WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

చెప్పుతోకొట్టుకున్నవైకాపాఎమ్మెల్యే

కడప జిల్లా ప్రొద్దుటూరు పురపాలక ఛైర్మన్‌ ఎన్నిక రెండోసారి వాయిదా పడటంపై వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తీవ్ర నిరసన తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ ఆర్డీవో, పోలీసుల ఎదుటే ఎమ్మెల్యే తనను తాను చెప్పుతో కొట్టుకున్నారు. ఎమ్మెల్యే పలుమార్లు చేతులు, తలపై చెప్పుతో కొట్టుకోవడంతో అక్కడున్నవారంతా షాక్‌కు గురయ్యారు. ఎమ్మెల్యే అనుచరులు ఆయన్ని అడ్డుకుని వారించారు.

కడప జిల్లా ప్రొద్దుటూరు పురపాలక ఛైర్మన్‌ స్థానానికి ఆదివారం ఎన్నిక నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి అధ్యక్షతన ఆ పార్టీ కౌన్సిలర్లు హాజరయ్యారు. అనంతరం తెదేపాకు చెందిన కౌన్సిలర్లు ఎన్నిక సభా భవనానికి చేరుకుని వారికి కేటాయించిన గ్యాలరీలో కూర్చున్నారు. ఎన్నికల ప్రిసీడింగ్‌ అధికారి, ఆర్డీవో వినాయకం, జాయింట్‌ కలెక్టర్‌ శ్వేత ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు. ఈ క్రమంలోనే అధికారులు మొదట కౌన్సిలర్ల పేర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. వైకాపాకు చెందిన కౌన్సిలర్లు మాత్రమే పేర్లు నమోదు చేయించుకోగా.. తెదేపా కౌన్సిలర్లు నిరాకరించారు. పురపాలక ఛైర్మన్‌ అధ్యక్ష ఎన్నికకు సంబంధించి తెదేపా వర్గంలోని ఏడుగురు వైకాపాకు మద్దతిస్తుండటంతో ఛైర్మన్‌ పదవి దక్కదని తెదేపా సభ్యులు భావించారు. దీంతో ఎన్నిక వాయిదా వేయాలని కోరుతూ మున్సిపాలిటీ ఇన్‌ఛార్జి ఛైర్మన్‌ జాబీవుల్లా, కౌన్సిలర్‌ గణేశ్‌ బాబుతో పాటు మరో 12మంది కౌన్సిలర్లు గ్యాలరీలోని బెంచీలు, కుర్చీలు ధ్వంసం చేశారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1.30వరకు ఎన్నికల సభా భవనంలో ఆందోళన కొనసాగింది. తీవ్ర ఆందోళన మథ్య ఆర్డీవో వినాయకం ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సమస్యను ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకువెళ్తున్నట్లు తెలిపారు.

అనంతరం ఎమ్మెల్యే రాచమల్లు కౌన్సిలర్లను వెంటబెట్టుకుని ఆర్డీవోను అడ్డుకుని దుర్బాషలాడారు. ఎన్నిక జరిగేంత వరకు ఇక్కడ నుంచి వెళ్లేదిలేదని కౌన్సిలర్లు నేలపై పడుకుని ఆర్డీవోను అడ్డుకున్నారు. పోలీసులను ఆశ్రయించిన ఆర్డీవో సభా భవనం నుంచి బయటికి వచ్చి కారులో వెళ్లిపోయారు. ఆ తర్వాత ఎమ్మెల్యే పురపాలక కార్యాలయ ప్రవేశ ద్వారం వద్ద ఎన్నిక వాయిదాను నిరసిస్తూ తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి తన కాలి చెప్పును తీసుకుని చేతిపై కొట్టుకున్నారు. కొద్దిసేపటి తర్వాత ఇరు వర్గాలకు చెందిన కౌన్సిలర్లు అక్కడి నుంచి వెళ్లి పోవడంతో గొడవ సద్దుమణిగింది.

(228)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ