WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ముస్లింల రిజర్వేషన్ల పెంపు బిల్లుకు శాసనసభ ఆమోదం

 తెలంగాణలో ముస్లింలు, గిరిజనుల రిజర్వేషన్ల పెంపు ప్రాధాన్య అంశంగా ఆదివారం జరిగిన శాసనసభ, మండలి సమావేశాల్లో రిజర్వేషన్ల పెంపు చట్టంతోపాటు జీఎస్టీపై రాష్ట్ర చట్టం, వారసత్వ కట్టడాల పరిరక్షణ చట్టం రూపకల్పనకు ఉద్దేశించిన బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది.. బీసీ-ఈలకు 4 నుంచి 12 శాతానికి, గిరిజనులకు 6 నుంచి 10 శాతానికి పెంచుతూ ప్రభుత్వం అసెంబ్లీలో ఆదివారం బిల్లును ప్రవేశపెట్టింది. ఈరోజు ఉదయం 11 గంటలకు శాసనసభ ప్రారంభమైన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ రిజర్వేషన్ల పెంపు బిల్లును సభలో ప్రవేశపెట్టారు. వివిధ పార్టీల సభ్యులు దీనిపై చర్చించి ప్రభుత్వానికి పలు సూచనలు అందించారు. భాజపా గిరిజనుల రిజర్వేషన్లకు మద్దతిస్తూనే.. ముస్లింల రిజర్వేషన్లు వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేసింది.

ఈ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ముస్లింలకు ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వకూడదు? వారేం పాపం చేశారు? ఈ దేశంలో ముస్లింలు పౌరులు కాదా? వారు పన్నులు కట్టడంలేదా? కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కచ్చితంగా 9వ షెడ్యూల్‌లో చేర్పించేలా చూస్తామన్నారు. కేంద్రం ఇందుకు అంగీకరించకపోతే అవసరమైతే పార్లమెంట్‌లో దీనికోసం పోరాటం చేస్తామన్నారు. వితండవాదంతో, మతం పేరుతో కొన్ని రాజకీయ పార్టీలు ముస్లింలకు రిజర్వేషన్లను వ్యతిరేకించడం సరికాదన్నారు. తాము ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చితీరుతామని స్పష్టంచేశారు.

వారసత్వ కట్టడాల బిల్లుకు ఆమోదం
రాష్ట్రంలోని వారసత్వ కట్టడాలకు సంబంధించిన బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో పలు చారిత్రక కట్టడాలు ఉన్నాయనీ, గతంలో పాలకులు వాటన్నింటినీ విస్మరించారన్నారు. కొత్త రాష్ట్రంలో రాష్ట్ర హెరిటేజ్‌ బిల్లు మాత్రమే ఉండాలన్నారు. ఈ బిల్లులో ఉండాల్సిన కట్టడాలపై సీఎస్‌ అధ్యక్షతన కమిటీ ఏర్పాటుచేసినట్టు చెప్పారు. చారిత్రక అవశేషాలను పరిరక్షించి భవిష్యత్‌ తరాలకు అందించాల్సిన అవసరాన్ని ఆయన గుర్తుచేశారు. గ్రీన్‌ల్యాండ్‌ గెస్ట్‌హౌస్‌ను వారసత్వ సంపద జాబితాలో చేర్చారని సీఎం తెలిపారు. జోగులంబ ఆలయాన్ని పురావస్తుశాఖకు అప్పగించారనీ, ఆ ఆలయంలో పలు సమస్యలు ఉన్నట్టు చెప్పారు. నిర్వహించలేని, కూలీపోయే వాటినీ ఈ జాబితాలో చేర్చలేమని స్పష్టంచేశారు. పరిరక్షించదగిన కట్టడాలను తప్పకుండా ఈ జాబితాలో చేర్చాలన్నారు. బిల్లు ఆమోదించి.. ప్రతిపాదనలు పంపేలోపే సమగ్రంగా దీనిపై చర్చిద్దామని సభ్యులకు సూచించారు.

జీఎస్టీ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. జీఎస్టీ బిల్లుపై చర్చ సందర్భంగా ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రత్యక్ష పన్నులు జీఎస్టీ పరిధిలోకి రావని స్పష్టం చేశారు. కస్టమ్స్‌ పరోక్ష పన్ను జీఎస్టీ పరిధిలో కాక కేంద్ర పరిధిలో ఉంటుంది. కేంద్ర ఆర్థికమంత్రి ఆధ్వర్యంలో జీఎస్టీ మండలి కమిటీ వేశారు. జీఎస్టీ వల్ల కలిగే నష్టాన్ని రాష్ట్రాలకు ఐదేళ్లు పూడ్చాలనుకున్నాం. ఆల్కహాల్‌, పెట్రోల్‌ ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలోకి రాకుండా మినహాయింపులు ఉన్నాయి’’ అని స్పష్టం చేశారు. అంతకు ముందు కాంగ్రెస్‌ సభ్యుడు జి.చిన్నారెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఒకే దేశం-ఒకే పన్ను విధానంతో బిల్లును తీసుకొచ్చారు. జీఎస్టీ బిల్లులో 5, 12, 18, 28 శాతం ప్రకారం శ్లాబులు ఉన్నాయి. ఒకే దేశం, ఒకే పన్ను అన్నప్పుడు ఇన్ని శ్లాబులు ఎందుకు. రాష్ట్రంలో సేవల రంగం నుంచి 60శాతం ఆదాయం వస్తోంది’’ అని వివరించారు. జీఎస్టీ బిల్లు ఆమోదం పొందిన అనంతరం శాసనసభను వాయిదా వేస్తున్నట్లు ఉప సభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి ప్రకటించారు.

(253)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ