లేటెస్ట్

‘బిజెపి’ గెలుపుతో ‘జగన్‌’,‘బాబు’లకు ఇక్కట్లే...!?

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి విజయం సాధించడంతో ఆ పార్టీకి ఇక తిరుగులేదని తేలిపోయింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం ఆ పార్టీ ధీమాగా వెళ్లడానికి ఆస్కారం ఏర్పడిరది. వాస్తవానికి ‘బిజెపి’ గెలుపు ముందు నుంచి ఊహిస్తున్నదే. అయితే ‘పంజాబ్‌’, ఉత్తరాఖండ్‌,రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగులుతుందని, ఉత్తరప్రదేశ్‌లో ‘అఖిలేష్‌’ మ్యాజిక్‌ చేస్తారేమోనని ‘బిజెపి’వ్యతిరేకులు ఆశలు పెట్టుకున్నారు. అయితే వారి ఆశలు అడియాశలే అయ్యాయి. దేశంలోనే పెద్దరాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌, చిన్న రాష్ట్రాలైన ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌ల్లో బిజెపి గెలవడంతో ఇక రాబోయే ఏ ఎన్నికల్లోనూ బిజెపి ప్రత్యర్థులుూ పార్టీని ఎదిరించే సాహసం చేయబోరు. దేశ వ్యాప్తంగా ఈ ఫలితాలు బిజెపిని మరోసారి తిరుగులేని శక్తిగా నిలపడంతో, ఆ ప్రభావం ‘బిజెపి’ ఉనికి పెద్దగా లేని దక్షిణాదిపై కూడా తీవ్రంగా ఉండబోతోంది. ఇప్పటికే ‘కర్నాటక’లో అధికారం చెలాయిస్తున్న ‘బిజెపి’ రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి ‘తెలంగాణ, కేరళ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిస్సా రాష్ట్రాల్లో బలపడాలనే బలమైన కోరికతో ఉంది. ప్రస్తుతం ఆ పార్టీ తెలంగాణలో అధికారం కైవసం చేసుకునేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటుండా, ఆంధ్రప్రదేశ్‌పై కూడా వలవిసురుతోంది. 


గత సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో నోటాతో పోటీ పడిన ‘బిజెపి’ వచ్చే ఎన్నికల నాటికి అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతోంది. ప్రస్తుతం సినీనటుడు ‘పవన్‌కళ్యాణ్‌’తో పొత్తుపెట్టుకుని పార్టీని బలోపేతం చేసుకోవాలని యత్నిస్తున్న ఆ పార్టీ రాబోయే రోజుల్లో అధికారంలో ఉన్న వైకాపాను లక్ష్యంగా చేసుకుంటుందా..? లేక ప్రతిపక్ష ‘టిడిపి’ని లక్ష్యంగా చేసుకుంటుందా..? అనే దానిపై స్పష్టత లేదు. రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికల సమయంలో తాము గెలవకపోయినా ఫర్వాలేదు..‘చంద్రబాబు’ గెలవకూడదనే లక్ష్యంతో పనిచేసిన ‘బిజెపి’ పెద్దలు రాబోయే ఎన్నికల నాటికి కూడా అదే ఉద్ధేశ్యంతో ఉంటారా..? లేక వారి ఆలోచనలో ఏమైనా మార్పు వచ్చిందా..? అనేది ఇప్పటి వరకూ తెలియదు. ‘పవన్‌’ను తమ కూటమికి నాయకుడిగా ఎంపిక చేసుకుని రాబోయే ఎన్నికల్లో ‘వైకాపా, టిడిపి’లను ఎదుర్కోవాలనే వ్యూహంతో ‘బిజెపి’ ఇప్పటి వరకూ ఉంది. అయితే..ప్రస్తుత రాజకీయపరిణామాలతో వేరే వ్యూహం అమలు చేస్తోందా..? అనే ప్రశ్న విశ్లేషకుల నుంచి వస్తోంది. 

అధికారంలో ఉన్న వైకాపాపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. సిఎం జగన్‌ ఎన్ని తప్పులు చేసినా, ‘చంద్రబాబు’కు మేలు చేకూరకూడదనే ఆలోచనతో ఇప్పటి వరకూ ‘జగన్‌’కు నష్టం కలిగించే చర్యలను వారు చేపట్టలేదు. ఇప్పుడు కూడా అదే ధోరణితో ఉంటారా..? లేక ‘జగన్‌’ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటారా..? అనేది చూడాల్సి ఉంది. వాస్తవానికి ‘బిజెపి’ కనుక సీరియస్‌గా ఉంటే ‘జగన్‌’ ప్రభుత్వం నిమిషాలమీద కూలిపోతుంది. ‘జగన్‌’ ప్రభుత్వం కూలితే అది ‘చంద్రబాబు’కు లాభమన్న భావనతో ఇప్పటి వరకూ వారు ‘జగన్‌’ను బలహీనపరచ లేదు. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల విజయం తరువాత వారు అదే ఉద్దేశ్యంతో ఉండరని,  ‘జగన్‌’పై ఇక అతిప్రేమను ప్రదర్శించరనే భావన రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తం అవుతోంది. ‘జగన్‌’ చేస్తోన్న తప్పులకు తాము బాధ్యత వహించాల్సి వస్తుందని, ఆయన బరువును ఇక దించేసుకుంటారనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు ‘జగన్‌’ తమకు కొన్ని బిల్లుల విషయంలో, రాజ్యసభలో సహకరించారని, దానికి బదులుగా ఆయనకు మేలు చేసే ఎన్నో చర్యలను తాము చేశామని దానికి దానికి సరిపోతుందనే భావన ‘బిజెపి’ పెద్దల్లో ఉందంటున్నారు. ‘జగన్‌’ కేసుల విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరించిన ‘బిజెపి’ పెద్దలు ఇక మీదట అలా ఉండరని, కేసుల విషయంలో సీబీఐకి పూర్తి స్వేచ్ఛ ఇస్తారంటున్నారు. సీబీఐకి పూర్తి స్వేచ్చ ఇస్తే రాష్ట్రంలో సంచలన విషయాలు బయటకు వస్తాయని, దాంతో ‘జగన్‌’ ప్రభుత్వం నిలువునా కూలుతుందనే అభిప్రాయం కూడా ఉంది. ‘జగన్‌’ స్వీయ తప్పిదాలవల్ల ఆయన ప్రభుత్వం కూలితే..అది తమ పార్టీ/కూటమి పుంజుకునేందుకు ఉపయోగపడుతుందనే భావన వారిలో ఉంది. ఇక ‘ఆంధ్రా’లో కూడా తమ ఆట మొదలైందని బిజెపి నాయకులు చెబుతున్నారు.  


మరో వైపు ప్రస్తుత ఫలితాలు ‘టిడిపి’ అధినేత ‘చంద్రబాబు’పై కూడా ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. నిన్నమొన్నటి దాకా..రాష్ట్రంలో బిజెపికి పెద్దగా ఓట్లు లేవని, ఆ పార్టీ గురించి భయపడాల్సిన అవసరం లేదనుకున్న ‘చంద్రబాబు’కు తాజా ఫలితాలతో ‘బిజెపి’లో ఎలా వ్యవహరించాలో అన్న దానిపై గందరగోళంలానికి గురవుతున్నారు. గత ఎన్నికల్లో తనను ఓడిరచినా ‘బిజెపి’ పట్ల ‘చంద్రబాబు’ మెతకవైఖరినే అవలంభిస్తున్నారు. ఆ పార్టీపై ఎటువంటి విమర్శలు/ఆరోపణలు చేయకుండా మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. కొంత మంది పార్టీ నాయకులు ఈ విషయంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోన్న ఆయన వారిని పట్టించుకోవడం లేదు. ఎందుకు ఆయన బిజెపి పట్ల మౌనాన్ని ఆశ్రయిస్తున్నారో..తాజా ఫలితాలతో రుజువైందని, ఈ విషయంలో ‘చంద్రబాబు’ వైఖరి సరైనదేనని మరోసారి రుజువైంది. తమను ఓడిరచిన పార్టీ ఎంత బలమైనదో..వారు ఏమి చేయగలరో తాజా ఫలితాలు నిరూపించాయని, ఇక ఆ పార్టీ విషయంలో మరింత జాగ్రత్తతో ఉండాలని, వారి నుంచి వచ్చే ఒత్తిడిని కూడా అదే చాకచక్యంతో ఎదుర్కోవాలని ‘చంద్రబాబు’ భావిస్తున్నారు. వారితో ఘర్షణ వైఖరిని అవలంభించకుండా పార్లమెంట్‌లో కీలక బిల్లుల సమయంలో, ఇతర విషయాలలో సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. అయితే టిడిపి ఎంత సమయమనం పాటించినా బిజెపి మాత్రం ఆయనను బలహీనపర్చే చర్యలను మాత్రం ఆపలేదు. తాజా ఫలితాల తరువాత వారు మరింత చురుగ్గా ‘చంద్రబాబు’పై కత్తులు దూస్తారని, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వారికి మరిన్ని ఆయుధాలను అందించాయని, బిజెపి సృష్టించే ఇక్కట్లను ‘చంద్రబాబు’ బయటపడతారో..లేదో..? కాగా ఇప్పటి వరకూ ‘బిజెపి’తో అంటీ ముట్టనట్లు ఉన్న ‘పవన్‌’ కూడా ఆ పార్టీతో పొత్తు గురించి మరికొంత కాలం ఊగిసలాడే ధోరణిని ప్రదర్శించవచ్చు. మొత్తం మీద ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు..దేశంలోనే కాకుండా రాష్ట్రంలోని రాజకీయపార్టీలకు కూడా చెమటలు పట్టిస్తున్నాయి. 0.5శాతం ఓట్లు లేని పార్టీని చూసి 50శాతం ఓట్లు, 40శాతం ఓట్లు ఉన్నపార్టీలు గజగజలాడిపోతున్నాయి. కాలం ఎంత విచిత్రమైనదో...?

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ