పిఎస్‌ల గోల..ఇంతింత కాదయా..!? అప్పట్లో శ్రీనివాస్, ఇప్పుడు కపర్తి...!
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిఎస్ కపర్తిపై తెలుగుదేశం పార్టీ అధికారప్రతినిధి జి.వి.రెడ్డి విరుచుకుపడ్డారు. ఓ టివి ఛానెల్ డిబేట్‌లో ఆయన మాట్లాడుతూ కపర్తి పద్దతి బాగా లేదని, ఆయన వ్యవహారశైలితో పార్టీ నాయకులకు అవమానం జరుగుతుందని ఆయన ఆరోపించారు. పార్టీ నాయకులు ఫోన్ చేస్తే..ఆయన తీయడం లేదని, ఫోన్‌లు కట్ చేస్తున్నారని, ఆయనో ఉద్యోగి అనే సంగతి మరిచిపోయి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఫోన్ చేస్తే..ఎందుకు చేశామో..కూడా కనుక్కోకుండా..ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని, ఈయన వల్ల పార్టీకి, ప్రభుత్వానికి, చంద్రబాబుకు చెడ్డపేరు వస్తుందని జివి రెడ్డి అన్నారు. చంద్రబాబును తాము కలవడానికి వెళ్తే కలవనీయడం లేదని, అసలు తాము వచ్చిన సంగతి కూడా చంద్రబాబుకు ఆయన చెప్పడం లేదని, అంతా తనవల్లే ప్రభుత్వం నడుస్తుందన్నట్లుగా ఆయన తీరు ఉందని, ప్రతిపక్షంలో ఉండగా జగన్‌కు వ్యతిరేకంగా ఎన్నోపోరాటాలు చేసిన తమకు కనీసం గౌరవం ఇవ్వడం లేదని విమర్శించారు. కాగా..కపర్తి వ్యవహారంపై ఇప్పటికే పార్టీలో, ప్రభుత్వంలో చాలా మంది అసంతృప్తి, అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత టిడిపి ప్రభుత్వంలో అప్పటి మంత్రి పత్తిపాటి పుల్లారావు వద్ద కపర్తి పిఎస్‌గా పనిచేశారు. ఇటీవల కాలంలో చంద్రబాబు వద్ద చేరిన ఆయన ఎవరినీ లెక్కచేయడం లేదని, చంద్రబాబును కలవడానికి వచ్చిన వారితో చులకనగా మాట్లాడుతున్నారని, ఎవరినీ పట్టించుకోనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల కాలంలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి నియోజకవర్గం పులివెందులకు చెందిన వైకాపా నాయకుల బిల్లులు విడుదల కావడం వెనుక కూడా ఈయన ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వ్యక్తిగత ప్రవర్తన సరిగా లేకపోతే..ఎదుటి వ్యక్తికి గౌరవం ఇవ్వకపోతే.. కపర్తికి ఏమీ కాదు. మహా అయితే..చంద్రబాబు వద్ద నుంచి తొలగిస్తారు. కానీ చంద్రబాబు జరిగే నష్టం అంతా ఇంతా కాదు. గత ప్రభుత్వంలో జగన్ వద్ద పిఎస్‌గా పనిచేసే వ్యక్తి అప్పటి ఆ పార్టీ ఎంపి రఘురామకృష్ణంరాజుకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని, ఆయన సరిగా జగన్‌కు తన మాట చెప్పలేదనే కారణంతోనే...రఘురామకృష్ణంరాజు జగన్‌కు ఎదురుతిరిగారు. ఐదేళ్లపాటు..జగన్‌ను సాధించి...సాధించి..చివరకు జగన్ ఘోర పరాభవానికి ఒక కారణంగా నిలిచారు. ఇదే విధమైన సంఘటన గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. అప్పట్లో చంద్రబాబు పిఎస్‌గా ఉన్న శ్రీనివాస్ కూడా కొంత మంది ప్రముఖుల విషయంలో అమర్యాదగా ప్రవర్తించడంతో..వారు చంద్రబాబుకు వ్యతిరేకులుగా మారారు. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావుతో చంద్రబాబు పిఎస్ శ్రీనివాస్ అమర్యాదగా ప్రవర్తించారని, దాంతో చిన్నబుచ్చుకున్న ఆయన చంద్రబాబుకు బద్ద వ్యతిరేకిగా మారారని చెబుతారు. అయితే శ్రీనివాస్ కొంచెం పద్దతి కలిగిన వ్యక్తేనని, అయినా..కొందరి విషయంలో మాత్రం తప్పులు జరిగాయి. మొత్తం మీద చంద్రబాబు పిఎస్‌ల ప్రవర్తన చంద్రబాబుకు, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేవిధంగా ఉందనే మాట పార్టీలోనూ, ప్రభుత్వ వర్గాల్లోనూ ఉంది.