లేటెస్ట్

టిడిపి కార్యకర్తలపై దృష్టిపెట్టిన బిజెపి...!

రాష్ట్రంలో బలపడేందుకు పలువురు టిడిపి సీనియర్‌ నాయకులపై దృష్టి పెట్టి పార్టీలో చేర్చుకుంటున్న బిజెపి ఇప్పుడు ఆ పార్టీ కార్యకర్తలను పార్టీలో చేర్చుకోవడమే లక్ష్యంగా పనిచేయబోతోంది. టిడిపికి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను పార్టీలో చేర్చుకున్న తరువాత...ఇప్పుడు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నాయకులను పార్టీలో చేర్చుకోవడమే లక్ష్యంగా పనిచేస్తోన్న బిజెపి పెద్దలు వారి కంటే ముందే టిడిపికి చెందిన కార్యకర్తలను పార్టీలో చేర్చుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. శనివారం, ఆదివారం నాడు విజయవాడ సమీపంలో జరిగిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో దీనిపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి మురళీధర్‌, సీనియర్‌ నాయకుడు రామ్‌మాధవ్‌ల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో టిడిపకి చెందిన క్రియాశీల కార్యకర్తలపై కన్నేయాలని, ఈ నెల6వ తేదీ నుండి జరుగుతోన్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వీరిపైనే ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారట. నాయకుల కంటే కార్యకర్తలు, సానుభూతి పరులు ముఖ్యమని, వారిని పార్టీలోకి తీసుకుని ప్రాధాన్యత ఇస్తే...స్థానికంగా బలపడతామని సీనియర్‌ నాయకులు పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. సభ్యత్వ నమోదులో రికార్డు సృష్టించాలని, టిడిపి కంటే ఎక్కువ సభ్యత్వం ఉండాలని నాయకుల లక్ష్యాన్ని నిర్దేశించారని తెలుస్తోంది. మొత్తం మీద..టిడిపి సీనియర్‌ నాయకులు, ఎమ్మెల్యేల కన్నా..దిగువస్థాయి నాయకులు, కార్యకర్తలను పార్టీలోకి తీసుకుని టిడిపిని క్షేత్రస్థాయిలో దెబ్బకొట్టడానికి బిజెపి పెద్దలు పావులు కదుపుతున్నారు. మరి వారి లక్ష్యం ఎంత వరకు నెరవేరుతుందో చూడాలి.

(213)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ