ ఫిరాయించారు.ఈ పరిణామంతో కంగుతిన్న కాగిత వెంకటరావు ప్రమాణస్వీకారానికి హాజరు కాకుండా ఇంటికే పరిమితం అయ్యారు. నిజాయితీపరునిగా, పార్టీకి వీరవిధేయుడిగా కాగితకు పేరుంది. 1989లో వంగవీటి మోహన్‌రంగా హత్య జరిగినప్పుడు కొన్ని గ్రామాల్లో టిడిపి నాయకుల ఇళ్ళపై అరాచకశక్తులు దాడులు చేసినప్పుడు 'కాగిత వెంకటరావే' స్వయంగా చేతిలో కర్రపట్టుకుని రంగంలోకి దిగారు. దీంతో అరాచకశక్తులు పారిపోయాయి. ఏ ఓటర్లు అయితే తనను ఎమ్మెల్యేగా గెలిపించారో వారి పట్ల అభిమానాన్ని అనేక సందర్భాల్లో ఆయన చూపించారు. 1999 నుండి 2004 వరకు అసెంబ్లీలో పార్టీ విప్‌గా బాధ్యతలు నిర్వహించారు. పదవి ఇచ్చినా...ఇవ్వకపోయినా ఆయన 'చంద్రబాబు'పై విమర్శలు చేయని నాయకునిగా పేరుంది. అటువంటి సీనియర్‌ నాయకునికి మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు ఆఖరు నిమిషంలో రిక్తహస్తం చూపించారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని, తనకు మంత్రి పదవి నిర్వహించాలనే కోరిక ఎప్పటి నుండో ఉందని దాన్ని నెరవేర్చుకునే అవకాశం ఇవ్వమని ఆయన చంద్రబాబును స్వయంగా కలసి కోరగా తప్పకుండా నీకు మంత్రి పదవి ఇస్తాను..నీ సీనియార్టీని, సిన్సియార్టీకి గుర్తింపు ఇస్తాను..అని చేతిలో చెయ్యివేసి హామీ ఇచ్చారని ఆఖరు నిమిషంలో ఈ విధమైన షాక్‌ను ఇచ్చారని 'కాగిత' వాపోతున్నారు.

(349)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ