WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఆ ఇద్దరిలో టిటిడి ఛైర్మన్‌ పదవి దక్కేదెవరికో...!?

టిటిడి ఛైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే మస్తాన్‌రావును కానీ రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి 'లక్ష్మీనారాయణ'కు కానీ దక్కే అవకాశాలు ఉన్నాయి. బిసి వర్గానికి చెందిన 'మస్తాన్‌రావు'కు ఆ పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారని ప్రచారం జరుగుతోంది. పార్టీకి వీరవిధేయుడిగా ఆయనకు పేరుంది. పార్టీ కోసం కొన్ని కోట్ల రూపాయలను ఆయన ఖర్చు పెట్టారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2014 ఎన్నికల్లో దురదృష్టం వెన్నాడి ఎన్నికల్లో ఓడిపోయిన 'మస్తాన్‌రావు'కు సిఆర్‌డిఎ సభ్యుని పదవి ఇచ్చినప్పటికీ దానిపై అంత సంతృప్తి వ్యక్తం కాలేదు. టిటిడి ఛైర్మన్‌ పదవికి ఎవరికి ఇచ్చినా ఆ పదవీ కాలం రెండేళ్లు తప్పనిసరిగా ఉంటుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో 'బాపిరాజు'కు సంవత్సరం పాటు ఆ పదవిలో నియమించినా ఆ తరువాత మళ్లీపొడిగించడం జరిగింది. అదే బాటలో 'చంద్రబాబు' కూడా నడిచారు. 'చదవాల కృష్ణమూర్తి' మొదటి ఒక సంవత్సరం తరువాత మళ్లీమరో సంవత్సరం పొడగింపు ఇచ్చారు. టిటిడి చట్టం ప్రకారం బోర్డుసభ్యుని పదవైనా, సభ్యుని పదవైనా రెండేళ్ల కాలపరిమితి ఉంటుంది. కానీ ఒక సంవత్సరం పాటు పదవి ఒకరికి ఇచ్చి ఆ తరువాత మరొకరికి ఆ పదవి ఇస్తారా...? లేక రెండేళ్ల కాలపరిమితితో ఉత్తర్వులు జారీ చేస్తారా...? తాజాగా సోషల్‌మీడియాలో మదనపల్లికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆద్యాత్మికవేత్త సిఎం రవిశంకర్‌కు టిటిడి ఛైర్మన్‌ పదవి ఖాయమైందని ప్రచారం జరుగుతోంది. ఇది ఉత్తుత్తి ప్రచారమేనని రాజకీయ, అధికారవర్గాలు కొట్టిపడేస్తున్నాయి. 

అధికారపార్టీకి చెందిన ప్రముఖులతోపాటు కొంత మంది అధికారులు కూడా టిటిడి ఛైర్మన్‌ పదవిని రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి 'లక్ష్మీనారాయణ'కు ఇవ్వాలని కలసి కోరారు. ఆ కోరికను సిఎం అటు తిరస్కరించలేదు..ఇటు అంగీకరించకుండా రాజకీయ పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆయన నర్మగర్భంగా చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో టిటిడి ఛైర్మన్‌గా 'కమ్మ' సామాజికవర్గానికి చెందిన వారెవరినీ ఇంత వరకు నియమించలేదు. కనీసం ఇప్పుడైనా ఆ పదవిని కేటాయించండి అని 'రాయపాటి సాంబశివరావు' పలుసార్లు సిఎంను కలసి విన్నవించారు. 'రాయపాటి' సూచనను ముఖ్యమంత్రి అంగీకరించే పరిస్థితి కనిపించినా ఆఖరు నిమిషంలో రాజమండ్రి ఎంపి మురళీమోహన్‌ తన పేరును కూడా పరిశీలించాలని కోరారు. దీంతో ఆగ్రహం చెందిన 'చంద్రబాబు' ఎంపిలెవరికీ ఈ పదవి ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. అయితే 'కమ్మ' సామాజికవర్గానికి ఇవ్వనని ఆయన చెప్పలేదు. 'లక్ష్మీనారాయణ' పేరుకే ఐఎఎస్‌ అధికారి అని, ఆయన 'చంద్రబాబు'కు అత్యంత వీరవిధేయుడని టిటిడి ఛైర్మన్‌ పదవి ఆయనకు ఇస్తే అధికారపార్టీలో ఏ ఒక్కరూ వ్యతిరేకించరని అంతే కాకుండా రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారికి ఆ పదవి ఇస్తే సర్వీసులో ఉన్న ఐఎఎస్‌ అధికారులతో పాటు రిటైర్డ్‌ అయిన ఐఎఎస్‌ అధికారులు సంతృప్తి పడతారని 'జనం ప్రత్యేక ప్రతినిధి'తో పలువురు సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులు వ్యాఖ్యానించారు. రెండేళ్లల్లో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 'యాదవ' సామాజికవర్గానికి చెందిన 'మస్తాన్‌రావు'కు ఆ పదవి ఇస్తే రాజకీయంగా కొంత వరకు ఉపయోగపడుతుందని 'చంద్రబాబు' భావిస్తున్నారు. సర్వీసులో ఉన్నప్పుడు ఆ తరువాత కూడా 'చంద్రబాబు'పై ఏనాడూ ఇంటా బయటా 'లక్ష్మీనారాయణ' ఎటువంటి విమర్శలు, ఆరోపణలు చేయలేదు. ఒక దశలో ఆయనను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రతినిధిగా ఢిల్లీలో నియమిస్తారని ప్రచారం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అందుకు అంగీకరించారని ఆఖరు నిమిషంలో ఏమి జరిగిందో కానీ ఉత్తర్వులు వెలువడలేదు. సర్వీసు నుండి రిటైర్డ్‌ అయ్యాక 'చంద్రబాబు'కు 'లక్ష్మీనారాయణ' చేదోడు..వాదోడుగా ఉంటూ ఎన్నికల సమయంలో పూర్తిగా పనిచేశారు. వీరిద్దరిలో టిటిడి ఛైర్మన్‌ పదవి దక్కడం ఖాయమని అందులో ఎవరికి దక్కుతుందో తాము చెప్పలేమని పార్టీ నాయకులు చెబుతున్నారు. రాజకీయ వర్గానికి ప్రాదాన్యత ఇస్తానని ముందే చెప్పిన చంద్రబాబు తాజాగా అదే నిర్ణయంపై కట్టుబడి ఉంటారా..? లేక మరో విధంగా నిర్ణయం తీసుకుంటారా...? వేచి చూడాల్సిందే...!

(276)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ