WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

టిడిపిలో ఎగసిపడుతున్న అసంతృప్తి జ్వాలలు

విశ్వవిఖ్యాత,అన్న నందమూరి తారకరామారావుచే స్థాపించబడిన తెలుగుదేశం పార్టీకి 36ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉంది.ఆనాడు ఎన్టీ రామారావు నీతి,నిజాయతీగల వ్యక్తులను పార్టీలోకి ఆహ్వానించి వారికి టిక్కెట్లు కేటాయించి గెలిపించుకోవటం జరిగింది.శాసనసభ్యులు ఎన్టీ రామారావు హయాంలో పేద,మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులే ఎక్కువుగా ఉన్నారు.అప్పట్లో వారంతా పాత,కొత్త ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నివాసం ఉంటూ అసెంబ్లీ సమావేశాలకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లో వెళ్ళి వచ్చేవారు.వేళ్ళ మీద లెక్కించతగ్గ శాసనసభ్యులకు మాత్రమే కార్లు ఉండేవి.ఇది గతం.ప్రస్తుతం చంద్రబాబునాయుడు అధికారం స్వీకరించినాటి నుండి విధానాల్లో పూర్తిగా మార్పులు చోటుచేసుకున్నాయి.కంప్యూటర్‌యుగం రాష్ట్రంలో ఆరంభమైంది.హైటెక్‌ పరిపాలన చంద్రబాబు సాగించారు.పేద,మధ్యతరగతి నాయకులు కనుమరుగయ్యారు.కేవలం డబ్బుగల వారుమాత్రమే తెలుగుదేశం పార్టీలో అధికారం చెలాయించే స్థాయికి ఎదిగారు.గతంలో ఎన్టీ రామారావు 32మంది మంత్రులతో రాజీనామా చేయించి ఢిల్లీటూర్‌కు వెళ్ళి మూడు,నాలుగు రోజుల అనంతరం తిరిగి వచ్చి వారం అనంతరం మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించారు.అయితే అసంతృప్తులు ఏమాత్రం బయటపడకపోవటం గమనార్హం.

2014లో పదేళ్ళ ప్రతిపక్ష నేత నుండి ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు పదవీప్రమాణ స్వీకారం చేసి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు.ఇందులో తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యుల కన్నా పార్టీలు మారి వచ్చినవారి సంఖ్య ఎక్కువ.వీరిని మూడేళ్ళ పాటు కొనసాగించి పనితీరు బాగోలేదంటూ అందులో నుంచి ఐదుగురు మంత్రులకు ఉద్వాసన చెప్పటం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలను రేపుతోంది.తమకు మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని ఆశతో ఉన్న సీనియర్‌,జూనియర్‌ శాసనసభ్యులు అసంతృప్తి జ్వాలలతో రగిలిపోతున్నారు.ఈవిధానం తెలుగుదేశం పార్టీలో గతంలో కన్నా భిన్నంగా నేడు దర్శనమిస్తోంది.పార్టీ కోసం పనిచేసేవారికి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబునాయుడు తగిన విధంగా గుర్తించి గౌరవించటం లేదన్నది ప్రధాన ఆరోపణగా చేస్తున్నారు.పార్టీ ఆవిర్భావం నుంచి గెలుస్తూ వస్తున్న శాసనసభ్యులను పూర్తిగా పక్కన పెట్టారనే వాదన బలం పుంజుకుంటుంది.పార్టీని నమ్ముకుంటే అన్యాయం చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు.పార్టీలో కొత్తగా వచ్చిన వారికి మంత్రి పదవులు కట్టబెట్టారంటున్నారు.పార్టీలో సమర్థులు లేరా అంటున్నారు.నూతనంగా మంత్రి పదవులు లభించిన 11మందిలో కేవలం ముగ్గురు మాత్రమే తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న వారు కావటం గమనార్హమంటున్నారు.

   అనంతపూర్‌,కడప,కర్నూలు,ప్రకాశం,కృష్ణా,గుంటూరు,చిత్తూరు,నెల్లూరు జిల్లాల్లో సమర్థులైన శాసనసభ్యులకు మంత్రి పదవులు దక్కలేదని మదనపడుతున్నారు.గోరంట్ల బుచ్చియ్యచౌదరి ఇప్పటికే పార్టీ పదవులకు అసంతృప్తితో రాజీనామా సమర్పించారు.చిత్తూరు నుండి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని అనారోగ్య కారణాలతో మంత్రి పదవి నుండి తొలగించారని,శాసనసభ్యుడుగా కూడా పనికిరానుకదా అని రాజీనామా సమర్పిస్తున్నానని ఆయన అంటున్నారు.మరోపక్క గుంటూరుజిల్లాలో సీనియర్‌ శాసనసభ్యుడు ధూళిపాళ్ళ నరేంద్రకుమార్‌ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.మరోపక్క పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన చింతమనేని ప్రభాకర్‌ ఏకంగా సొంత పార్టీ పెడతానంటూ ప్రకటనలు చేస్తున్నారు.కృష్ణాజిల్లా శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు తనకు మంత్రి దక్కలేదని ముఖ్యమంత్రి ఎదుట అసంతృప్తిని చాటుకున్నారు.ఇదేజిల్లాకు చెందిన గౌడ సామాజిక వర్గ శాసనసభ్యుడు కాగిత వెంకట్రావు తన నిరాశక్తతను వ్యక్తం చేశారు.శ్రీకాకుళం జిల్లాకు చెందిన పార్టీ అధ్యక్షురాలు గౌతు శిరీషా తన తండ్రి శ్యామ్‌సుందర శివాజీ ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మంత్రి పదవికి అర్హుడు కాదా అంటూ ఏకంగా చంద్రబాబునాయుడ్ని ప్రశ్నించారు.

   మైనార్టీలు,బ్రాహ్మణులు,గౌడ సామాజిక వర్గాలకు మంత్రి వర్గంలో మొండిచేయి మిగిలిదంటున్నారు.2019శాసనసభ ఎన్నికలకు టీమ్‌ను ఏర్పాటు చేశామని సంకలు బాదుకుంటున్న చంద్రబాబునాయుడు తిరోగమన దిశలో మంత్రి వర్గం ఉందని విమర్శకులు ఆరోపిస్తున్నారు.ఈమంత్రివర్గం పూర్తిగా డబ్బున్నవారికే నన్నది అర్థమవుతుందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.పాతవారిని కొనసాగించి కొత్తగా ఆరుగురిని మంత్రివర్గంలోకి తీసుకుని ఉంటే బాగుండేది కూడా చెప్పుకుంటున్నారు.తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు నారాయణ,గంటా శ్రీనివాసరావు,దేవినేని ఉమామహేశ్వరరావు,ప్రత్తిపాటి పుల్లారావులను తొలగించకుండా మంత్రి వర్గం నుండి ఎస్సీ,బీసీలను తొలగించటం ఏమేరకు రాజనీతి అని ప్రజలు విమర్శిస్తున్నారు.కోట్లు ఖర్చుచేసి శాసనసభ్యులుగా ఎన్నికైన వారిని పక్కన పెట్టి అప్పనంగా పదవులు దక్కించుకున్న ఎమ్మెల్సీలను మంత్రులు చెయ్యటం పలు విమర్శకులకు దారితీసింది. మొత్తం మీద చంద్రబాబునాయుడు తాజా మంత్రివర్గంపై తెలుగుదేశం శాసనసభ్యుల్లో తీవ్ర అసంతృప్తి జ్వాలలు రగులుకుంటున్నాయి.ఇవి ఎటుదారితీస్తాయో వేచి చూద్థాం.


(780)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ