లేటెస్ట్

‘యుపి’లో ‘బిజెపి’ గెలిస్తే ‘జగన్‌’కు కష్టాలే...!?

దేశవ్యాప్తంగా ఉత్కంఠతగా చూస్తోన్న ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో అధికార బిజెపి మరోసారి అధికారంలోకి వస్తుందని మెజార్టీ సర్వే సంస్థలు ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయపార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఈ విషయంలో ‘ఆంధ్రా’లోని అధికార వైకాపా, తెలంగాణలోని ‘టిఆర్‌ఎస్‌’లు తీవ్రమైన ఉత్కంఠను ఎదుర్కొంటున్నాయి. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో బిజెపి గెలిస్తే దాని ప్రభావం జాతీయస్థాయిలో ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ ఎన్నికల ఫలితాలను బట్టి తమ తమ రాజకీయ వ్యూహలను రచించుకోవాలని పలు ప్రాంతీయ పార్టీలు వేచి ఉన్నాయి. ఈ ఎన్నికలు రాబోయే సార్వత్రిక ఎన్నికలు సెమీఫైనల్‌గా అందరూ భావిస్తున్నారు కనుక యుపిలో బిజెపి గెలిస్తే దానికి తిరుగులేదని, అన్ని రాజకీయపార్టీలు ఒక నిర్ణయానికి వస్తాయి. అయితే ఈ ఎన్నికల్లో బిజెపి గెలిస్తే తెలుగురాష్ట్రాల్లో అది ఏ విధంగా వ్యవహరిస్తుందనే దానిపై ఇక్కడ పార్టీలు కిందామీదా అయిపోతున్నాయి. ముఖ్యంగా అధికార వైకాపాలో ఈ చింత ఎక్కువగా ఉంది. మూడేళ్ల ‘జగన్‌’ పాలనపై అన్ని వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తోన్న నేపథ్యంలో బిజెపి ఏమైనా సంచలన నిర్ణయం తీసుకుంటుందా..? అనే సందేహాలు ఆ పార్టీ నేతల నుంచే వ్యక్తం అవుతున్నాయి. స్వంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకులు కూడా ‘జగన్‌’ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి దాకా జాతీయస్థాయిలో వైకాపా మద్దతు అవసరమన్న భావనలో ‘జగన్‌’కు బిజెపి పెద్దలు అండగా ఉన్నారు. అయితే యుపిలో గెలిస్తే..ఇక ‘ఆంధ్రా’లో తమదైన మార్కు రాజకీయాన్ని వారు మొదలుపెడతారని ఓ సీనియర్‌ వైకాపా నాయకుడు ‘జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌’తో వ్యాఖ్యానించారు.


ఇటీవల కాలంలో 49 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు బిజెపిలోచేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. బిజెపి తలచుకుంటే వారంతా పార్టీ మారతారని, అప్పుడు ప్రధాన ప్రతిపక్షం బిజెపి అవుతుందని, వారితో పాటు మరికొందరు టిడిపి అసంతృప్తినేతలను పోగేసి 2024 ఎన్నికలకు ‘బిజెపి’ వెళుతుందనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికిప్పుడు ‘జగన్‌’ను దించరని, ఆయనపై ఉన్న సీబీఐ కేసులు, బాబాయి హత్య కేసులో సీబీఐకి పూర్తి స్వేచ్ఛ ఇస్తారని, దాంతో ఎవరూ ఏమి చేయకుండానే ‘జగన్‌’ సర్దుకోవాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇదొక్కటే కాదు..ఇప్పటి వరకూ రాష్ట్రం చేస్తోన్న అప్పులపై చూసీ చూడనట్లు వ్యవహరించిన బిజెపి పెద్దలు ఇక దాన్ని తేలిగ్గా వదిలిపెట్టరని, ‘జగన్‌’కు కొత్త అప్పులు పుట్టకుండా చేయడంతోపాటు, పాత అప్పులు, ఆదాయం ఏరకంగా ఖర్చు పెట్టారో లెక్కలు చెప్పాలని డిమాండ్‌ చేస్తారని, గతంలో ‘చంద్రబాబు’ పట్ల ఏ విధంగా వ్యవహరించారో అదే విధంగా ‘జగన్‌’ను కూడా ఇబ్బందులు పెడతారనే విశ్లేషణలు వస్తున్నాయి. కాగా రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో వైకాపా ఎటువంటి అభ్యంతరాలు పెట్టకుండా బిజెపి అభ్యర్థిని సమర్థిస్తుందని, తద్వారా మరికొన్నాళ్లు బిజెపి పెద్దల మద్దతు పొందాలనే భావన ‘జగన్‌’లో ఉందని చెబుతున్నారు. అయితే ఇటువంటి తాయిలాలకు బిజెపి లొంగదని, దక్షిణాదిలో బలమైన రాష్ట్రమైన ‘ఆంధ్రా’ను వశం చేసుకునేందుకు అది రేసుగుర్రంలా పరిగెత్తాలనే ఆలోచనతో ఉంది. ఇప్పటికే తెలంగాణలో అధికారం వైపు అడుగులు వేస్తోన్న ఆ పార్టీ ఇక ‘ఆంధ్రా’లోనూ అదే విధంగా వ్యవహరించబోతోంది. ఇదంతా యుపిలో గెలిస్తేనే..ఒకవేళ గెలవకపోతే..ఇప్పుడు ‘జగన్‌’కు ఏ విధంగా మద్దతు ఇస్తున్నారో..రాబోయే కాలంలో అంతకన్నా ఎక్కువ అండదండలు అందిస్తారు. మొత్తం మీద..యుపి ఎన్నికల ఫలితాలు తెలుగురాష్ట్రాల రాజకీయ భవిష్యత్‌ను మార్చబోతున్నాయి.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ