WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'నేను సిఎం మనిషిని...నన్నేం చేయలేరు...!

నేను ముఖ్యమంత్రి మనిషిని...! నేనెవరినీ ఖాతరు చేయను...! నాపై అధికారి కూడా మౌనంగా ఉంటారే తప్ప నాకు ఎదురు చెప్పరు...! మీరెవరివి మనుషులైతే నాకేమిటి...? నా దగ్గర అందరూ అణిగిమణిగి పనిచేయాలి....! ఇంతకు ముందు అనగా సాంబశివరావు ఇఒగా బాధ్యతలు నిర్వహించినప్పుడు కొందరు నన్ను లెక్కచేయలేదు..! నన్ను బదిలీ చేద్దామని ఆయన ప్రయత్నించారు...చివరకు ఆయనే బదిలీ అయి వెళ్లారు...! తస్మాత్‌ జాగ్రత్త...! నేను ఏది తలచుకుంటే అది జరిగితీరుతుంది...! అని ఆ అధికారి పలువురు సమక్షంలో రంకెలు వేశారంటే రాజకీయ, అధికార యంత్రాంగమంతా ఆయనకు దాసోహమైందా...లేక ఆయన గుప్పెట్లో పాలకులు...అధికారులు ఉన్నారా...? ఎటుపోతోంది ప్రభుత్వం క్రిందిస్థాయి ఉద్యోగులు,అధికారులు చెబుతున్నారంటే ఆ అధికారి అహంకారం, నియతృంతపోకడ, ఏకపక్షనిర్ణయాల పోకడ ఎంతవరకు ఉందో స్పష్టం అవుతుంది. ఇదెక్కడో కాదు..! సాక్షాత్తూ దేవదేవుడు వెలసిన తిరుమల పుణ్యక్షేత్రంలో జరుగుతోంది. గతంలో టిటిడి ఇఒగా సాంబశివరావు నిజాయితీగా,సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించారు. 

  అధికారులను, ఉద్యోగులను ప్రోత్సహించేవారు..వారిపై ఆధారపడి నిర్ణయాలు తీసుకునేవారు...ఆ నిర్ణయాలన్నీ సక్రమంగా అమలు జరగడంతో 'సాంబశివరావు' కు పేరు ప్రతిష్టలు లభించగా, మరొక అధికారిని ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పటికీ ముఖ్యమంత్రి నేనేం చెబితే అదే వింటారు...! సిఎం కార్యాలయ అధికారులు..నా గుప్పెట్లో ఉన్నారు...! మంత్రులెవరూ నన్ను ప్రశ్నించలేరు...! దేవాదాయశాఖమంత్రంటే నాకు లెక్కలేదు...అని చెబుతున్నారట జెఇఒ శ్రీనివాసరాజు. ఇంతకు ముందు తనను కొంత మంది ఉద్యోగులు, అధికారులు లెక్కచేయలేదని, ఇఒ అండదండలతో తనను అవమానించారని, వారిపై కక్షసాధింపు చర్యల కోసం ఆయన పథకాలను రూపొందిస్తున్నారట. నిన్నటి వరకు అణిగిమణిగి ఉన్న శ్రీనివాసరాజు, ఇఒ సాంబశివరావును బదిలీ చేయటంతో నూతన ఇఒ అనిల్‌కుమార్‌ సింఘాలను పట్టించుకోవడం లేదట. ఎండాకాలం సెలవులు ప్రారంభం కావడంతో బ్రేక్‌ దర్శనాలను రద్దు చేశామని, ముఖ్యంగా శుక్ర,శని, ఆదివారాల్లో అటువంటి దర్శనాలు ఉండవని కేవలం ప్రొటోకాల్‌ అర్హత ఉన్నవారికే ఆ బ్రేక్‌ దర్శనం కల్పిస్తామని జెఇఒ ఇంతకు ముందు చెప్పారు. కానీ ఆచరణలో ఏమి జరిగిందంటే...ప్రొటోకాల్‌ ముసుగులో ఉదయం బ్రేక్‌ దర్శనానికి 200 నుండి 500 వరకు టిక్కెట్లు ఇవ్వడం జరిగిందట. అందులో ప్రొటోకాల్‌ అర్హత ఉన్నవారి కన్నా అర్హలేని వారే ఎక్కువగా ఉన్నారట. హైకోర్టు,సుప్రీంకోర్టు న్యాయమూర్తులు,ఐఎఎస్‌ అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా తిరుమలకు వచ్చినప్పుడే వారికి ప్రొటోకాల్‌ ఉంటుంది. మరెవరికైనా వీరు సిఫార్సు చేసినా కూడా బ్రేక్‌ దర్శనానికి టిక్కెట్లు ఇచ్చే అవకాశం లేదు. జెఇఒ క్యాంపు కార్యాలయానికి తాళాలు వేసి ఉన్నాయి..అయినప్పటికీ ఇటీవల కాలంలో ఐదువందల మందికి బ్రేక్‌దర్శనం ఇవ్వటంతో టిటిడి ఉద్యోగులు, అధికారులు ఆశ్చర్యపోతున్నారు. 

  శ్రీనివాసరాజా...మజాకా...! ఆయన తలచుకుంటే ప్రొటోకాల్‌ ముసుగులో ఎన్ని టిక్కెట్లనైనా కేటాయించే ధైర్యం ఉంది. పాలకుల ఆశీస్సులు ఆయనకు ఉన్నాయి. ప్రతిపక్షం పట్టించుకోదు...! తిరుమలలో ఇంత ఘోరం జరుగుతున్నా విపక్షాల నాయకులతో పాటు, బిజెపి నాయకులు కూడా నోరు మెదపడం లేదు. తిరుపతి బిజెపి నాయకుల సిఫార్సులకు శ్రీనివాసరాజు ఆమోదించడమే వారు నోరుమెదకపోవడానికి కారణమని ఉద్యోగులు చెబుతున్నారు. కాంగ్రెస్‌ హయాంలో బ్రేక్‌ దర్శనాలు వందలకే పరిమితం కాగా...ఈ మూడు సంవత్సరాల్లో 2500కు పెరిగాయి. సుమారు మూడు నాలుగు గంటల సమయం ఈ దర్శనాలకే సమయం పడుతుదంటే ఎన్ని టిక్కెట్లు ఇచ్చారో స్పష్టం అవుతుంది. మీడియా వర్గాలు పట్టించుకోవు...! ప్రతిపక్షాలు నోరు మెదపవు...! మిత్రపక్షాలు చెప్పేదొకటి...చేసేదొకటి...!దీంతో తిరుమల కొండపై అపవిత్రం జరుగుతున్నా...గర్భగుడిలో అన్యులు ప్రవేశించినా అడిగి ప్రశ్నించేవారులేరు... పట్టించుకునేవారు కరవయ్యారు. ఒక వైపు పూజారులకు అంబానీ కంపెనీ అండదండలు ఉంటాయి...మరోవైపు జెఇఒ శ్రీనివాసరాజుకు అధికార విపక్షాల,మిత్రపక్షాల నాయకుల ఆశీస్సులు ఉన్నాయని పలువురు ఉద్యోగులు వ్యంగ్యంగా చెబుతున్నారు.

(480)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ