WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ప్రజల్లో సత్తా లేని మంత్రులకు పెత్తనమా...!?

నిన్నటి వరకు మంత్రి హోదాలో 'నెల్లూరు' జిల్లా యంత్రాంగాన్ని శాసించిన మున్సిపల్‌ మంత్రి నారాయణ దూకుడుకు కళ్లెం వేశారు సిఎం చంద్రబాబు. నెల్లూరు జిల్లాలో 'రెడ్డి' సామాజికవర్గాన్ని విస్మరించడం అంటే రాజకీయంగా అ:ధపాతాళానికి పోయినట్లేనని 'చంద్రబాబు'కు అనుభవపూర్వకంగా తెలిసి వచ్చింది. అందుకనేమో మూడుసార్లు వరుసగా ఓడిపోయి...ఓటమి హ్యాట్రిక్‌ వీరునిగా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి ముందుగా ఎమ్మెల్సీ ఇచ్చారు...మంత్రిని కూడా చేశారు. 'జగన్‌'ను తీవ్రంగా దుయ్యబట్టడమే ఆయనకు ఉన్న ఏకైక అర్హత అని నెల్లూరు జిల్లానాయకులు విమర్శిస్తుంటారు. గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గం నుండి టిడిపి అభ్యర్థిగా పట్టాభిరామిరెడ్డిని ఎంపిక చేయటమే ఓటమికి కారణమని తెలుసుకున్న 'చంద్రబాబు' నారాయణను మందలించలేక 'సోమిరెడ్డి'కి మంత్రి పదవి ఇవ్వాల్సి వచ్చింది. కలసి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో మంత్రి నారాయణ రాజకీయంగా ఆలోచించకుండా విద్యావ్యాపారిగా వ్యవహరించి రాజకీయంగా నెల్లూరులో పూర్తిగా దెబ్బతిన్నారు. ముందు ముందు ఆ జిల్లాలో చేయి పెట్టవద్దని 'చంద్రబాబే' ఆదేశించే పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. 

  ఆయనను సచివాలయానికే పరిమితం చేయటం ఖాయమని, అధికారవర్గాలు చెబుతున్నాయి. నెల్లూరులో 'ఆనం' సోదరులను టిడిపిలో చేర్పించడంలో కీలకపాత్ర పోషించారు 'నారాయణ'. 'సోమిరెడ్డి'ని తీవ్రంగా వ్యతిరేకించే 'ఆనం' సోదరులు తనకు అండగా నిలిస్తే రాజకీయంగా ఎదిగిపోతానని భావించారు..కానీ..కాలం కలిసి రాలేదు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఓటమి...మరో ఎమ్మెల్సీ అభ్యర్థి చావు తప్పి కన్నులొట్టపోయి విజయం సాధించటం వంటి కారణాలు 'నారాయణ' కొంప ముంచాయి. జిల్లాలో 'రెడ్డి' సామాజికవర్గం తరువాత 'కమ్మ' సామాజికవర్గ ప్రభావం, బిసి సామాజికవర్గ ప్రభావం అంతో ఇంతో ఉంది. కానీ ఆ రెండు సామాజికవర్గాలకు చెందని 'నారాయణ'కు పెత్తనం ఇచ్చి చేతులు కాల్చుకుని రాజకీయంగా దెబ్బతిన్న నేపథ్యంలో కళ్లు తెరిచిన 'సోమిరెడ్డి'కి మంత్రి పదవి ఇచ్చి ఆ లోటును భర్తీ చేయాలని భావిస్తున్నారు. 

  ఇద్దరం కలిసి పనిచేస్తాం...నెల్లూరు జిల్లాలో ఒక సీటు కూడా 'జగన్‌' పార్టీకి లభించకుండా ఓటర్ల అభిమానం పొందుతామని మంత్రులు సోమిరెడ్డి, నారాయణలు ఇటీవల సన్మానసభలో బీరాలు పలికారు. అది ఎంత వరకు నిజం అవుతుందో...అసంతృప్తితో ఉన్న 'ఆనం' సోదరులను ఎలా సంతృప్తి పరుస్తారో, ప్రజల్లో పట్టులేని మంత్రులు 'సోమిరెడ్డి', నారాయణలు మీడియా సహాయంతో ఇప్పటి వరకు ఒక వెలుగు వెలిగారు. ఎల్లకాలం పరిస్థితులు ఒకే విధంగా ఉండవు కదా...2004, 2014 ఫలితాలు నెల్లూరు జిల్లాలో పునరావృతం కాకుండా ఈ ఇద్దరు మంత్రులు బాధ్యత వహిస్తారా...? ఈ ఇద్దరుపై 'చంద్రబాబు' బాధ్యతలు భుజానపెడతారా...? మాటల గారడితో మభ్యపెట్టగల సత్తా ఉన్న 'సోమిరెడ్డి' విద్యావ్యాపారి 'నారాయణ'లు నెల్లూరు టిడిపిని ఏం చేస్తారో వేచి చూడాల్సిందే...!

(815)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ