WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ఐలయ్య'కు 'కెసిఆర్‌' భయపడ్డారా...!?

తెలంగాణ వివాదాస్పద రచయిత 'కంచె ఐలయ్య' రాసిన 'సామాజిక స్మగ్లర్లు కోమటళ్ళు' అనే పుస్తకం వివాదం సృష్టిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ పుస్తకాన్ని నిషేదించాలని 'వైశ్యులు' డిమాండ్‌ చేస్తూ ప్రదర్శనలు చేస్తున్నారు. తమ మనోభావాలను కించపరిచి, అవమానించిన 'ఐలయ్య'పై చర్యలు తీసుకోవాలని కోరుతుండగా, ఆయనపై చర్య తీసుకుంటే ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయో అన్న భయంతో తెలంగాణ ప్రభుత్వం ఆచితూచి స్పందిస్తోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా 'ఐలయ్య'పై చర్య తీసుకోవాలని కోరుతూ పలు పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు అందాయి. ఆయన బ్రాహ్మణ,వైశ్య, హిందూమత వ్యతిరేకని ఆయన రాతలు సమాజంలో చిచ్చుపెట్టేవిధంగా ఉన్నాయని వారు ఆయా ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. 'ఐలయ్య'పై తెలంగాణలోనే కాకుండా, ఆంధ్రా,తమిళనాడు,కర్ణాటకల్లో కేసులు నమోదు అయ్యాయి. మిగతా రాష్ట్రాల్లో ఏమో కానీ..ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ప్రభుత్వం వెంటనే స్పందించింది. సమాజంలో చిచ్చుపెట్టే ఇటువంటి పుస్తకాలపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. తొలుత ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర డిజిపి సాంబశివరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 'దినేష్‌కుమార్‌'తో సమావేశమై సమీక్ష నిర్వహించారు. వైశ్యులు చేస్తున్న ఆందోళనలను పరిగణలోకి తీసుకుని ఆ పుస్తకాన్ని నిషేదించాలని నిర్ణయించారు. అయితే ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోవాలని భావించారు. దీంతో 'ఐలయ్య' విషయంలో ఆంధ్రా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని స్పష్టమైన సంకేతాలు పంపించింది.

  కాగా తెలంగాణలో మాత్రం 'ఐలయ్య' పుస్తకంపై కెసిఆర్‌ ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వైశ్యులు చేస్తున్న నిరసనలు రోజు రోజుకు ఉదృతం అవుతున్నా ప్రభుత్వం వైపు నుంచి మాత్రం స్పందన కనిపించడం లేదు. దీనిపై రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. 'ఐలయ్య' పుస్తకంపై చర్య తీసుకుంటే రాష్ట్రంలో భావన ప్రకటనా స్వేచ్చ లేదనే విమర్శలు వస్తాయనే భయం ఒకవైపు ఉండగా మరో వైపు దళిత,బిసీ,మైనార్టీ వర్గాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందనే భావన కూడా వ్యక్తం అవుతుంది. తెలంగాణలో దళిత,బిసీ,మైనార్టీ వర్గాలే అధికంగా ఉండడంతో వారికి కష్టం కలిగించే పని ఎందుకు చేయాలన్న తలంపుతో కెసిఆర్‌ ప్రభుత్వం కావాలనే మౌనం పాటిస్తుందని పలువురు విశ్లేషిస్తున్నారు. కేవలం బ్రాహ్మణ, ఆర్యవైశ్యులను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకుంటే, మిగతా వర్గాలు దూరమవుతాయనే భయం కెసిఆర్‌లో వ్యక్తం అవుతుందని వైశ్యవర్గానికి చెందిన నేతలు అంటున్నారు. తాము ఇంత ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటే అందుకేనన్న అనుమానాలు తమకు ఉన్నాయని వారు చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వ్యక్తుల భావన ప్రకటన స్వేచ్చను హరించివేస్తుందని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు 'ఐలయ్య'పై చర్యలు తీసుకుంటే లేనిపోని తలనొప్పులు తెచ్చుకున్న చందమే అవుతుందన్న ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఒకటి రెండు రోజుల్లో ఈ ఆందోళనలు తగ్గుతాయని తరువాత వీటిని పట్టించుకునేవారు ఉండరనే తలంపుతో కెసిఆర్‌ ప్రభుత్వం ఉంది. అదీ కాక నిన్న 'ఐలయ్య'కు మద్దతుగా 'టి-మాస్‌', గద్దర్‌, సిపిఎం, సిపిఐ,ఎంఐఎం వంటి పార్టీలు రంగంలోకి దిగడంతో ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అందుకే ఈ వివాదంపై ఎటువంటి చర్యలు తీసుకోరాదని నిర్ణయించుకుంది. మొత్తం మీద తీవ్ర వివాదాస్పదం అయిన విషయంపై ఆంధ్రా ప్రభుత్వం వెంటనే చర్యలకు ఉపక్రమించగా..తెలంగాణ ప్రభుత్వం మాత్రం మీన మేషాలు లెక్కిస్తుందని పేరు చెప్పడానికి ఇష్టపడని వైశ్య నేత ఒకరు మీడియాతో చెప్పారు.


(426)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ