లేటెస్ట్

‘పెద్దిరెడ్డి, బొత్స,కొడాలి,పేర్ని,కన్నబాబు, అప్పలరాజులకు కొనసాగింపు...!?

ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఎట్టకేలకు తన మంత్రివర్గాన్ని విస్తరిస్తానని ఇటీవల తెలియజేశారు. మూడేళ్ల క్రితం అధికారంలోకి వచ్చి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినప్పుడు వీరిలో దాదాపు 80శాతం మంది మంత్రులను రెండున్నరేళ్ల తరువాత తొలగిస్తానని, వారి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇస్తానని ప్రకటించారు. అయితే మంత్రివర్గాన్ని రెండున్నరేళ్ల తరువాత ఆయన విస్తరించలేదు. దాదాపు మూడేళ్ల తరువాత మంత్రివర్గ విస్తరణ సాగబోతోంది. వీరిలో సీనియర్‌ మంత్రులైన ‘పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, పేర్ని నాని, కన్నబాబు, అప్పలరాజులను మంత్రివర్గంలో కొనసాగించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని ప్రచారం సాగుతోంది. వీరు తప్ప మిగతా వారినందరినీ తొలగిస్తారని వైకాపా వర్గాలు చెబుతున్నాయి. ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల్లో ఒక్కరినీ కొనసాగించరని అంటున్నారు. రాయలసీమలో సీనియర్‌ అయిన ‘పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి’ని మంత్రివర్గంలో కొనసాగిస్తారని, వచ్చే ఎన్నికల్లో ‘చిత్తూరు’ జిల్లా బాధ్యతలన్నీ ఆయన మీదే ‘జగన్‌’పెడతారని, అక్కడ అభ్యర్థుల గెలుపు బాధ్యత ‘పెద్దిరెడ్డి’దేనని అందుకే ఆయనను మంత్రివర్గంలో కొనసాగించాలని నిర్ణయించారంటున్నారు. ఇక ఉత్తరాంధ్రలో సీనియర్‌ మంత్రి బొత్స సత్యనారాయణను కూడా మంత్రివర్గంలో కొనసాగిస్తారని చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఆయనను తననుమంత్రి వర్గం నుంచి తొలగిస్తే రాజ్యసభ ఇవ్వాలని ‘జగన్‌’ను అడుగుతున్నారు. అయితే రాజ్యసభ ఇచ్చే ప్రసక్తే లేదని, దాని బదులు మంత్రిగానే కొనసాగిస్తానని ఆయన హామీ ఇచ్చారని తెలుస్తోంది. ‘విజయనగరం’ గెలుపు బాధ్యతలను ‘బొత్స’పై ఉంచినట్లు చెబుతున్నారు. ఇక ‘కాపు’ సామాజికవర్గంలో కీలకమైన ‘పేర్నినాని, కురసాల కన్నబాబు’లను కూడా మంత్రివర్గంలో కొనసాగిస్తారని ప్రచారం సాగుతోంది. ఇటీవల కాలంలో సినిమా టిక్కెట్ల సమస్యపై ‘పేర్నినాని’ సమర్థవంతంగా వ్యవహరించారని, పైగా ‘జగన్‌’కు వీరవిధేయత కనబరుస్తుండడంతో ఆయనను కొనసాగించాలని నిర్ణయించారంటున్నారు. అయితే ఇక్కడో సమస్య వస్తోంది. నూతనంగా ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయనుండడంతో ‘పేర్ని నాని, కొడాలి నాని’లు ఇద్దరూ ‘మచిలీపట్నం’ జిల్లాలోకే వస్తున్నారు. వీరిద్దరినీ మంత్రివర్గంలో కొనసాగిస్తే ఒకే జిల్లా నుంచి ఇద్దరు ఒసీలకు మంత్రి పదవులు ఇచ్చినట్లు అవుతుంది. దీంతో ‘పేర్ని’ విషయంలో మరో నిర్ణయం తీసుకుంటారా..? లేక కొనసాగిస్తారా..? చూడాలి.


‘కొడాలి నాని’ని మంత్రివర్గంలో కొనసాగించడం ఖరారే. ఆయన విషయంలో ‘జగన్‌’ రెండో నిర్ణయం తీసుకోరు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు ‘లోకేష్‌’లను అడ్డగోలుగా దూషిస్తూ ఆయన ‘జగన్‌’ వద్ద మంచి మార్కులు దక్కించుకున్నారు. ‘చంద్రబాబు’ సామాజికవర్గంలో ఇక అంత నోరున్న మరో ఎమ్మెల్యే లేరు. దీంతో ‘కొడాలి’ని ఖచ్చితంగా మంత్రివర్గంలో ‘జగన్‌’ కొనసాగిస్తారని ప్రచారం సాగుతోంది. ‘కాపు’ సామాజికవర్గం నుంచి మరో మంత్రి ‘కురసాల కన్నబాబు’ను కూడా కొనసాగిస్తారనే ప్రచారం ఉంది. ‘చిరంజీవి’తో మంచి సాన్నిహిత్యం ఉన్న ‘కురసాల’ను కొనసాగిస్తారంటున్నారు. మత్స్యకారవర్గం నుంచి ‘సీదిరి అప్పలరాజు’ను కూడా కొనసాగిస్తారంటున్నారు. ఈయన కూడా ‘చంద్రబాబు’పై విరుచుకుపడుతుంటారు. మొత్తం మీద ఉన్న మంత్రుల్లో అరడజన్‌ మంది మంత్రులను ‘జగన్‌’ మంత్రివర్గంలో కొనసాగిస్తారని, మిగతా వారి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ