WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'సదావర్తి'లో 'ఆళ్ళ' ఇరుక్కున్నారా...?

దేవాదాయశాఖ భూములు అయిన 'సదావర్తి' భూముల కేసులో మంగళగిరి ఎమ్మెల్యే 'ఆళ్ల రామకృష్ణారెడ్డి' ఇరుక్కుపోయారా...? అంటే అవుననే అంటున్నారు..రాజకీయ పరిశీలకులు. 'సదావర్తి' భూములను అన్యాయంగా టిడిపికి చెందిన నాయకులు కొట్టేస్తున్నారని ఆయన హైకోర్టులో కేసు వేశారు. రూ.1500 కోట్ల విలువ గల భూములను కేవలం రూ.21కోట్లకే తమకు అయిన వారికి ప్రభుత్వం కట్టబెడుతుందనేది ఆయన ఆరోపణ. 'నాని' ఆరోపణలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం అంత కన్నా ఎక్కువ రేటుకు ఎవరైనా కొనుగోలు చేస్తే తీసుకురావాలని సూచించింది. లేదా మీరైనా ఎంతకన్నా ఎక్కువ చెల్లించి కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది. దీంతో అంత సొమ్ము తన వద్ద లేదని ముందు చెప్పిన 'ఆళ్ళ' తరువాత తానే మరో ఐదు కోట్లు అదనంగా ఇస్తూ మొత్తం రూ.27కోట్లు దేవాదాయశాఖకు చెల్లించారు. దీంతో ఇక ఈ భూములు 'ఆళ్ళ' పరమైనట్లేనని భావించారు.అయితే ఇక్కడ అనుకోని దెబ్బ వేరే రూపంలో వచ్చి తగిలింది. 

   రూ.1500కోట్లు గల భూములు అని ముందే పేర్కొన్న 'ఆళ్ల' కేవలం రూ.27కోట్లు మాత్రమే చెల్లిస్తే ఇది కుంభకోణం కాదా...? అంటూ కొన్ని బ్రాహ్మణసంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. తాము 'ఆళ్ల' చెల్లించినదానికంటే ఎక్కువ చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని తమకూ అవకాశం ఇవ్వాలని కోరింది. వీరి కోరికను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు వారికి అవకాశం కల్పించింది. దీంతో ఇప్పుడు తక్కువ ధరకే 'సదావర్తి' భూములు దక్కించుకున్నానని సంబరపడిన 'ఆళ్ల'కు చుక్కదెరయింది. ఇప్పుడు ఆయనకు ఆ భూములు దక్కడం అంత ఈజీ కాదు...! ఒక వైపు భూములు దక్కకపోగా...మరో వైపు ప్రభుత్వం ఆయనపై గురిపెట్టింది. ఆయన గతేడాది ప్రకటించిన విధంగా ఆయన ఆదాయపన్ను రిటర్న్స్‌లో తన ఆదాయం రెండు కోట్లుగా పేర్కొన్నారు.ఇప్పుడు ఎకాఎకిన రూ.27కోట్లు తెచ్చి భూములను కొనుగోలు చేశారు. మరి ఇంత సొమ్ము తన దగ్గర ఉంటే..ఈ సొమ్ముకు లెక్కలేవి? హైకోర్టులో మొదట తన దగ్గర అంత సొమ్ములేదని, తన స్నేహితులు, పరిచయస్తుల ద్వారా ఆ సొమ్మును సమీకరిస్తానని చెప్పిన 'ఆళ్ల' చివరకు ఆ సొమ్ము మొత్తం తానే చెల్లించారు...! ఈ సొమ్ము లెక్కలనే ఇప్పుడు టిడిపి ఆయుధంగా మలచుకోబోతోంది. తమకు కంటిలో నలుసులా మారిన 'ఆళ్ల' తాట తీయడానికి సిద్ధం అవుతుంది. రాజధాని ప్రాంతంలో చీటికి మాటికి గొడవలు సృష్టిస్తోన్న 'ఆళ్ల' వ్యవహారంపై ఆ పార్టీ అమీతుమీకి సిద్ధమైంది. చూద్దాం...మరి ఏం జరుగుతుందో...!?

(444)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ