WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'మణి'పై బదిలీ వేటు...!

వీవీఐపిల పట్ల, సామాన్య ప్రజల పట్ల అహంకారంతో, దురుసుగా ప్రవర్తిస్తోన్న తిరుమల జెఇఒ సిసి 'మణి'పై బదిలీ వేటు పడింది. 'మణి' వ్యవహారశైలిపై 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌'లో ఇదివరకే కథనం వచ్చిన సంగతి తెలిసిందే. తిరుమలలో జెఇఒ సిసిగా పనిచేస్తోన్న 'మణి' అవినీతికి, అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఎల్‌-1 కోటాలో కేటాయించాల్సిన దర్శన టిక్కెట్లు, ఇతర వ్యవహారాల్లో అతని అవినీతి పెరిగిపోయిందని, అదే సమయంలో భక్తుల పట్ల అహంకారపూరితంగా , దురుసుగా ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వచ్చాయి. వచ్చిన భక్తులు ఎంత వీవీఐపిలైనా ఆయన వారితో దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఈ విషయంపైనే కొంత మంది రాష్ట్ర నాయకులు తిరుమల ఇఒకు, కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఉత్తరాదికి చెంది, కేంద్రంలో 'మోడీ' తరువాత క్యాబినెట్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రి దృష్టికి 'మణి' వ్యవహారాన్ని తీసుకెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. 'మణి' వ్యవహారం తెలుసుకున్న సదరు నేత వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని ఇఒకు ఆదేశాలు జారీ చేశారు.  దీంతో నిన్నటి వరకు తనను ఎవరూ ఏమీ చేయలేరని విర్రవీగిన 'మణి'ని అక్కడ నుంచి బదిలీ చేస్తున్నట్లు రాత్రికి రాత్రే ఉత్తర్వులు జారీ అయ్యాయి. అంతే కాకుండా ఇంత వరకు 'మణి' చేసిన అవినీతి, అక్రమాలపై విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. విచారణ తరువాత 'మణి' అవినీతి, ఇతర అక్రమాలపై ఒక స్పష్టత వస్తుందని సదరు వర్గాలు చెబుతున్నాయి. కాగా ఇదంతా 'మణి' స్వయంకృతమని సదరు నాయకులు చెబుతున్నారు. తన వద్దకు వచ్చిన వారితో సౌమ్యంగా మాట్లాడకుండా దురుసుగా,అహంకారంతో మాట్లాడడమే అతని కొంప ముంచిందని వారు అంటున్నారు. తనది సిఎం చంద్రబాబు స్వంత నియోజకవర్గమైన కుప్పమని, తాను ఏంచేసినా ఎవరూ ఏమి చేయలేరనే ధీమాతో ఆయన ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారు. అంతే కాకుండా సిఎం చంద్రబాబు పేషీ అధికారుల ఆశీస్సులు తనకు ఉన్నాయని, తనను రాష్ట్రంలో ఏ నాయకుడూ ఏమీ చేయలేరన్న అంహకారమే నేటి ఆయన పరిస్థితికి కారణమని సదరు వర్గాలు తెలిపాయి. మొత్తం మీద అధికారం ఉంది కదా...అని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ఫలితాలు ఇలానే ఉంటాయనడంలో సందేహం లేదు.


(519)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ