WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

విద్యార్థుల పొట్టలు కొట్టి కోట్లకు పడగలెత్తిన సంక్షేమ హస్టల్‌వార్డెన్‌లు

స్పందనలేని ప్రభుత్వం

రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలి

భావి భారత పౌరులుగా పేద వర్గాలకు చెందిన విద్యార్థులను  తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ హస్టళ్ళను ఏర్పాటు చేసి,అందులో బాల,బాలికలకు వసతితో పాటు ఆహార సదుపాయాలను కల్పించి,వారికి తరగతి పాఠ్యాంశాల్లో సందేహాలు వ్యక్తమైతే అందుకు ట్యూటర్లను ఏర్పాటు చేసి చదువులో ర్యాంక్‌లు సాధించేందుకు వందలకోట్ల రూపాయలను బడ్జెట్‌లో కేటాయిస్తుండటం జరుగుతోంది.ఆర్థిక కారణాలతో  చదువుకోలేని స్థితిలో ఉండి, తల్లిదండ్రులను వదిలి ప్రభుత్వంచే నడపబడుతున్న సంక్షేమ హస్టళ్ళలలో ఉంటూ చదువుకుంటున్న బాల,బాలికలకు నిబంధనల మేరకు ఆహార సరఫరా చేయాల్సిన బాధ్యత ఆయా హస్టళ్ళ వార్డెన్‌లపై ఉందనేది సత్యం.హస్టళ్ళలలో ఉండే విద్యార్థినీ,విద్యార్థులకు కనీస సౌకర్యాలైన బాత్‌రూమ్‌,ఫ్యాన్‌లు,చాపలు,దుప్పట్లు,పరిశుభ్రమైన వాతావరణంలో వంటశాల,వీరికి కాపలాగా ఉండేందుకు వాచ్‌మెన్‌,తదితర సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తోంది.అయితే ఇందుకు విరుద్థంగా ఆయా హస్టళ్ళ వార్డెన్‌లు వ్యవహరిస్తుండటం పలు విమర్శలకు తావిస్తోంది.బాల,బాలికలకు నిత్యం ప్రభుత్వం నిర్థేశించిన ఆహార వస్తువుల సరఫరా చేయకపోవటం,బియ్యంలో పురుగులు,రాళ్ళు ఏరకుండా అలాగే వండి వడ్డించటం,రుచిలేని కూరలు,పెరుగుకు బదులు మజ్జిగ పోయటం,ఫ్యాన్ల సౌకర్యం కల్పించకపోవటం,సరైన బాత్‌రూమ్‌లు లేకపోవటం,ఉన్నా వాటికి తలుపులు సరిగ్గా ఉండకపోవటం జరుగుతోందని విద్యార్థిసంఘాల నాయకులు ఆరోపిస్తున్పప్పటికి పట్టించుకున్న నాథుడే కరువయ్యారు.వార్డెన్‌లుగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన నాటికి వారి ఆదాయమెంత,ఇప్పటికి వారి ఆస్తులు ఎంత అనేది నిఘా విభాగాలు నిగ్గుతేల్చాల్సి ఉంది.

  తల్లిదండ్రులను వదిలి హస్టళ్ళల్లో ఉంటున్న బాల,బాలికలకు సరైన రీతిలో పోషక ఆహారాలు అందించాల్సి ఉన్నప్పటికి వార్డెన్‌ల ఇష్టానుసారం వ్యవహరించటం పరిపాటిగా మారింది.విద్యార్థుల సంఖ్య ఉన్నదాని కన్న ఎక్కువుగా చూపటం,ఉన్న విద్యార్థులకు సక్రమంగా ఆహార,ఆరోగ్య సూత్రాలను వార్డెన్‌లు పాటించకపోవటం విశేషం.ఇది ఒక ఎత్తైతే వార్డెన్‌లు తమకు సంబందించిన వ్యక్తులను ఆయా హాస్టళ్ళల్లో భోజన సదుపాయాలు కల్పించటం మరొక ఎత్తు.కాగా ప్రతివారం వైద్యనిపుణులచే హస్టల్‌ విద్యార్థులను పరీక్షించి మందులు అందించాల్సి ఉన్నప్పటికి వాటిని అమలుచేయకపోవటం ఆయా వార్డెన్‌ల ప్రత్యేకత.దోమలను నివారించటం,హస్టల్‌ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచటంలో హస్టల్‌ వార్డెన్‌లు శ్రద్ధ ఏమాత్రం తీసుకోకపోవటం గమనార్హం. ఈవిధంగా హస్టల్‌ విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ వారి పొట్ట కొట్టి అనారోగ్యాల పాలు చేస్తూ హస్టల్‌ వార్డెన్‌లు మాత్రం వీరికి ఇచ్చిన రేషన్‌ను దొడ్డిదారిన తరలించుకుని కోట్లకు పడగలెత్తారంటే ఏమాత్రం ఆశ్చర్యం,అతిశయోక్తి లేదు.ఎందరో పేద స్థితి నుంచి  వార్డెన్‌లుగా మారి ఇళ్ళ ప్లాట్లు,డూప్లెక్స్‌ ఇళ్ళు,పొలాలు,ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తూ ఉండటం వాస్తవం కాదా అంటూ విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు.కనీసం బాలబాలికల పట్ల సానుభూతి,ప్రేమను ఆయా హస్టల్‌ వార్డెన్‌లు వ్యక్తం చేయలేకపోవటం జరుగుతోంది.మాకు సరైన ఆహారం అందించమని ఎవరైన హస్టల్‌ విద్యార్థులు అడిగితే వారిని దండించటం పరిపాటిగా మారిందంటున్నారు.ఒకవిధంగా విద్యార్థులు భవిష్యత్తులో ఉద్యోగులైతే వారికి అవినీతి ఏవిధంగా చేయాలో హస్టల్‌ వార్డెన్‌ల వ్యవహరశైలి ద్వారా అక్షరాలు నేర్చుకుంటున్నట్లు కూడా ప్రజలు చెప్పుకుంటున్నారు.హస్టల్‌ వార్డెన్‌ల బాగోతంలో సంక్షేమ శాఖకు చెందిన వివిద స్థాయిల్లో గల ఉద్యోగుల సహకారం ఉండటం జరుగుతుందనే విమర్శలు మూటగట్టుకుంటున్నారు.ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి   జిల్లాస్థాయి అధికారులు,స్థానిక ప్రజాప్రతినిథులతో  క్షేత్రస్థాయి పరిశీలన జరిపిస్తారని,పిల్లల నోరుకొట్టి హస్టల్‌ వార్డెన్‌లు సంపాదించిన అక్రమ  సంపాదనపై నిఘా వర్గాలు దాడులు చేసి వార్డెన్‌ల అక్రమాలను నియంత్రించాలని మానవతావాదులు కోరుకుంటున్నారు.

(జనం ప్రతినిథి: వైవిఎన్‌ ప్రసాద్‌)


(176)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ