WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

చీరల ఖర్చుతో...ఓ సాగునీటి ప్రాజెక్టు కట్టొచ్చు...!

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసే ఆడంబరాలకు అంతే ఉండదు...! ఆయన ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో కరీంనగర్‌ వీధులను లండన్‌ వీధులను చేస్తానని ఒకసారి, హైదరాబాద్‌ నగరాన్ని న్యూయార్క్‌ చేస్తానని ఒకసారి...తెలంగాణలో ఏ నగరానికి వెళితే ఆ నగరాన్ని విదేశీయ నగరాలతో పోలుస్తూ అదే విధంగా చేస్తానని ఒకటే ప్రగల్బాలు పలికేవారు. కెసిఆర్‌ ప్రగల్బాలను తెలంగాణ ప్రజలు కూడా నమ్మేవారు. ఆయన ప్రకటించే వరాలను చూసి ముచ్చటచెంది... జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఆయన పార్టీకి ఓట్ల వర్షం కురిపించారు. 'దొర' చెప్పిన హామీలన్నీ అమలు అవుతాయని ఎక్కువ మంది తెలంగాణ ఓటర్లు భావించేవారు. అయితే మూడున్నర సంవత్సరాల నుంచి ఆయన హామీలను చూసి విసుగు చెందిన ప్రజలు ఇటీవలే...ఆయన హామీలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ బహిరంగంగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. 

  ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో ప్రధానమైన కోటి ఉద్యోగాల కల్పన, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు, దళితులకు మూడెకరాల సాగుభూమి వంటివి పక్కకు వెళ్లిపోయాయి. వాటి స్థానంలో ఇప్పుడు ఇంటికో చీర..ఇంటికో గొర్రె...ఇంటికో బర్రె అంటూ కొత్త నినాదాలు ఎత్తుకున్నారు. 'కెసిఆర్‌' తీరు చూసి అవాక్కవుతున్న తెలంగాణ వాదులు ఏమీ అనలేక మౌనంగా ఉండిపోతున్నారు. ఆయన ఆడంబరంగా ఇచ్చిన ప్రధాన హామీలు నెరవేరకపోయినా... చీర,గొర్రె,బర్రె హామీలైనా నెరవేరతాయని లబ్దిదారులు క్యూల్లో గంటల కొద్ది నిలబడి ఎదురు చూసినవారు కెసిఆర్‌ ఇచ్చిన గిప్టులను చూసి ఆయనపై దుమ్మెత్తిపోస్తున్నారు. నాసిరకమైన చీరలను ఇచ్చారని మహిళలు శాపనార్థాలు పెడుతున్నారు. కొన్ని చోట్ల ఆ చీరలను తగలబెడుతున్నారు..ఇదంతా  ఎలా ఉన్నా..ఇప్పుడు చీరల కోసం కెసిఆర్‌ చేసిన ఖర్చు చూసిన మేధావులు గుండెలు బాదుకుంటున్నారు. దాదాపు 250కోట్లు ఖర్చు పెట్టి ఆడంబరంగా చీరల స్కీమ్‌ను ప్రవేశపెట్టారని...ఇదే ఖర్చుతో ఒక చిన్నసైజు సాగునీటి ప్రాజెక్టు నిర్మించవచ్చని వారు అంటున్నారు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించన 'పట్టిసీమ' ప్రాజెక్టుకు అయిన ఖర్చు కేవలం వెయ్యికోట్ల రూపాయలు...దీనితో ఆ ప్రభుత్వం దాదాపు 13లక్షల ఎకరాలకు ఈ సంవత్సరం సాగునీరు ఇచ్చి పంటలను కాపాడి రైతులకు మేలు చేసింది. అంటే కెసిఆర్‌ చీరల ఖరీదు..పట్టిసీమ ప్రాజెక్టులో నాల్గోవంతు అన్నమాట. 

  ఈ చీరలకు చేసిన ఖర్చు వేరే ఉత్పాదక రంగంపై పెడితే దాని వల్ల కొంత మందికైనా ఉపాధి లభించేదని కొంతమంది మేధావులు చెబుతున్నారు. ఇంత ఖర్చు చేసినా చివరకు కెసిఆర్‌ మహిళల చేత చివాట్లు తినాల్సి వచ్చిందని, ఆలోచన లేకుండా తమది ధనిక రాష్ట్రమని గొప్పలకు పోయి..రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారని వారు విమర్శిస్తున్నారు. అంతే కాకుండా మాటిమాటికి తమది ధనిక రాష్ట్రమని చెప్పే కెసిఆర్‌...చీరల పంపిణీ సందర్భంగా వేసిన లెక్క కూడా విస్తుగొలుపుతోంది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికే చీరల పంచాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో దాదాపు 87శాతం మంది పేదలు ఉన్నట్లు ఈ సందర్భంగా లెక్కతేల్చి చీరల పంపిణీకి పూనుకుంది. రాష్ట్ర జనాభాలో 87శాతం మంది పేదలు ఉంటే అది ధనిక రాష్ట్రమెట్లా అవుతుంది...? మరి తెలంగాణ మేధావులు..దీనిపై ఎందుకు ప్రశ్నించడం లేదో..!? నిజం నిష్టూరంగా ఉన్నా చెప్పడం..జర్నలిజం బాధ్యత...!


(దావులూరి హనుమంతరావు)


(423)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ