WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మైనర్‌ భార్యతో శృంగారంలో పాల్గొంటే రేప్‌ కేసు...!

ఎవరనైనా వ్యక్తి తన మైనర్‌ భార్యతో శృంగారంలో పాల్గొంటే 'రేప్‌' కేసు పెట్టాలని 'సుప్రీంకోర్టు' ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సుప్రీంకోర్టు బెంచ్‌ దీనిపై కసరత్తు చేస్తోంది. బుధవారం నాడు సుప్రీంకోర్టులో ఈ వివాదంపై విచారణ జరిగింది. దీనిపై భారతప్రభుత్వ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు కోరింది. భారత వివాహచట్టం ప్రకారం యువతలకు వివాహవయస్సు 18సంవత్సరాలుగా నిర్ణయించారు. అయితే దేశంలో చాలా చోట్ల ఈ వయస్సును పరిగణలోకి తీసుకోకుండా వివాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా నిరుపేదలైన వారు బాల్యవివాహాల బారిన పడుతున్నారు. దేశ వ్యాప్తంగా పలు చోట్ల బాల్యవివాహాలు లెక్కలకు మించి జరుగుతున్నాయి. కొందరిలో అవగాహన లేకపోవడం, మరి కొందరు కుటుంబ ఇబ్బందుల నేపథ్యంలో బాల్యవివాహాల వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో ప్రభుత్వం నిర్ణయించిన 18సంవత్సరాల వయపరిమితి కేవలం చట్టాలకే పరిమితమవుతోంది. కాగా బాల్యవివాహల తరువాత బాలికలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని కొన్ని స్వచ్చంధ సంస్థలు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చాయి. 

   మైనర్‌ వివాహాల తరువాత సదరు మైనర్‌ బాలికపై భర్త శృంగారంలో పాల్గొనకుండా నిరోధించాలని వారు కోరుతున్నారు. ముఖ్యంగా 15-18 సంవత్సరాల లోపు ఉన్న బాలికలు ఈ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని దీనిని నిరోదించాలని వారు తమ పిటీషన్‌లో పేర్కొన్నారు. స్వంత భర్త అయినా మైనర్‌తో శృంగారం కోరుకుంటే దాన్ని 'రేప్‌'గా పరిగణించాలని వారు కోరుతున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం పెద్దగా స్పందించడం లేదు. దేశ వ్యాప్తంగా బాల్యవివాహలు జరుగుతున్నాయని, ఒకసారి వివాహం జరిగిన తరువాత వారిని శృంగారంలో పాల్గొనకుండా ఎలా నిరోధిస్తామని ప్రభుత్వం వాదిస్తోంది. దీనిపై చట్టం తెస్తే ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతుందని వారు భావిస్తున్నారు. బాల్యవివాహాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం, వాటిని నిరోధించడమే మార్గమని ప్రభుత్వం భావిస్తోంది. బాలికల బాల్యవివాహాలను నిరోధిస్తే ఇటు వంటి పరిస్థితులు తలెత్తవనేది ప్రభుత్వ అభిప్రాయం. కానీ స్వచ్చంధ సంస్థలు మాత్రం వయసుకు రాని బాలికలతో శృంగారం సమాజానికి చేటుని వాదిస్తోంది. వారి వాదన సరైనదే అయినా...ప్రభుత్వం ఈ విషయంలో చేయగలిగిందేమీ లేదని చెబుతోంది. మొత్తం మీద మైనర్‌భార్యతో శృంగారంలో పాల్గొంటే ఇబ్బందులు తప్పవు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.

(190)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ