లేటెస్ట్

'రఘువీరారెడ్డి' టిడిపిలోకి వస్తారట...!

రాష్ట్రంలోని నాయకులందరూ 'బిజెపి' వైపు చూస్తుంటే....రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు 'రఘువీరారెడ్డి' టిడిపిలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారట. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరఓటమి పాలయిన తరువాత...ఆ పార్టీకి చెందిన నాయకులంతా బిజెపిలో చేరడానికి ఉత్సాహపడుతున్నారు. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలో చేరగా, మరి కొందరు మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు బిజెపిలో చేరుతున్నారు. అదే విధంగా వైకాపాలో ప్రాధాన్యత దక్కని వారు కూడా బిజెపి వైపే చూస్తున్నారు. ప్రస్తుతం బిజెపిలో చేరే వారంతా భవిష్యత్‌లో తాము ఆ పార్టీ నుంచి గెలుస్తామని, తమను ఆ పార్టీ అధినేతలు గెలిపిస్తారనే నమ్మకంతో ముందూ వెనుకా చూసుకోకుండా బిజెపిలో చేరిపోతున్నారు. అయితే వీరందరికి విరుద్ధంగా కాంగ్రెస్‌ పార్టీలో సుధీర్ఘంగా ఉంటోన్న మాజీ మంత్రి, ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి టిడిపిలో చేరాలనే ఆలోచనతో ఉన్నారని తెలుస్తోంది. అనంతపురం జిల్లాకు చెందిన 'రఘువీరారెడ్డి' రాజకీయ జీవితం బిజెపితోనే ప్రారంభం అయింది. అయితే తరువాత..కాలంలో ఆయన కాంగ్రెస్‌లో చేరి రాష్ట్ర నాయకుడిగా ఎదిగారు. వై.ఎస్‌, రోశయ్య, కిరణ్‌ కుమార్‌రెడ్డి మంత్రివర్గాల్లో కీలకశాఖలకు మంత్రిగా పనిచేశారు. 

వై.ఎస్‌ మరణించిన తరువాత..'రఘువీరారెడ్డి' వైకాపాలో చేరతారని చాలా మంది భావించారు. వై.ఎస్‌కు నమ్మకస్తుడిగా ఉన్న 'రఘువీరారెడ్డి' 'జగన్‌' పార్టీలో చేరతారని అంచనా వేసినా..అది ఫలించలేదు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరుపునే పోటీ చేసి ఓడిపోయిన ఆయన ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ పోటీ చేసి ఓడిపోయారు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్‌ నామమాత్రపు పోటీ కూడా ఇవ్వలేకపోవడంతో..ఆయన తన రాజకీయ భవిష్యత్‌ కోసం పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో ఆయన వైకాపాలోకి వెళతారని అనుకున్నా.. అక్కడ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రాలేదని కొందరు చెబుతుండగా..ఆయనకు 'జగన్‌'తో పనిచేసే ఉద్దేశ్యం లేదని, అందుకే వై.ఎస్‌ మరణించిన తరువాత ఆయన కనీసం అటువైపు కూడా చూడలేదని చెబుతారు. దీంతో రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండాలంటే టిడిపినే బెస్ట్‌ అనే భావనతో ఆయన ఉన్నారంటున్నారు. టిడిపిలో బీసీలకు పెద్దపీట వేస్తారని, గౌరవంగా చూస్తారని, తన వంటి నాయకులకు కీలక బాధ్యతలు అప్పచెబుతారని...ఇప్పుడే టిడిపిలో చేరితే రాబోయే కాలంలో తన రాజకీయ భవిష్యత్‌ ఉజ్వలంగా ఉంటుందనే ఆలోచనతో..ఆయన టిడిపి వైపు అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. టిడిపికి భవిష్యత్‌ లేదని ఆ పార్టీ నుంచి బయటకు వెళుతోన్న నేతలు..'రఘువీరారెడ్డి'ని చూసి నేర్చుకోవాలని, వెళదామను కుంటున్న వారు కూడా....అర్థం చేసుకోవాలని సామాన్య కార్యకర్తలు, నాయకులు సూచిస్తున్నారు. 

(397)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ